7న అఖిల భారత జాతీయ ఓబిసి మహాసభ

0
215
ఛలో హైదరాబాద్‌కు తరలిరండి – బిపి మండల్‌ నివేదిక అమలు చేయాలని డిమాండ్‌
రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు
జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మజ్జి.. నగర అధ్యక్షునిగా గోలి
రాజమహేంద్రవరం, జులై 27 : దేశవ్యాప్తంగా ఉన్న బీసిల స్థితి, గతులను అధ్యయనం చేసి బిపి మండల్‌ ఇచ్చిన నివేదికను అమలు చేయాలని ఎపి బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు డిమాండ్‌ చేశారు. వచ్చేనెల 7న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అఖిల భారత జాతీయ ఓబిసి మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ చేపట్టిన జిల్లా యాత్రలో భాగంగా ఈరోజు నగరానికి విచ్చేసిన శంకరరావు స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. శంకరరావు మాట్లాడుతూ జస్టిస్‌ శంకరయ్య అధ్యక్షతన చేపట్టిన ఓబిసి మహాసభను విజయవంతం చేయడానికి 7న ఛలో హైదరాబాద్‌ కార్యక్రమానికి బీసీలంతా పెద్దఎత్తున తరలి రావాలని కోరారు. హైదరాబాద్‌ ఎల్‌బి నగర్‌, సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో 7న ఉదయం 11 గంటల నుండి మహాసభ జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి బీసీ కులాల ముఖ్య నేతలు, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలు, బీసీ ముఖ్యమంత్రులు ఈ మహాసభకు హాజరవుతారన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, కేరళ, పాండిచ్చేరి ముఖ్యంమంత్రులు విచ్చేస్తున్నట్లు వెల్లడించారు. బిపి మండల్‌ బిసిల స్థితిగతులను అధ్యయనం చేసి 40 అంశాలతో నివేదికను కేంద్రానికి సమర్పిస్తే అందులో కేవలం 27శాతం రిజర్వేషన్‌ల అంశం ఒక్కదాన్ని మాత్రమే అమలు చేస్తున్నారన్నారు. అదీ కూడా కేవలం 7,8శాతం మాత్రమే రిజర్వేషన్‌ అమలు జరుగుతుందన్నారు. మండల్‌ నివేదికను అమలు చేసి, బీసీలు అన్ని రంగాలలో అభివృద్ధికి తోడ్పడాలన్నారు. స్వాతంత్య్ర వచ్చి 70 సంవత్సరాలు పైబడినా ఫలాలు బీసీలకు అందడం లేదని, బీసిల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉందన్నారు. రెండు దశాబ్ధాలుగా రిజర్వేషన్‌లు అమలవుతున్నప్పటికీ కేవలం 7,8 శాతమే రిజర్వేషన్‌ అమలవుతుందని, రిజర్వేషన్‌లు పూర్తిస్ధాయిలో అమలు జరగాలన్నారు. ఎవరికీ లేని విధంగా బీసిలకు క్రిమిలేయర్‌ అమలు చేయడం కారణంగా బీసలు నష్టపోతున్నారన్నారు. క్రిమిలేయర్‌ ఎత్తివేయాలని, బీసిలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్‌లు అమలుచేయాలని, ఓబిసి మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని, ఓబిసి రిజర్వేషన్‌లలో వర్గీకరణ తీసుకురావాలని, జనాభా దామాసా పద్దతిలో బీసిలకు నిధులు కేటాయించాలని కోరారు. బీసి వ్యక్తిగా చెప్పుకుంటున్న ప్రధానమంత్రి మోదీ బీసిల మనోభావాలకు అనుగుణంగా పనిచేయడం లేదన్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసి బీసిల సమస్యలను తెలియజేసినప్పటికీ ఆయననుండి సరైన స్పందన రాలేదన్నారు.  బీసిల అండతోనే రాష్ట్రంలో 151 సీట్లను వైసిపి గెలుచుకుందన్నారు. రాజమహేంద్రవరంలో బీసి అభ్యర్ధి భరత్‌ను ఎంపిగా గెలిపించుకున్నామన్నారు. రాష్ట్రానికి చెందిన బీసీ ఎంపిలు పార్లమెంట్‌లో బీసిల సమస్యలపై గళమెత్తి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. 7న ఛలో హైదరాబాద్‌కు ఉభయగోదావరి జిల్లాల నుండి పెద్దఎత్తున ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలన్నారు. బిసి సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ బీసిల అభ్యున్నతి కోసం జస్టిస్‌ ఈశ్వరయ్య 7న ఓబిసి మహాసభను ఏర్పాటుచేశారని, ఉభయగోదావరి జిల్లాల నుండి పెద్దఎత్తున తరలిరావాలన్నారు. క్రిమిలేయర్‌ పేరుతో సివిల్స్‌లో అర్హులైన 67 మంది బిసి అభ్యర్ధులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా నిలిపేశారని ఆందోళన వ్యక్తం చేశారు. క్రిమిలేయర్‌ను పూర్తిగా తొలగించాలన్నారు. ఇప్పుడున్న రూ.8లక్షల వార్షికాదాయ పరిమితిని, రూ.15లక్షలకు పెంచినప్పటికీ ఆమోదించమన్నారు. 27శాతం ఓబిసి రిజర్వేషన్‌లు పటిష్టవంతంగా అమలు చేయాలని, ఓబిసి రిజర్వేషన్‌లలో వర్గీకరణ అమలు చేయాలన్నారు. బిసి యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు క్రాంతికుమార్‌ మాట్లాడుతూ బిపి మండల్‌ నివేదికను అమలు చేయని కేంద్రప్రభుత్వం ఇప్పుడు ఆర్ధికంగా వెనుకబడిన కులాలంటూ తీసుకువచ్చి అగ్రవర్ణాల వారికి 10శాతం రిజర్వేషన్‌ కట్టబెడుతుందని దుయ్యబట్టారు. ఈ వైఖరి బిసిల రిజర్వేషన్‌లను కొల్లగొట్టడమేని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 2600 కులాలుగా ఉన్న బీసిల స్థితి గతులు ఎలా ఉన్నాయో అధ్యయనం చేసి, బిపి మండల్‌ నివేదిక ఇచ్చారని,  40 అంశాలను పేర్కొంటే ఒకే ఒక్క రిజర్వేషన్‌ అంశాన్ని అమలు చేస్తున్నారన్నారు. జస్టిస్‌ ఈశ్వరయ్య తలపెట్టిన ఉద్యమం, బీసిల హక్కులు సాధించుకోవడానికేనని, ఈ ఉద్యమంలో బీసిలంతా భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం కోఆర్డినేటర్‌ నవర గోపాలకృష్ణ మాట్లాడుతూ 7న ఛలో హైదరాబాద్‌కు ఉభయగోదావరి జిల్లాల నుండి పెద్దఎత్తున హాజరవుతామన్నారు. విలేకరుల సమావేశంలో బిసి సంక్షేమ సంఘం గ్రేటర్‌ అధ్యక్షులు కడలి వెంకటేశ్వరరావు, యువజన జిల్లా అధ్యక్షులు దాస్యం ప్రసాద్‌, సంఘం రాష్ట్ర కార్యదర్శి పొడుగు శ్రీను, నగర అధ్యక్షులు మజ్జి అప్పారావు, రూరల్‌ అధ్యక్షులు బిల్డర్‌ చిన్నా, నాయకులు కట్టా సూర్యప్రకాష్‌, దొమ్మేటి సోమశంకర్రావు, గోలి రవి, కె కుమారి, ముంతా సుమతి, రుక్మాంగరావు, సప్పా ఆదినారాయణ, కసిరెడ్డి కామేశ్వరావు, పసలపూడి భద్రరం, శిరిపురపు అప్పారావు, దుర్గారావు, లక్ష్మి సుజాత తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మజ్జి.. నగర అధ్యక్షునిగా గోలి
బిసి సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రస్తుత నగర అధ్యక్షులు మజ్జి అప్పారావు నియమితులయ్యారు. నగర  అధ్యక్షులుగా గోలి రవిని నియమించారు. గ్రేటర్‌ రాజమహేంద్రవరం అధ్యక్షునిగా కడలి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా పసలపూడి భద్రంలను నియమిస్తూ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు నియామక పత్రాలను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసి సంక్షేమ సంఘం అన్ని విభాగాలను బలోపేతం చేస్తున్నట్లు శంకరరావు వెల్లడించారు. 10 రోజుల్లో మరిన్ని నియామకాలు జరుగుతాయని రాష్ట్ర కోఆర్టినేటర్‌ నరవ గోపాలకృష్ణ వెల్లడించారు. నియామకాలు పూర్తయ్యాక ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here