చిన్న వర్తకులకు మరణ శాసనం జీఎస్టీ

0
53

రక్షణకై వచ్చే నెలలో జిల్లా స్థాయి వర్తక సదస్సు : నందెపు శ్రీను

రాజమహేంద్రవరం, జనవరి 4 : వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మన రాష్ట్రంలో చిన్న వర్తకుల పాలిట మరణ శాసనమైందని జిల్లా ఫెడరేషన్‌ ఆఫ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ చైర్మన్‌, శ్రీ వెంకటేశ్వరా జనరల్‌ మార్కెట్‌ కమిటీ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ. 200 విక్రయానికి బిల్లు లేకపోతే రూ. 20 వేల జరిమానా విధించే నిబంధనను రాష్ట్ర జీఎస్టీ ట్యాక్స్‌ విభాగం నిస్సిగ్గుగా వినియోగించుకుంటూ ప్రతి అధికారికి డెకాయి కేసులు టార్గెట్‌గా నిర్ణయించడం, వారు చిన్న చిన్న గ్రామాల్లో సైతం చిల్లర వర్తకులను తీవ్ర కష్ట, నష్టాలకు గురి చేస్తున్నారన్నారు. రెండు కేజీల పప్పు, కేజీ పంచదార కొనుగోలు చేస్తే రూ. 200 అవుతుందని, అరకేజీ టీ పొడి కొనుగోలు చేసినా రూ. 200 దాటుతుందన్నారు. రద్దీ సమయంలో వర్తకుడు వ్యాపారం చూసుకుంటా? బిల్లు రాస్తాడా అని ఆయన ప్రశ్నించారు. రిటర్న్స్‌ అన్ని కంప్యూటర్‌లో లోడ్‌ చేయాలని, వే బిల్లు అయితే డౌన్‌ లోడ్‌ చేయాలన్నారు. ఈ అప్లోడ్‌, డౌన్లోడ్‌ల గొడవ చిల్లర వర్తకునికి గుది బండ వంటిదన్నారు. ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తే చిల్లర వర్తకుడిని సమూలంగా నిర్మూలించి బడా కార్పొరెట్‌ కంపెనీలను ప్రోత్సహించడం లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. గత యూపీఏ ప్రభుత్వం రిటైల్‌ వాణిజ్యంలో 50 శాతం విదేశీ నిధులను అనుమతిస్తే ఆనాటి ప్రతిపక్ష పార్టీ బిజెపి దేశంలోని రెండు కోట్ల చిన్న వర్తకులు జీవనాధారం కోల్పొతారని గగ్గోలు చేసి మొసలి కన్నీరు కార్చిందని, అయితే 2014 లో అధికారం చేపట్టిన బిజెపి పాలకులు వెంటనే రిటైల్‌ వాణిజ్యంలో 50 శాతం ప్రత్యక్ష పెట్టుబడుల స్థానంలో చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులకు అనుమతించడం ద్వారా నమ్మించి గొంతు కోసిందని ఆయన వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు, ఆర్థిక లావాదేవీలపై ఆంక్షలతో చిన్న చిల్లర వ్యాపారం ఘోరంగా దెబ్బతిందని, ఆర్థిక లావాదేవీల వ్యవస్థ అతలాకుతలమైందని, రూ. 20 వేలకు రొక్కం లావాదేవీలు మించితే చెక్కులు ప్రవేశపెట్టి, ఆ చెక్కులకు చార్జీల మోత మోగిస్తున్నారని శ్రీనివాస్‌ అన్నారు. చిల్లర వర్తకుడి చిన్న తప్పిదాలను రూ 20 వేల పెనాల్టీ క్లాజులో రెండు సార్లు వర్తకుడు చిక్కుకుంటే వారి బ్రతుకు తెల్లారినట్టేనన్నారు. అయితే ఇదేమీ అమరావతి నిర్మాతల తలకెక్కదని, నినాదాల హోరు, ప్రచార పటాటోపంతో పరిపాలన సాగుతోందని, అభివృద్ధి కుంటుపడిందని, ప్రజలకు కొనుగోలు శక్తి సన్నగిల్లి వర్తక వాణిజ్యాలు దెబ్బతిన్నాయన్నారు. జీఎస్టీ అధికారుల టార్గెట్లకు బలి కాకుండా జాగ్రత్త గా మనల్ని మనం రక్షించుకోవాలని, లేకుంటే పండుగకు కుటుంబ సభ్యులకు ఒక పూట పిండివంటలకు కూడా నోచుకోమని శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. వచ్చే నెలలో జిల్లా సదస్సు ఏర్పాటు చేసి భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం రూపొందించి వర్తకుల సత్తా చాటుతామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here