గుడా మాస్టర్‌ ప్లాన్‌కి కసరత్తు

0
53

ఆన్‌లైన్‌లోనే అనుమతుల మంజూరు

అనధికార లే అవుట్లను కొని మోసపోవద్దు

గుడా జోనల్‌ కార్యాలయం ప్రారంభంలో చైర్మన్‌ గన్ని కృష్ణ

రాజమహేంద్రవరం, జనవరి 3 : గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) పరిధి మొత్తానికి మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన చేసేందుకు కసరత్తు జరుగుతోందని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ తెలిపారు. గుడా పరిధిలో కాకినాడ, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థలతో పాటు పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట పురపాలక సంఘాలు, గొల్లప్రోలు నగర పంచాయితీ, 26 మండలాల పరిధిలోని గ్రామాలన్నింటికి వర్తించేలా ఈ కొత్త మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం నగర పాలక సంస్థకు మాస్టర్‌ ప్లాన్‌ ఇప్పటికే సిద్ధం కాగా కాకినాడకు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించే ప్రక్రియ పూర్తి కావలసి ఉందని, అయితే ఆయా నగరాల మాస్టర్‌ ప్లాన్‌లతో పాటు నగరాలను, పట్టణాలను, గ్రామాల్ని అనుసంధానిస్తూ గుడా పరిధి మొత్తానికి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తే అభివృద్ధి ప్రణాళికబద్ధంగా విస్తృతం కావడంతో పాటు భవిష్యత్తులో సమగ్రాభివృద్ధి జరుగుతుందనే యోచనతో ఈ ప్రక్రియను చేపడుతున్నట్లు తెలిపారు. కాగా గుడా మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనకు ఇప్పటికే ప్రయత్నాలు ఆరంభమయ్యాయని, పూర్తి కావడానికి కొంత సమయం పడుతుందని, అది అమలైతే సమగ్రమైన అభివృద్ధి మాత్రం జరిగి తీరుతుందన్నారు. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కార్యాలయం ప్రాంగణంలోని క్రొవ్విడి లింగరాజు పాత మున్సిపల్‌ కౌన్సిల్‌ హాలు పై భవనంలో గుడా జోనల్‌ కార్యాలయం, చైర్మన్‌ క్యాంప్‌ కార్యాలయాలను గన్ని కృష్ణ ఈరోజు ఉదయం ప్రారంభించారు. అనంతరం మినీ కాన్ఫరెన్స్‌ హాలులో గుడా డైరక్టర్లు పిల్లి రవికుమార్‌, ఒలిశెట్టి నాని, గట్టి సత్యనారాయణ, గుడా ఇన్‌ఛార్జి సెక్రటరీ సాయిబాబా, నగర డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, ప్లానింగ్‌ ఆఫీసర్‌ సంజయ్‌, అసిస్టెంట్‌ ప్లానింగ్‌ ఆఫీసర్లు శాంతి లత, సత్యమూర్తి, జూనియర్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ ప్రసాదరావులతో కలిసి గన్ని విలేకరులతో మాట్లాడారు. గుడా మాస్టర్‌ ప్లాన్‌ అమలులోకి వస్తే దీని పరిధిలోని నగరాలు, పట్టణాలు, మండలాలను అనుసంధానిస్తూ రింగ్‌రోడ్లు,అవసరమైన చోట్ల ప్లై ఓవర్లు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందుతాయని, అయితే ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందన్నారు. గుడా అంచెలంచెలుగా బాలారిష్టాలను అధిగమిస్తోందని, రాష్ట్రంలోని విశాఖ, వీజీటీ, తుడా సంస్థల మాదిరిగా అభివృద్ధిని సాధించడానికి, గుడా సొంతంగా లేఔట్లను వేయడానికి కొంత సమయం పడుతుందన్నారు. గుడాతో పాటు కర్నూల్‌లో కుడా, నెల్లూరులో నుడా, హిందూపురం,అనంతపురం కలిపి హుడా ఏర్పాటు చేసినప్పటికీ ముందుగా బోర్డు వేసింది మాత్రం గుడాకేనని, ప్రజల సౌకర్యార్ధం అలాగే జోనల్‌ కార్యాలయం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయడానికి కూడా సీఎం చంద్రబాబు అంగీకరించి ఉత్తర్వులు ఇచ్చేలా చేసారని గన్ని క ష్ణ చెప్పారు. గుడా పరిధిలో కాకినాడ, రాజమహేంద్రవరం కార్పొరేషన్లలో పాటు పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం మున్సిపాల్టీలు, గొల్లప్రోలు నగర పంచాయితీ,అలాగే 26 మండలాలలోని 290 గ్రామ పంచాయితీలు కలిపి, మొత్తం 2వేల 184 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉందని ఆయన వివరించారు. బోర్డు ఏర్పాటు కాకమునుపే కలెక్టర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాస్టర్‌ ప్లాన్‌ గురించి తీర్మానం చేసారని తెలిపారు. బోర్డు నియామకం అయ్యాక తన అధ్యక్షతన జరిగిన గుడా తొలిసమావేశంలోనే రాజమహేంద్రవరం జోనల్‌ కార్యాలయం కోసం తీర్మానం చేసినట్లు ఆయన చెప్పారు. గుడా పరిధిలోని ప్రాంతాలకు ప్లాన్లు తయారు చేయడానికి 216 మంది ఆర్కిటెక్ట్స్‌, స్రక్చరల్‌ ఇంజనీర్లు, లైసెన్స్‌ ఇంజనీర్లు, సర్వేయర్ల లైసెన్సులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. దీనివలన 20లక్షల 37వేల 500రూపాయలు ఫీజుల రూపంలో సమకూరిందని ఆయన చెప్పారు.

ఆన్‌లైన్‌లోనే అనుమతులు

నగరాల్లో వేయి చదరపు మీటర్ల లోపు నిర్మాణాలకు నగర పాలక సంస్థలే అనుమతులు మంజూరు చేస్తాయని, వేయి చదరపు గజాలు దాటితే గుడా నుంచి అనుమతులు పొందవలసి ఉంటుందని చైర్మన్‌ గన్ని కృష్ణ చెప్పారు. గ్రామ పంచాయితీలు 300 చదరపు మీటర్ల లోపు నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయవచ్చని, గుడా తొలి బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా ఈ విధానాన్ని రాష్ట్రమంతా వర్తింపజేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ అయ్యాయని ఆయన తెలిపారు. నిర్మాణాలకు అనుమతులు అంతా ఆన్‌లైన్‌లోనే ఇస్తారని, తద్వారా అనుమతులు పొందడంలో అవినీతికి ఆస్కారం ఉండదని, ఎవరినీ ఎవరూ ప్రభావితం చేయడానికి అవకాశం ఉండబోదని ఆయన అన్నారు. గ్రామాల్లో 33 చదరపు మీటర్ల లోపు స్థలాలకు 1228 దరఖాస్తులు రాగా, అందులో 962 వాటికి అనుమతులు ఇచ్చారని దీనివలన 4కోట్ల 10లక్షలు ఫీజు వస్తే, అందులో డవలప్‌మెంట్‌ చార్జీల కింద గుడాకి 65లక్షల 97వేల రూపాయలు వచ్చాయని తెలిపారు. కాగా 300 చదరపు మీటర్లు పైబడిన స్థలాలకు అనుమతులకు గుడాకు 35 దరఖాస్తులు గుడా కార్యాలయానికి రాగా, అందులో 11 అనుమతులు ఇచ్చినట్లు 24పరిశీలనలో ఉన్నట్లు ఆయన చెప్పారు. పరిశ్రమలకు కూడా అనుమతులు గుడాయే ఇస్తుందని ఆయన చెబుతూ, పరిశ్రమల స్థాపనకు ఆన్‌ లైన్‌ లో 14దరఖాస్తులు రాగా,13 అనుమతి పొందాయని, ఒకటి తిరస్కరింప బడిందని ఆయన తెలిపారు. మొత్తం అన్ని రకాల ఫీజులు కలిపి గుడాకు ఒక కోటి 39లక్షల రూపాయలు వచ్చినట్లు ఆయన వివరించారు. నిబంధనలను అతిక్రమిస్తే ఆ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడానికి నిరాకరించేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందించారన్నారు. గుడా పరిధిలో ఇప్పటికి 216 మంది సర్వేయర్లు ఎన్‌రోల్‌ అయ్యారని అన్నారు. గుడా వ్యవహారాలు అంతా పారదర్శకంగా సాగుతున్నాయని, ప్లాన్లకు అనుమతుల్లో ఎలాంటి జాప్యం జరగడం లేదన్నారు. లేఔట్లకు అనుమతులు కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుందని, అందుకు కూడా ఆన్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌ సిద్ధమవుతోందని గన్ని తెలిపారు. గుడాకు ప్రస్తుతం తగినంతగా అధికారులు, సిబ్బంది లేకున్నా ఉన్న వారి కృషి, సహకారంతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నందున గుడాకు పూర్తి స్థాయిలో ఆర్థిక జవసత్వాలు సమకూరే వరకు ప్రణాళికలకు అనుమతులు ద్వారా సమకూరే ఆదాయంతోనే తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, తమ కార్యకలాపాలను ముమ్మరం చేసి తగినంత ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.

అనధికార లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దు

గుడా పరిధిలో కొన్ని అనధికార లేఔట్లు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అనుమతుల్లేని, నిబంధనలు పాటించని అటువంటి లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ప్రజలు మోసపోవద్దని గన్ని కోరారు. సమగ్రంగా అన్నీ తెలుసుకున్నాకే ప్లాట్లు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఇక 2007కి ముందు అనధికార లే అవుట్లకు సంబంధించి క్రమబద్దీకరణ ప్రక్రియ గతంలో చేసారని, ఒకవేళ అప్పుడు క్రమబద్దీకరించుకోని పక్షంలో చేసేదేమీ లేదని గన్ని క ష్ణ చెబుతూ అలాంటి అనధికార లే అవుట్లను కొని మోసపోవద్దని సూచించారు. అయితే అనధికార లే అవుట్లకు కూడా అనుమతులు ఇచ్చి, న్యాయం చేయాలని ఇందుకు మార్గదర్శక సూత్రాలు జారీచేయాలని ప్రభుత్వానికి విన్నవించినట్లు ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో భవన క్రమబద్దీకరణ పథకం ప్రవేశ పెట్టాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన చెప్పారు. పార్కుల అభివ ద్ధి కూడా గుడా చేపట్టవచ్చని ఆయన చెప్పారు. గుడా పరిధిలో ప్లాన్లు తయారు చేయడానికి ఇంజనీర్లకు, సర్వేయర్లకు, గ్రామ కార్యదర్శులకు రెండు విడతలుగా శిక్షణ తరగతులు నిర్వహించామని ఆయన తెలిపారు. గుడా మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనకు ఏడాది సమయం పట్టవచ్చని సెక్రటరీ సాయిబాబా చెప్పారు. శాటిలైట్‌ ఇమేజ్‌ తీసుకుని కాకినాడ,రాజమహేంద్రవరం మాస్టర్‌ ప్లాన్‌లను అనుసంధానిస్తూ గుడా పరిధి అంతటా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తారని ఆయన చెప్పారు. ఎప్రోచ్‌ రోడ్లు, ఫ్లయ్‌ ఓవర్‌ బ్రిడ్జిలు,నేషనల్‌ హైవేస్‌, ఆర్‌ అండ్‌ బి రోడ్లు ఇలా అన్నింటినీ క్రోడీకరించి ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలో ప్రతిపాదిస్తారని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here