2020 నాటికి దేశంలో అన్ని గ్రామాలకు విద్యుత్‌

0
236
జాంపేట సబ్‌ స్టేషన్‌ శంకుస్థాపనలో సిటీ ఎమ్మెల్యే ఆకుల
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 23 : ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో 2020 నాటికి దేశంలో అన్ని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా ఉంటుందని సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ అన్నారు. స్థానిక జాంపేట మార్కెట్‌ వద్ద ఎపిఇపిడిసిఎల్‌ ఆధ్వర్యంలో రూ.2.19 కోట్లతో సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి ఎమ్మెల్యే ఆకుల ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆకుల మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పాదక సామర్ధ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రకాశంనగర్‌ ప్రాంతంలో మరో సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి స్థల సేకరణ చేస్తామని తెలిపారు. సోలార్‌ పద్ధతి ద్వారా ఎక్కువ విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవచ్చని, ప్రతి ఒక్కరూ ఎల్‌ఇడి బల్బులు ఉపయోగించడం ద్వారా విద్యుత్‌ ఆదా అవుతుందన్నారు. గతంలో విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక నిరాటంకంగా విద్యుత్‌ సరఫరా ఉందన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో రాష్ట్రానికి మిగులు విద్యుత్‌ ఉందని, దానిని రాష్ట్రాభివృద్ధికి వినియోగించాలని సూచించారు. జిల్లాలో రూ.300 కోట్లు నిధులు మంజూరయ్యాయని, దాని ద్వారా అవసరమైన చోట్ల సబ్‌ స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాయలసీమ, విశాఖ జిల్లాలలో సోలార్‌ పవర్‌ప్లాంట్ల నిర్మాణానికి అంకురార్పణ జరుగుతుందన్నారు. మేయర్‌ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ నగరంలో అవసరమైన చోట్ల సబ్‌ స్టేషన్ల నిర్మాణానికి స్థలం సమకూర్చేందుకు సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఇ శ్యామ్‌బాబు, ఎస్‌.రాజబాబు, ఎడిఇ రత్నాలరావు, దాట్ల శ్రీధర్‌వర్మ, స్థానిక కార్పొరేటర్‌ మజ్జి నూకరత్నం, మజ్జి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.