2017 బ్లాక్‌ బస్టర్‌ గౌతమీ పుత్ర శాతకర్ణి

0
391
సంక్రాంతి సినిమాల్లో బాలయ్యకు తిరుగులేదు – ఆడియో ఆవిష్కరణలో తెదేపా నేత గన్ని
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 30 : యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి 2017వ సంవత్సరం బ్లాక్‌ బస్టర్‌గా నిలుస్తుందని, ఇందులో ఎటువంటి సందేహం లేదని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. స్థానిక సారంగధరమెట్టలో నందమూరి బాలకృష్ణ అభిమానుల సంఘం ఆధ్వర్యాన ఈరోజు   ఆ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ కార్పొరేటర్‌, బాలయ్య అభిమానుల సంఘం నాయకులు పరిమివాసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న గన్ని కృష్ణ ఆడియోను ఆవిష్కరించి మాట్లాడారు. సంక్రాంతి పండుగలకు విడుదలయ్యే సినిమాలలో హీరో బాలకృష్ణకు తిరుగులేదన్నారు. చరిత్ర ఆధారంగా నిర్మించిన గౌతమిపుత్ర శాతకర్ణి తప్పనిసరిగా సూపర్‌హిట్‌ అవుతుందని, ఎంతో ప్రభావితం చేసిన శాతకర్ణి గురించి తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు సినిమా రంగాన్ని ఏకచ్చత్రాధిపత్యంగా ఏలిన మహానటుడు నందమూరి తారక రామారావు నట వారసునిగా తెలుగు తెరకు పరిచయమైన బాలకృష్ణ ఆయన వారసత్వాన్ని నిలబెట్టారని కొనియాడారు. బాలకృష్ణ మొదటి చిత్రం తాతా మనవడు అశోకా ధియేటర్‌లో విడుదలయ్యిందని, ఇప్పుడు 100వ చిత్రం కూడా ఆ ధియేటర్‌లోనే విడుదల కావడం చూస్తుంటే చరిత్ర పునరావృతం  అవుతుందని గన్ని ధీమాగా చెప్పారు. ఆర్యాపురం బ్యాంక్‌ చైర్మన్‌, జిల్లా డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు చల్లా శంకరరావు మాట్లాడుతూ తాను ఎన్‌టిఆర్‌కు వీరాభిమానినని, సీతారామ కల్యాణం 60 సార్లు చూశానని చెప్పారు. భారతదేశం గర్వించతగ్గ నటుడు, అందగాడు ఎన్‌టిఆర్‌ అని, ఆయన నట వారసుడు బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహాం లేదని అన్నారు.  47వ డివిజన్‌ కార్పొరేటర్‌ రేలంగి శ్రీదేవి మాట్లాడుతూ చరిత్రకు సంబంధించిన సినిమాలను తీసేటప్పుడు వైవిధ్యమైన పాత్రలు పోషించే సత్తా ఒక్క నందమూరి కుటుంబానికే ఉందని చెప్పారు. 48వ డివిజన్‌ కార్పొరేటర్‌ గరగ పార్వతి మాట్లాడుతూ ఈ చిత్రం తెలుగు ప్రజలకు కానుకగా విడుదల కాబోతోందని, సంక్రాంతి  సినిమాల్లో సూపర్‌హిట్‌ సాధిస్తుందన్నారు. పరిమి వాసు మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబంధించిన ట్రీజర్ను చూస్తేనే ఒళ్ళు పులకరిస్తోందని, 84 రోజుల్లో ఎలా నిర్మించారన్నది ప్రశ్నార్థకంగా ఉందన్నారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలకు సరిపడే ఏకైక హీరో బాలయ్యేనని, తెలుగు ప్రజలు గర్వించతగ్గ చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణి నిలుస్తుందని ఆకాంక్షించారు. బాలయ్య సన్నిహితుడు రత్నాకర్‌, దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, నందమూరి అభిమానుల సంఘం అధ్యక్షులు గొర్రెల రమణ, డిస్ట్రిబ్యూటర్‌ జాస్తి రామకృష్ణ, బిక్కిన సాంబశివరావు, రెడ్డి మణేశ్వరరావు, ఉప్పులూరి జానకిరామయ్య, మళ్ళ వెంకట్రాజు, ఎగ్జిబిటర్‌ మురళి, మొల్లి చిన్నియాదవ్‌, గరగ మురళీకృష్ణ, చిట్టూరి ప్రవీణ్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.