మహత్మాగాంధీ స్ఫూర్తి మార్గదర్శకం కావాలి   

0
112
బహిరంగ మల విసర్జనరహిత నగరంగా రూపొందడానికి కృషి చేయాలి
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 2: మహత్మా గాంధీ స్ఫూర్తితో బహిరంగ మల విసర్జన రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రజలను చైతన్యపర్చాలని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, శాసనసభ్యులు ఆకుల సత్యనారాయణ అన్నారు. నగర పాలక సంస్ధ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత విగ్రహానికి సోము వీర్రాజుతో పాటు ఆకుల సత్యనారాయణ, కమిషనర్‌ విజయరామరాజు, టిడిపి ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, కార్పొరేటర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సోము మాట్లాడుతూ తిరుపతిలో ఈరోజు బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఓ కార్యక్రమాన్ని చేపట్టారని, అందులో భాగంగానే రాజమహేంద్రవరం కూడా ఆ విధంగా తీర్చిదిద్దాలని కోరారు. మహాత్మా గాంధీ చేపట్టిన కారక్రమాలనే నాటి ప్రధాని వాజ్‌పాయ్‌, నేటి ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారని అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల కోసం వాజ్‌పాయ్‌ సఫాయ్‌ కర్మచారి సంస్ధను ఏర్పాటు చేశారని తెలిపారు.  మోడీ ఇచ్చిన స్వచ్ఛ భారత్‌ ప్రభావం పెరిగిందని , ఈ కార్యక్రమంలో అందరిని మమేకం చేయాలని సూచించారు. ఎమ్మెల్యే ఆకుల మాట్లాడుతూ గాంధీ, లాల్‌బహుదుర్‌ శాస్త్రి వంటి మహనీయులు నేటి తరానికి మార్గదర్శకులని కొనియాడారు. స్వచ్ఛ భారత్‌ అనేది నిరంతర ప్రక్రియ అని, బహిరంగ మలవిసర్జన రహిత నగరానికి అందరూ సహకరించాలని కోరారు. కమిషనర్‌ విజయరామరాజు మాట్లాడుతూ  కార్పొరేటర్లు, సిబ్బంది సహకరిస్తే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. ఎవరైనా బహిరంగ మలవిసర్జన చేస్తే ప్రభుత్వం నుంచి వారికుండే ప్రయోజనాలను నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల  నిర్మాణానికి నిధులు విడుదల చేస్తున్నామని, అవసరమైన వారు  నగర పాలక సంస్ధ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రెడ్డి పార్వతి, తంగెళ్ళ బాబి, కొమ్మ శ్రీనివాస్‌, మాటూరి రంగారావు, మర్రి  దుర్గాశ్రీనివాస్‌, కడలి రామకృష్ణ, పిల్లి నిర్మల, సింహ నాగమణి, పాలవలస వీరభద్రం, పల్లి శ్రీను, బెజవాడ రాజ్‌కుమార్‌, పితాని లక్ష్మీకుమారి, యిన్నమూరి రాంబాబు, కోసూరి  చండీప్రియ, పెనుగొండ విజయభారతి, కరగాని మాధవి, అదనపు కమిషనర్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ కమిషనర్‌ ఫణిరామ్‌, మేనేజర్‌ శ్రీనివాస్‌, కార్యదర్శి శైలజావల్లి,  నగర పాలక  సంస్ధ సిబ్బంది పాల్గొన్నారు.