31 లోగా శెట్టిబలిజ కార్పొరేషన్‌ను ప్రకటించాలి

0
158
లేకుంటే దశలవారీగా గ్రామ స్థాయి నుంచి ఉద్యమం
శెట్టిబలిజ కార్పొరేషన్‌ సాధన సమితి ప్రకటన
రాజమహేంద్రవరం, జనవరి 7 : రాష్ట్రంలో అత్యధిక జనాభా కల్గిన శెట్టిబలిజలకు ప్రత్యేకంగా శెట్టిబలిజ కార్పొరేషన్‌ను ఈ నెల 31వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని శెట్టిబలిజ కార్పొరేషన్‌ సాధన సమితి రాష్ట్ర ప్రతినిధులు సభ డిమాండ్‌ చేసింది. నగరంలోని బొమ్మన రామచంద్రరావు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ట్రస్ట్‌ కమ్యూనిటీ హాల్లో ఈరోజు శెట్టిబలిజ కార్పొరేషన్‌ సాధన రాష్ట్ర ప్రతినిధులు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజ మహనాడు కన్వీనర్‌, రాష్ట్ర శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు కుడుపూడి సూర్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ ప్రతినిధుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కుడిపూడి సూర్యనారాయణ పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కువ జనాభా కల్గిన శెట్టిబలిజలకు ప్రత్యేకంగా శెట్టిబలిజ కార్పొరేషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. తద్వారా శెట్టిబలిజల విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధికి దోహద పడాలని తీర్మానించినట్లు చెప్పారు. శెట్టిబలిజ కార్పొరేషన్‌ను ఈ నెల 31వ తేదీ లోగా ప్రకటించాలని, లేనిపక్షంలో దశల వారీ ఉద్యమాన్ని గ్రామ స్థాయి నుంచి రూపొందించేందుకు తీర్మానం చేసినట్లు వివరించారు. రాబోయే ఎన్నికల్లో శెట్టిబలిజలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే ప్రధాన పార్టీలకు సహకరిస్తామని తెలిపారు. ఇప్పటి వరకూ వైస్‌ చాన్సలర్‌ పదవి దక్కని శెట్టిబలిజ జాతిలోని మేథావులకు రెండు వీసీలు ఇవ్వాలని, ప్రత్యేకంగా నన్నయ్య యూనివర్శిటీ విసిగా శెట్టిబలిజలను నియమించాలని తీర్మానించారు. ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో శెట్టిబలిజ కులస్తులకు కళ్యాణ మండపాలు నిర్మించాలని, ప్రస్తుత ప్రభుత్వంలో తమ సామాజిక వర్గానికి చెందిన అమాత్యులు శెట్టిబలిజ కార్పొరేషన్‌ను రాకుండా సైంధువుల్లా అడ్డుకుంటున్నారని జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి వాసంశెట్టి గంగాధరరావు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో వీరికి తగిన గుణపాఠం దప్పదని ఆయన హెచ్చరించారు. శెట్టిబలిజ కార్పొరేషన్‌ను సాధించే వరకూ తమ ఉద్యమం ఆగదని సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ సమావేశంలో శెట్టి బలిజ సంఘ నాయకులు సానబోయిన రామారావు, గెద్దాడ వెంకటేశ్వరరావు, గుబ్బల తులసీ కుమార్‌, అప్పారి జయప్రకాశరావు, మేడిశెట్టి తాతబ్బాయి, ఇల్లు శివ ప్రసాద్‌, డాక్టర్‌ కడలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here