22 నుంచి ఇంటింటా ధర్మజ్యోతి 

0
120
పతంజలి శ్రీనివాస్‌ వెల్లడి
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 20 : మనుషుల్లో ఉన్న ఈర్ష్య, అసూయా, ద్వేషాలను పారద్రోలేందుకు ఇంటింటా ధర్మజ్యోతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రణవయోగ సంకల్ప సమితి వ్యవస్ధాపకుడు పతంజలి శ్రీనివాస్‌ వెల్లడించారు. స్థానిక రెల్లిపేట శారదానగర్‌లో ఇంటింటా ధర్మజ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని శ్రీ విద్యారణ్య భారతీ స్వామిజీ ఈనెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో వివేకానంద యోగా యూనివర్సిటీ కో ప్రొఫెసర్‌ కంభంపాటి సుబ్రహ్మణ్యంతో కలిసి పతంజలి శ్రీనివాస్‌ మాట్లాడారు. స్వామిజీ స్వయంగా ప్రతీ ఇంటికి వెళ్లి ధర్మజ్యోతి ప్రజల్విస్తారన్నారు. దేశంలో ఎక్కడా ఇటువంటి కార్యక్రమం ఇప్పటివరకు జరగలేదన్నారు. కులం, మతంతో సంబంధం లేకుండా జరుగుతున్న ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు. ధర్మాన్ని మనం రక్షించడం ద్వారా అది మనల్ని రక్షిస్తుందని ఈ విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పి ప్రజల్ని ధర్మబద్ధుల్ని చేయడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. భారతదేశం ధర్మభూమి అని ప్రతీ ఒక్కరు ధర్మాన్ని పాటించడంతో పాటు తోటివారికి సహాయ సహకారాలు అందించడం ద్వారా అందరూ అభివృద్ధి సాధించేందుకు అవసరమైన తోడ్పాటు అందించేలా చైతన్యం తీసుకుని రావడమే లక్ష్యమన్నారు. దీనికి ముందు ఇన్నీసుపేట సప్పా వారి వీధిలో ఉన్న తమ నివాసంలో జరిగే గణపతి హొమంలో స్వామిజీ పాల్గొంటారని వివరించారు. 23వ తేదీ ఉదయం 7 గంటలకు గౌతమీఘాట్‌లో జరుగుతున్న మధుమేహ వ్యాధి నివారణ శిబిరం ముగింపు కార్యక్రమం, 11 గంటలకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జరిగే ఖైదీ సోదరులకు యోగ్యతా పత్రాల ప్రధానోత్సవంలో స్వామీజీ పాల్గొంటారన్నారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు అడ్డతీగల మండలం కోనలోవ గ్రామంలో జరిగే ఇంటింటా ధర్మజ్యోతి ప్రజ్వలనలో ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమాలకు సమరసత సేవా ఫౌండేషన్‌ సహకరిస్తుందని తెలిపారు. సమావేశంలో సమరసత ఫౌండేషన్‌ ప్రతినిధులు పద్మజ, పద్మశ్రీ, రాఘవరావు, నాగమణి, లింగమూర్తి, నగర ప్రచారక్‌ రామకృష్ణ, ఉత్తమ రౌతు గారపాటి అమ్మిరాజు, విశ్వహిందూ పరిషత్‌ ప్రతినిధి నందకిషోర్‌ జవ్వార్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here