మొండితనానికి పరాభవం (శనివారం నవీనమ్)

0
76

మొండితనానికి పరాభవం
(శనివారం నవీనమ్)

బెదరించిన చేతిని విరిచేసిన తిరుగుబాటు నుంచీ, అవమానం నుంచీ అమెరికాను గట్టెక్కించడానికి ట్రంప్ తన ధోరణిని మార్చుకుంటారా? నచ్చని రాష్ట్రాన్ని మెలితిప్పే పద్ధతిని మోదీ మార్చుకుంటారా? ట్రంప్, మోదీల మధ్య చాలా పోలికలు వున్నాయి. ప్రజలలో ఈ ఇద్దరికీ గాఢమైన అభిమానులు
వున్నారు. తీవ్రంగా వ్యతిరేకించే ఓటర్లు వున్నారు. ఇద్దరూ తాము అనుకున్నదే తప్ప సహచరులను సంప్రదించే అలవాటు లేనివారే! అఖండమైన మెజారిటీ సాధించిన ఇద్దరూ ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు దూరమౌతున్నవారే!

జెరూసలేంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా టర్కీ, యెమన్‌ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్‌ సహా 128 దేశాలు అనుకూలంగా ఓటుచేసి ట్రంప్‌ నిర్ణయాన్ని కాదన్నాయి. ఐక్యరాజ్యసమితిలో అమెరికా ఇంతగా అవమానపడటం ఇదే మొదటిసారి!

ఓటింగ్‌కు ముందు ట్రంప్‌ తనపక్షాన నిలవని వారికి శిక్షలు తప్పవని హెచ్చరికలు కూడా చేశారు. తనను కాదన్న దేశాలు అమెరికానుంచి సహాయనిరాకరణ ఎదుర్కోవలసి వస్తుందనీ, అందుకు సిద్ధపడిన పక్షంలోనే తనకు వ్యతిరేకంగా ఓటుచేయాలన్నది ఆ హెచ్చరికల సారాంశం.

ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధి నిక్‌ హాలీ ప్రసంగం బెదిరింపులు, హెచ్చరికలతో సాగింది. అమెరికా ఎన్నటికీ ఈ అవమానాన్ని మరిచిపోదనీ, తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన దేశాలన్నింటినీ పేరుపేరునా గుర్తుపెట్టుకుంటామని ఆమె హెచ్చరించారు. హాలీ తన ప్రసంగంలో అన్ని విలువలూ వదిలేశారు. దండిగా నిధులిచ్చి ఐక్యరాజ్యసమితిని నిలబెడుతున్నది అమెరికాయేనని
ఆమె గుర్తుచేశారు. మరిన్ని నిధులు కేటాయించాలని వెంటపడుతున్నారని హేళన చేశారు. తాము
కట్టబెట్టిన వైభవాన్ని స్వప్రయోజనాలకు వాడుకుంటున్నవారు ఇప్పుడు తమనే ధిక్కరిస్తున్నారని దురహంకార పూరిత వ్యాఖ్యలూ చేశారు.

జెరూసలేంను రాజధానిగా గుర్తిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ప్రకటించగానే, భారతదేశం ఏక వాక్య
ప్రకటనలో భారత్‌ వైఖరిలో ఏ మార్పూ లేదన్నది.

ఇస్లామిక్‌ దేశాల సమాఖ్య (ఓఐసీ) లోని 57 దేశాల్లో ఏడు మినహా మిగతా యాభై ఇస్లామిక్‌ దేశాల్లో జెరూసలేం అత్యంత ప్రధానమైన మతపరమైన అంశం. ఈ దేశాలతో భారత్‌కు అనాదిగా సత్సంబంధాలుండటమే కాక, వాటినుంచి అనేక రంగాల్లో విస్తృత సహకారం అందుకుంటున్నది. అమెరికా, ఇజ్రాయెల్‌తో శెభాష్‌ అనిపించుకోవడం కోసం అనేకులకు శత్రువులుగా మారే స్థితిలో భారత్‌ లేదు. జెరూసలేంపై సమితి గతంలో చేసిన శాసనాన్ని ధిక్కరించి, ఇప్పుడు ప్రపంచదేశాల అభీష్టానికి భిన్నంగా వ్యవహరించడం వల్ల తన ప్రయోజనాలను బలిపెట్టడం తప్ప భారత్‌కు ఒరిగేదేమీ ఉండదు.

దశాబ్దాలుగా పాలస్తీనాకు బాసటగా నిలిచిన భారతదేశం క్రమంగా అంటీముట్టనట్టుగా మారి, మోదీ రాకతో మరింత దూరం జరిగిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో స్నేహం పెరిగిన నేపథ్యంలో, భారతదేశం ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయకున్నా, కచ్చితంగా గైర్హాజరవుతుందని అంతా భావించారు. ఇస్లామిక్‌ దేశాల సమాఖ్య ట్రంప్‌ నిర్ణయాన్ని తూర్పారబట్టడంతోనూ, భద్రతామండలిలో అమెరికా ఆప్తదేశాలే దానిని కాదనడంతోనూ, ప్రపంచదేశాలన్నీ అమెరికా నిర్ణయానికి వ్యతిరేకంగా నిలవబోతున్న విషయం అర్థమై భారత్‌ సమితిలో స్వతంత్రవైఖరికి సిద్ధపడింది.

ఖండించవలసిన సందర్భాన్ని వినియోగించుకోకుండా “మా వైఖరిలో మార్పు లేదు” అని మాత్రమే క్లుప్తంగా భారత్ వ్యతిరేకతను వ్యక్తం చేయడం ట్రంప్ ధోరణులకు మోదీ ప్రభుత్వ పాక్షిక సానుభూతిగానే ఇస్లామిక్ ప్రపంచం భావిస్తుంది.

ప్రపంచపు పెద్దన్న ట్రంప్ కు జరిగిన పరాభవం నుంచి భిన్న సమాజాలు, భిన్న సంస్కృతులు వున్న పెద్దదేశం భారత్ ప్రధాని మోదీ ఆలోచనలు మార్చుకోవాలి. పార్టీని అధికారాన్ని 19 రాష్ట్రాలకు విస్తరింపచేసిన మోదీ సామర్ధ్యాన్ని తప్పు పట్టనవసరం లేదు. ఎన్నికలకు ముందు బీహార్ కు లక్షానలభైవేల కోట్లరూపాయల పాకేజి, ఈశాన్య రాష్ట్రాలకు 90 వేల కోట్ల రూపాయల పాకేజీ లను కూడా అర్ధం చేసుకోవచ్చు. అభివృద్ధి కి నిధులిస్తే అడ్డు చెప్పవలసిన అవసరం లేదు. ఎన్నికలకు ముందు వాటిని ప్రకటించడం అధికారదర్వినియోగమన్న విమర్శను మరచిపోవచ్చు.

కానీ, పెద్ద కొడుకునై ఆంధ్రప్రదేశ్ ను ఆదుకుంటా అని ఎన్నికలకు ముందు వాగ్దానం చేసిన మోదీ ప్రత్యేక హోదాను హామీని పాతిపెట్టేయడాన్ని, పోలవరం ప్రాజెక్టుని పక్కన పెట్టేయడాన్ని, విభజనచట్టాన్ని అటకఎక్కించేయడాన్ని, ముఖ్యమంత్రికి ఏడాదిన్నరగా అపాయింటు మెంటే ఇవ్వక పోవడాన్న ఎలా అర్ధం చేసుకోవాలి?ఏమనుకోవాలి? నిస్సహాయతతో రగిలిపోతున్న ఆంధ్రప్రదేశ్ గురించి ప్రధాని మోదీ ఒక్కమాటైనా మాట్లాడకపోవడాన్ని ఏమనాలి? నియంతృత్వమా? దురహంకారమా? ఏదైనా కావచ్చు!

ఎవరైనా భిన్నత్వాన్ని ఆదరించాలి! వైవిధ్యాన్ని గుర్తించాలి! రెండోమాటను వినిపించుకోవాలి! ఫెడరల్ స్వభావాన్ని గౌరవించాలి! కాని పక్షంలో ఎదురుదెబ్బలు, పరాభవాలు తప్పవు! అది ట్రంప్ కావచ్చు!! మోదీ కావచ్చు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here