27 నెలలు – రూ. 400 కోట్లు

0
504
అభివృద్ధి చిట్టా విప్పిన రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  26 :  తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్‌ నియోజకవర్గంలో  27 నెలల వ్యవధిలో వివిధ పథకాల కింద రూ. 400 కోట్లతో పనులు చేపట్టామని, ప్రచార ఆర్భాటాలకు దూరంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నామని రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. తన నివాసంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన నియోజకవర్గంలో రెండు మండలాలు, 21 గ్రామాలు, కార్పొరేషన్‌ డివిజన్లు తొమ్మిది ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్ధిక లోటుతో సతమతమవుతున్నా రూరల్‌ నియోజకవర్గంలో రహదారులు, మురుగు కాలువలు, మంచినీటి పైప్‌లైన్ల నిర్మాణం చేపట్టామని, పారదర్శక పాలనతో ఆదాయ వనరులను పెంచామన్నారు. తన నియోజకవర్గ పరిధిలో ఎన్‌టిఆర్‌ సుజల నీటి ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. రైతులు, మహిళలు,  మైనార్టీలు, కాపులకు దాదాపు రూ. 110 కోట్ల నిధులను మంజూరు చేయించామని తెలిపారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నూతన భవనాలు నిర్మించామని, అభివృద్ధిలో వెనుకబడిన ధవళేశ్వరం గ్రామాన్ని ప్రగతి పథంలో నడుపుతున్నామన్నారు. పుష్కరాల్లో చేపట్టిన పనులన్నీ నాణ్యతగా జరిగాయని, ఇటీవల కురిసిన వర్షాలకు రహదారులు దెబ్బతిన్నాయన్నారు. పుష్కరాలకు కేటాయించిన నిధుల్లో రూ. 11. 50 కోట్లను నిర్మాణాలకే ఖర్చు చేశారని తెలిపారు.  అఖండ గోదావరి ప్రాజక్ట్‌ను ముఖ్యమంత్రి మంజూరు చేశారని, దీంతో పిచ్చుకల్లంక, కేతావారి లంకలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వరకు అభివృద్ధి చేసే విధంగా గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీని ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు.  కొద్దిరోజుల్లో కొత్త మాస్టర్‌ ప్లాన్‌ రాబోతోందని , దీంతో నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. స్ధలాలు, గృహాల కోసం దరఖాస్తులు భారీగా వస్తున్నాయని, అయితే నగరంలో ఇటీవల లబ్ధిదారులకు అందజేసిన ప్రభుత్వ గృహాలను స్వాధీనం చేసుకోవాలని, వాటిలో లబ్ధిదారులు నివసించకపోతే ఆ ఇళ్ళను మరొకరికి  కేటాయిస్తామని, అందుకు నాలుగు నెలల సమయాన్ని ఇస్తున్నామన్నారు. నగర పాలక సంస్ధలో పరిపాలన గాడిలోకి తెస్తున్నామని అన్నారు. రాజమహేంద్రవరమే తన కేంద్ర స్థానమని, పార్టీకి ఈ ప్రాంతమే అండగా నిలిచిందన్నారు. నవంబర్‌ 1 నుంచి జనచైతన్య యాత్రలను చేపట్టి చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకుంటామన్నారు. రూరల్‌ నియోజకవర్గంలో కొత్తగా 3,480 ఫించన్లను మంజూరు చేయించామని, పది వేల గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామని, తాను చేస్తున్న అభివృద్ధిపై కొందరు విమర్శలు చేస్తున్నారని, దమ్ముంటే గుండెలపై చేయి వేసుకుని నిజం చెప్పాలని సవాలు చేశారు. విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, రూరల్‌ నాయకులు మార్ని వాసు, మార్గాని సత్యనారాయణ, గెడ్డం గణపతి, ఎండీఓ రమణారెడ్డి పాల్గొన్నారు.