22 నుంచి నర్తనరంగ స్వర్ణోత్సవం

0
170
మూడురోజుల పాటు నిర్వహణ -14 మందికి సప్పా ఎక్సలెన్సీ అవార్డులు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 20 : ప్రముఖ నాట్యచార్యులు, నర్తనరుషి డాక్టర్‌ సప్పా దుర్గాప్రసాద్‌ నాట్యరంగంలో ప్రవేశించి 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు నర్తన రంగ స్వర్ణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక ఎస్‌కెవిటి స్కూల్‌ రోడ్‌లో ఉన్న నటరాజ నృత్యనికేతన్‌లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో  దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించిన సప్పా దుర్గాప్రసాద్‌ వివరాలు వెల్లడించారు. 50 సంవత్సరాల నర్తనయానం పేరుతో శ్రీ వేంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు వైఖానస ఆగమ పండితులు పంచాంగం వెంకట రంగాచార్యులు, ఎస్‌బిఐ డిజిఎం గిరిధన్‌ జ్యోతి ప్రకాశనంతో ప్రారంభమవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వివిధ ప్రాంతాల ప్రముఖ నాట్యాచార్యుల శిష్యబృందాలు పేరిణి శివకుమార్‌, పంపన భాస్కకుమారి, నీలి శార్వాణి, డి.హేమసుందర్‌, జి.అచ్యుతాంబ, కెఎస్‌ రాము నృత్యప్రదర్శనలు ఇస్తారు. వివిధ రంగాల ప్రముఖులు బులుసు వివిఎస్‌ మూర్తి, విఎస్‌ఎస్‌ కృష్ణకుమార్‌, పసుమర్తి శ్రీనివాసశర్మ,పేరిణి కుమార్‌, కుమార సత్యనారాయణ, రాజ్‌కుమార్‌ వడయార్‌, డాక్టర్‌ గుబ్బల రాంబాబులకు సప్పా ఎక్స్‌లెన్స్‌-2019 పేరుతో అవార్డులు అందచేస్తారు. రాష్ట్ర మంత్రులు మోపిదేవి వెంకట రమణ, తానేటి వనిత, ఎంపీలు మార్గాని భరత్‌రామ్‌, వంగా గీత, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్‌, గోరంట్ల బుచ్చియ్యచౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు హాజరవుతారని తెలిపారు. 23న శనివారం శ్రీ మహాలక్ష్మీ సమేత చిన వేంకన్నబాబు పీఠాధిపతి శ్రీమాన్‌ చిన్న వేంకన్నబాబు జ్యోతి వెలిగిస్తారన్నారు. భారతావనిలో వివిధ ప్రాంతాల్లో నృత్యకళాశాలలు స్థాపించి డాక్టర్‌ సప్పా దుర్గాప్రసాద్‌ పున: సృష్టి చేసిన ఆలయనృత్యంలో శిక్షణ ఇస్తున్న నాట్యాచార్యుల శిష్యబృందాలు ప్రదర్శనలు ఇస్తాయన్నారు. సప్పా దుర్గాప్రసాద్‌ కళా ప్రసంగం అనంతరం పి.క్షీరసాగరిక, గౌతమీరాణి, ఎస్‌.రమ్యశ్రీ, ఆదిమూలం లక్ష్మణరావు, కోరుపోలు నాగరాజు,సప్పా మోహన్‌కుమార్‌, ఎం.వరలక్ష్మీల శిష్యబృందాలు నర్తిస్తాయన్నారు. అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు పలు రంగాలకు చెందిన చిన వెంకన్నబాబు, కెవి రెడ్డి, సత్తి భాస్కరరెడ్డి, రాయవరపు సత్యభామ, పింజర్ల అనిత, ఆదిమూలం లక్ష్మణరావు, విప్పర్తి సురేష్‌లకు ఎక్సలెన్సీ అవార్డులు అందిస్తారు. 24న ఆదివారం ఉదయం 9 గంటలకు డాక్టర్‌ సప్పా దుర్గాప్రసాద్‌ పున:సృష్టి చేసిన ఆలయ నృత్యం ప్రదర్శనల కార్యక్రమాన్ని శివకామేశ్వరి పీఠాధిపతి ఈమని దక్షిణామూర్తి ప్రారంభిస్తారు. సప్పా వద్ద ఆలయ నృత్యంలో శిష్యరికం చేసి వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన శిష్యుల నృత్యప్రదర్శన జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో చావలి రాజేశ్వరరావు, కె.సత్యనారాయణ, పివిఎస్‌ కృష్ణారావు, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here