8న రాష్ట్ర బంద్‌

0
288

విజయవంతానికి వామపక్ష నేతలు పిలుపు

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 6 : ఆంధ్రప్రదేశ్‌కి తీరని ద్రోహం చేస్తున్న టిడిపి, బిజెపి వైఖరికి నిరసనగా ఈనెల 8న చేపట్టే రాష్ట్ర బంద్‌కు అన్ని పక్షాలవారు సహకరించి విజయవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎం.పి.మిడియం బాబూరావు పిలుపునిచ్చారు. ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌ సాక్షిగా కాంగ్రెస్‌, బిజెపిలు ఆంధ్రప్రదేశ్‌ను నిట్టనిలువునా చీల్చారన్నారు. విభజన జరిగి నాలుగేళ్ళు పూర్తి కావస్తున్నా ఇంతవరకు విభజన చట్టంలోని రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్‌, పన్నెండు జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు, విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, ఆర్థికలోటు భర్తీ వంటి అంశాలను నెరవేర్చలేదని విమర్శించారు. ప్లానింగ్‌ కమిషన్‌ను రద్దు చేసి నీట్‌ అయోగ్‌ అంటూ ప్రత్యేక హోదాను ప్రక్కనపెట్టి ప్రత్యేక ప్యాకేజీ అంటూ మాటలతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు ఇప్పటివరకు 28సార్లు ఢిల్లీ వెళ్ళి మోడీ ముందు మోకరిల్లి రాష్ట్రానికి చేకూర్చిన ప్రయోజనం ఏమీలేదని, కేవలం ఓటుకు నోటు కేసులో దొరికిపోవడంతో కేంద్రంపై పోరాటం చేయలేకపోతున్నారన్నారు. ఇంకా బిజెపి, టిడిపిలను నమ్ముకుంటే రాష్ట్రం మరింత దారుణమైన పరిస్థితులకు చేరుకుంటుందని, ఈ సమయంలో ప్రజలందరూ ఏకం కావాలని కోరారు. సామాన్యుల నడ్డి విరిచి కార్పొరేట్లకు అనుకూలంగా మలచిన కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ 8న జరిగే రాష్ట్ర బంద్‌కు సహకరించాలని కోరారు. సిపిఎం నాయకులు అరుణ్‌ మాట్లాడుతూ సిపిఐ, సిపిఎంతోపాటు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌, విద్యార్ధి, మహిళ, యువజన, కార్మిక, కర్షక సంఘాలు బంద్‌కు మద్దతు తెలుపుతున్నాయన్నారు. విలేకరుల సమావేశంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్‌, సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు, ఎస్‌.ఎస్‌.మూర్తి, ఐఎఫ్‌టియు నాయకులు జోజి, హరి, ఎ.వి.రమణ, ఆర్‌.కె.చెట్టి, తదితరులు పాల్గొన్నారు.

బంద్‌కు చాంబర్‌ మద్దతు

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్ర రాష్ట్రానికి నిధుల కేటాయింపులోను, విభజన హామీల అమలులోను జరిగిన అన్యాయానికి నిరసనగా 8వ తేదీ గురువారం వామపక్షాలు, విద్యార్ధి సంఘాలు, కార్మిక, మహిళా, ప్రజా సంఘాలవారు నిర్వహించే రాష్ట్ర బంద్‌కు రాజమండ్రి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా గురువారం వర్తకులందరూ తమ తమ దుకాణాలు మూసివేయాలని చాంబర్‌ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, గౌరవ సంయుక్త కార్యదర్శి క్షత్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్‌ ఒక ప్రకటనలో కోరారు. ఈ బంద్‌ నుంచి మెడికల్‌, కూరగాయలు, హోటల్స్‌, పాల వ్యాపారాలను మినహాయించామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here