పాదయాత్ర శ్రీకాకుళం చేరేలోగా మీకు చరమగీతం పాడేస్తారు

0
67
ఇంత అభివృద్ధి, సంక్షేమం జరుగుతున్నా మీ కళ్ళకు కనపడటం లేదా?
ప్రతిపక్షనేత జగన్‌ తీరుపై ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ధ్వజం
రాజమహేంద్రవరం,డిసెంబర్‌ 23 : రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజా సంక్షేమానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు హామీలు ఇవ్వని ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్న ఎంతో అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనకు చరమ గీతం పాడడంటూ అధికారం కోసం అలమటిస్తున్న ఓ నాయకుడికి ఆయన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా చేరేలోగా చరమ గీతం పాడి ప్రజలు ఇంటికి పంపేస్తారని శాసనమండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికలతో పోలిస్తే చంద్రబాబు చరిష్మా పదిరెట్లు పెరిగిందని, ఇటీవల జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అప్పారావు మాట్లాడుతూ జగన్‌ తీరుపై ధ్వజమెత్తారు. పేదల కష్టాలు తెలిసి ఉన్న మనసున్న మహారాజులా పేదల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తూ మరో వైపు పోలవరం ప్రాజక్ట్‌, రాజధాని అమరావతి నిర్మాణానికి, నదుల అనుసంధానానికి ఎంతో కృషి చేస్తున్న చంద్రబాబును పదే పదే ఆడిపోసుకోవడం ప్రతిపక్ష నేతకు పరిపాటైందన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా బీసీలకు, ఎస్సీలకు పెళ్ళి కానుకలు ఇవ్వాలని నిర్ణయించడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను ఒక ఇంటిలో ఒకరికి మాత్రమే ప్రయోజనం కల్పించడం అనే పరిమితి విధించకుండా పేదల్లో వారి వారి అర్హతలను బట్టి ఒక కుటుంబానికి ఎన్ని అయినా సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని చంద్రబాబు తాజా నిర్ణయం తీసుకున్నారని ఆదిరెడ్డి చెప్పారు. చంద్రబాబు నిర్వహించిన సర్వేలో పాలన పట్ల, సంక్షేమ కార్యక్రమాల పట్ల 85 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు తేలిందని, అయినా అక్కడితో సరిపెట్టకుండా నూరు శాతం సంతృప్తిగా ఉండాలనే లక్ష్యంతో చంద్రబాబు పనిచేస్తున్నారని ఆయన అన్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరందించడంతో పాటు ఏలేరు ఆయుకట్టును స్థిరీకరించగా పోలవరం ప్రాజక్ట్‌ను శర వేగంగా పూర్తి చేస్తుండటంతో మతి తప్పిన ప్రతిపక్షాలు వారి దుకాణాలను మూసివేసేసుకోవలసిన పరిస్థితి ఏర్పడటంతో వాటిని అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయన్నారు. తన పాలనా విధానాల ద్వారా రాష్ట్రానికే గాక పేదల ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచిన చంద్రబాబు ఎంతో కష్టపడి పనిచేస్తున్నా ప్రతిపక్షానికి అదేమీ కనపడటం లేదని, పైగా అపోహలతో పాటు వారికిలా కమిషన్లు తీసుకుంటున్నట్లుగా భ్రమించి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
నగరంలో అభివృద్ధి పనులకు చర్యలు
సీఎం ఆదేశాలతో నగరంలోని అల్లురామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి కళాశాలలో పీజీ సీట్లు సాధనతో పాటు విద్యార్ధులకు  రూ. 60.5 లక్షల స్టయిఫండ్‌ మంజూరైందని,నగర పాలక సంస్థ హోమియోపతి డిస్పెన్సరీల్లో డాక్టర్ల పోస్టుల కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగియనుండగా తాను మున్సిపల్‌ పరిపాలనా విభాగం డైరక్టర్‌తో మాట్లాడి వాటి కాలపరిమితిని పొడిగించామని, ఎంప్లాయిమెంట్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ క్రింద నియోజకవర్గానికి వేయి కుట్టు మిషన్లు మంజూరు చేయించామని, దీని వల్ల ఎందరో పేదలు శిక్షణ పొంది ఉపాధి పొందవచ్చన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా సిటీ నియోజకవర్గానికి రూ. 17 కోట్లు మంజూరు చేయించామని, నగరంలో స్టేడియం అభివృద్ధికి తొలి విడతగా రూ.  2కోట్లు మంజూరయ్యాయని, దాదాపు మరో రూ. 5 కోట్లు దఫదఫాలుగా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నగరంలోని ప్రభుత్వ  బీసీ హాస్టళ్ళలో  అదనపు భవనాల నిర్మాణానికి పాలనా అనుమతులు మంజూరయ్యాయని,  రహమత్‌ నగర్‌లో షాదీఖానా నిర్మాణానికి కూడా నిధులు మంజూరయ్యాయన్నారు.  ఇంత పెద్దఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నా ప్రతిపక్షాలకు ఇదేమీ కనపడటం లేదని, ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆదిరెడ్డి హితవు చెప్పారు. విలేకరుల సమావేశంలో దొండపాటి సత్యంబాబు, కార్పొరేటర్లు కిలపర్తి శ్రీనివాస్‌, యిన్నమూరి రాంబాబు, కడలి రామకృష్ణ, పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, బూరాడ భవానీ శంకర్‌, కడితి జోగారావు, మేడిశెట్టి కృష్ణారావు, మేరపురెడ్డి రామకృష్ణ, మానే దొరబాబు, పితాని కుటుంబరావు, వెంప్రప్రగడ ఉమా మహేశ్వరి, బొచ్చా శ్రీను, మాలే విజయలక్ష్మీ, తురకల నిర్మల, సప్పా రమణ, బుడ్డిగ రవి, అట్టాడ రవి, రాయపాటి శ్యామల, ముమ్మిడి లక్ష్మీ, జాగు వెంకటరమణ, వాసంశెట్టి ఏడుకొండలు పాల్గొన్నారు. అనంతరం మట్టపర్తి జస్వంత్‌ అనే బాలునికి వైద్య సహాయం నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 2.40 లక్షల చెక్‌ను ఆదిరెడ్డి అతని కుటుంబానికి అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here