28 నుంచి దేవీచౌక్‌లో శరన్నవరాత్రి వేడుకలు

0
128
ఏటా మాదిరిగా ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 13 : ఏటా మాదిరిగా నగరంలోని దేవీచౌక్‌లో 86వ శ్రీ దేవి శరన్నవరాత్రి వేడుకల నిర్వహణకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ధగధగలాడే విద్యుద్దీపాల కాంతులు, పలు రకాల అందమైన సెట్టింగులకు శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు, నిర్వహించే కార్యక్రమాల వివరాలను స్థానిక దేవీచౌక్‌ దేవీ కళ్యాణ మండపంలో ఈ ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తోలేటి ధనరాజు వెల్లడించారు. 28వ తేదీ శనివారం రాత్రి 12.06 గంటలకు అమ్మవారి విగ్రహప్రతిష్ట జరుగుతుందని, 29న ఆదివారం ఉదయం 9.54 గంటలకు కలశస్ధాపన పూజ నిర్వహిస్తారన్నారు. అక్టోబర్‌ 2వ తేదీ బుధవారం ఉదయం 108 మంది దంపతులతో కుంకుమ పూజలు జరుగుతాయన్నారు. ప్రతీ ఏటా దాతల సహకారంతో దేవీ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. 29వ తేదీ ఆదివారం కనకదుర్గ మహత్యం, 30వ తేదీ సోమవారం నాలుగు పేరెన్నికగన్న నాటకాల్లో ముఖ్య ఘట్టాలు, 1 వ తేదీ  మంగళవారం సత్యహరిశ్చంద్ర, 2న బుధవారం బాలనాగమ్మ, 3న గురువారం హైదరాబాద్‌కు చెందిన సినీ సంగీత ఆర్కెస్ట్రాలో భాగంగా రోషన్‌లాల్‌ ఆర్కెస్ట్రా, జబర్ధస్త్‌లో బుల్లెట్‌ భాస్కర్‌ టీమ్‌కి చెందిన ఆరుగురు సభ్యులు కామెడీ సన్నివేశాలు ప్రదర్శిస్తారన్నారు. 4వ తేదీ శుక్రవారం ధవళేశ్వరంలో రాధాకృష్ణ కళాక్షేత్రం కూచిపూడి, జానపద నృత్యాలు, 5న చింతామణి, 6న ఆదివారం సత్యహరిశ్చంద్ర, 7న సోమవారం కాకినాడ గౌతమీ ఆర్కెస్ట్రా వారి ఘంటసాల భక్తిగీతాలు, 8న మంగళవారం శ్రీరామాంజనేయ యుద్ధం, 9న బుధవారం కురుక్షేత్రం నాటకాల ప్రదర్శన జరుగుతుందని వివరించారు. 29వ తేదీ రాత్రి ఆదివారం రాత్రి జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, సిటీ, రూరల్‌ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చియ్యచౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎపిఐఐసి మాజీ చైర్మన్‌, వైసిపి సిటీ కో ఆర్డినేటర్‌ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం, నగర పాలక సంస్థ కమిషనర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ, అర్బన్‌ జిల్లా ఎస్పీ షిమోషీ బాజ్‌పాయ్‌, అదనపు ఎస్పీ లతా మాధురి హాజరవుతున్నారని తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తున్న కార్పొరేషన్‌, పోలీస్‌, విద్యుత్‌ శాఖల అధికారులకు కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. బత్తుల రాజేశ్వరరావు స్టేజ్‌ సెట్టింగ్‌లు, వేమగిరికి చెందిన ప్రకాశరావు విద్యుత్‌ దీపాలంకరణ చేస్తారన్నారు. సమావేశంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు బత్తుల రాజరాజేశ్వరరావు, పడాల సూర్యకోటేశ్వరరావు, ఆకుల వెంకటేశ్వరరావు, బళ్లా జయసూర్యనారాయణ,కాలెపు వీరభద్ర స్వామి (బాబీ), మేడిశెట్టి కృష్ణారావు, పిల్లి వెంకట రమేష్‌, ఆశపు దుర్గామల్లిఖార్జునరావు (మల్లిబాబు) తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here