ఈ తెలుగు ఎందరికి తెలుస్తుంది? (శనివారం నవీనమ్)

0
43

ఈ తెలుగు ఎందరికి తెలుస్తుంది?
(శనివారం నవీనమ్)

ఆకుమడి కోసం విత్తనాలుకొని, మళ్ళను దమ్ముచేయించి, అలికి, విత్తనాలు నానబెట్టి, మొలకలు వచ్చాకా మడిలో జల్లి, ఆకై మొలిచిన తరువాత కొన్ని రోజులకు తక్కువ మోతాదులో పిండి(యూరియా)వేసి, మందులు జల్లి!చంటి పిల్లలా ఆకుమడిని పెంచి, ఆకు తీతకు వచ్చేనాటికి మడులకు నీరు పెట్టి గట్లనుకట్టి, నాగలితో / ట్రాక్టరుతో సాలు ఇనమారు వేయించి, గట్లంకవేసి మడిలో సూపర్ ఫాస్ఫేట్ జల్లి, రెండు రోజుల తరువాత దమ్ము చేయించి, బల్లకట్టుతో అలికి, ఈనేగట్లు వేసి, ఆకుతీసి మొత మోసి,ఊడ్పు ఊడ్పించి, చేడీలువేసి, చేలో నీరు సంవృద్దిగా ఉండేటట్టు చూసుకొని, ఓక తెర పిండి వేసేప్పటికి చేను పెరుగుతూ ఉండగా, ఈ లోపు పచ్చపురుగు చేనుపైదాడి మందుకొట్టుట మొదలు…మరో వైపు కలుపు, ఆపై చేను మాగుడు (ఇదొక రకం తెగులు), చేను ఈనే దశలో వెన్ను నరుకుడు పురుగాశించి మళ్ళీ మందులు, చేను పాలు పోసుకొనే దశలో మంచువలన పొల్లుగాయ రావడం…ఇలా నాలుగైదు తెరలు పిండి(యూరియా,డిఏపి,మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇంకా కొన్ని ఖరీదైన ఎరువులు)అయిదారు తెరలు మందులు(సైపర్ మెతరిన్, హినోసేన్, కాంటాప్ ఎసిపేట్ ఇంకా చాల రకాల క్రిమిసంహరకాలు)జల్లి, చేనుని కాపాడు కుంటూ వస్తుంటే మద్యమద్యలో నీరందక కొన్నిపాట్లు!

చేను పర్వాలేదు హమ్మయ్య అనుకూనేలోపే దొమాశించి చేనుని ఒట్టిగడ్డిలా మారుస్తున్న వేళ, టాటా వారి మిడా లేదా బేయర్ కంపెని వారిచాల ఖరిదైన కాన్పిడార్ జల్లి, కోత కోయిస్తే సరిగ్గా అప్పుడే రాకూడని వేల వానదేవుడొచ్చి ప్చ్….సరే వాన రాలేదనుకొందాం, పనారిన తరువాత కట్టేత కట్టి కుప్పవేసి!(కొంచేం విశ్రాంతి) వాతావరణం బాగున్నప్పుడు కుప్పనూర్పిడి, ధాన్యం ఎగరబోసి రాశిపోస్తే, ధర లేక విలవిలలు, ధాన్యం తడిచిందనే వంకతో దళారుల చౌక బేరాలు…ఏదో ఒక వంకబెట్టడం, సరే వ్యవసాయం చేయలంటే కూలీలు కావాలి కదా, వాళ్ళకివ్వడానికి డబ్బుకావాలి అప్పు చేయాలి వడ్డీలు కట్టాలి, కూలీలేమో కూలీ రేట్లు సరిపోక వేరే పనులకు వల్లడం వలన ఉన్న వాళ్ళతోనే రైతులు పోటి పడి పనులు చేయించుకొనే పద్దతులు కొన్ని…ఏంతోకొంతకి ధాన్యం అమ్మిన మొత్తంలోంచి ట్రక్టరు వాడికి,నీరు పెట్టినవాడికి,మందులకొట్టు వాడికి,బాకీలవాడికీ ఇచ్చేయగా…..నోమోర్!…చేనుకి చెత్త, రైతుకి చిప్ప అనేటట్టు ఉంటుంది!!!

ఇది తెలుగే! ఇది రైతు కష్టం అని తెలుస్తుంది. ఇందులో పదాలు ఎంతవరకూ అర్ధమయ్యాయో తెలియదు.

రోలు, రోకలి, తిరగలి, చేట, కవ్వం, తాడు, మోకు, కోడె, పెయ్య, కొట్టాం, మంగళం, చట్టి, కుదురు….ఇలాంటి వందలకొద్దీ తెలుగు పదాలను ముప్పై, ముప్పై ఐదేళ్ళ వయసులో వున్నవారు వినే వుండరు.

భాష అంటే అక్షరాలు, పదాలు కాదు… ప్రజల జీవన విధానం…జీవన వ్యక్తీకరణలకోసం, జీవిత సౌలభ్యాలకోసం…కొన్ని తరాల అనుభవాల నుంచి రూపుదిద్దుకున్న సాధనం. ప్రజల సంస్కృతీ సాంప్రదాయాలకు ఒక రూపం.

జీవన విధానాలు, వాటి మూలాలు ధ్వంసమయ్యాక, లేదా రూపాంతరం చెందాక, ఆ సంస్కృతీ వుండదు, ఆ సాంప్రదాయమూ వుండదు…వీటి మౌత్ పీస్ అయిన భాష కూడా అదేరూపంలో వుండదు. ఇవేమీ లేకుండా భాష ఒక్కటే బతికి బట్టకట్టడం సాధ్యం కాదు.

కాంగ్రెస్ మొదలుపెట్టి బిజెపి వేగవంతం చేస్తున్న గ్లోబలీకరణ వల్ల రైతు గర్వంగా పండించిన వంగడాలన్నిటికీ కాలం తీరిపోయి, హైబ్రీడ్ – బిటి విత్తనాలు మార్కెట్ ని ముంచెత్తుతున్నాయి. గోమాతను పవిత్రంగా పరిగణించే జాతీయవాదులు చూస్తూండగానే భారతీయ ఆవు సంతతి సంకరమైపోయింది. ఒకనాడు దేశానికి గర్వకారణమైన సంస్ధలన్నీ పరాయిచేతుల్లోకి వెళుతూండగా, అంతరించి పోతూండగా, చివరికి భూమాత కూడా ఎవరి చెరలోకో వెళ్ళిపోతూండగా, విదేశాలకు వనరులు తరలించి సరుకులు తెచ్చుకోవడం దేశ అర్ధిక విధానమైపోతూండగా, ప్రపంచ మార్కెట్ తో అనుసంధానమే మన జీవనప్రమాణమైపోతూండగా ఇంగ్లీషు కి మించిన అనుసంధాన భాష ఇంకేముంది? తెలుగులో నాణాల చప్పుడు వినడం ఎప్పుడో మానేసిన చెవులు డాలర్ల గరగరలు వినడానికే తహతహలాడుతున్న సన్నివేశంలో మనం అస్వతంత్రులమైపోయాం! సొంత జీవనాన్ని సొంత భాషను వొదిలేసిన మన నోట ఇతరుల చిలకపలుకుల భాష తప్ప తెలుగు ఎలా పలుకుతుంది?

భాషను రక్షించుకోవడం అంటే సభలు నిర్వహంచుకోవడం మాత్రమే కాదు. రూపాంతరమౌతున్న భాషను ప్రమాణీకరణ చేసుకోవడం! గ్లోబలీకరణ గాయాలు తగలకుండా తెలుగుకు కవచాలు కట్టుకోవడం! తంతులా, తప్పనిసరైన కర్మకాండలా కొనసాగుతున్న సంస్కృతీ సంప్రదాయాల పట్ల ఉద్వేగపూరితమైన మమకారాన్ని ప్రోది చేసే వాతావరణాన్ని ఒక విధానంగా ప్రోత్సహించడం….ఇదంతా జరిగినా కూడా తెలుగు (ఏ భాష అయినా కూడా) రూపాంతరమౌతూనే వుంటుంది…అయినా మూలాలు కదలకుండా వర్ధిల్లుతూనే వుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here