6న స్వర్ణాంధ్ర ద్విదశాబ్దాల వేడుక

0
36

రాజమహేంద్రవరం, జనవరి 4 : గత 20 ఏళ్ళుగా వివిధ రంగాల్లో సామాజిక సేవలందిస్తున్న స్వర్ణాంధ్ర సేవా సంస్థ స్థాపించి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈనెల 6న ద్విదశాబ్దాల వేడుకలు నిర్వహిస్తున్నట్లు స్వర్ణాంధ్ర వ్యవస్థాపక కార్యదర్శి లయన్‌ డాక్టర్‌ గుబ్బల రాంబాబు తెలిపారు. లాలాచెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సేవా సంస్థ ద్వారా 20 ఏళ్ళలో వృద్ధులను ఆదుకుంటూ రోజుకి 300 మందికి పైగా భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నామని, మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 20వేలమందికి శిక్షణనిచ్చామని తెలిపారు. దీంతోపాటు మహిళల కోసం షీ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని, గతంలో తుమ్మిడి చారిటబుల్‌ ట్రస్ట్‌, సి.పి.రెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌లతో సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేవారమని, ఇప్పుడు భవానీ చారిటబుల్‌ ట్రస్ట్‌తో కలిసి నగరంలో వివిధ చోట్ల వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బడి బయట పిల్లలను బడికి పంపి వారికి సాయంత్రం వేళల్లో ట్యూషన్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైట్‌ షెల్టర్‌కు భోజన సౌకర్యాన్ని స్వర్ణాంధ్ర చేపడుతోందన్నారు. 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా స్వచ్ఛంద సేవకులతో ఈనెల 6న వృద్ధాశ్రమంలోనే సమ్మేళనం నిర్వహించి సేవాతత్పరులను సత్కరిస్తామన్నారు. స్వర్ణాంధ్ర అధ్యక్షులు రుంకాని వెంకటేశ్వరరావు, గౌరవ సలహాదారులు విశ్రాంత డిఎస్పీ వి.రాజ్‌గోపాల్‌లు మాట్లాడుతూ కుల, మత రాజకీయాలకతీతంగా స్వర్ణాంధ్ర నడుస్తోందని ఈ సేవలు మరింత విస్తృతం చేసేలా తమ వంతు సహకరిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో హెల్పింగ్‌ హ్యాండ్స్‌ అడ్మిన్‌ అనూప్‌ జైన్‌, బొప్పన నాగేశ్వరరావు, భరణి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here