నిజాలు పంచుకోవడానికి అభ్యంతరాలు ఎందుకు ?

0
51

మళ్ళీ అడుగుతున్నా…పోలవరంపై శ్వేతపత్రం ఇవ్వండి !

మాజీ ఎం.పి. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ డిమాండ్‌

రాజమహేంద్రవరం, జనవరి 5 : పోలవరం ప్రాజక్ట్‌ నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదైనప్పుడు ఆ పనుల పురోగతి, నిధుల విషయంలో ప్రజలతో నిజాలు పంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరాలు ఎందుకని మాజీ ఎం.పి. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సూటిగా ప్రశ్నించారు. ప్రాజక్ట్‌ పనుల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు, అక్కడి వాస్తవ పరిస్థితులకు పూర్తి విరుద్ధంగా ఉందని, పనులు జరుగుతున్న తీరు చూస్తే 2019 నాటికి ప్రాజక్ట్‌ పూర్తి కావడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదని ఆయన అన్నారు. పనుల పురోగతి, కేంద్రం నుంచి నిధుల మంజూరు తదితర విషయాలపై శ్వేతపత్రం ప్రకటించాలని మొత్తుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దాటవేస్తోందో అర్ధం కావడం లేదన్నారు. స్ధానిక వై.జంక్షన్‌లోని ఆనం రోటరీ హాలులో ఈరోజు ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ 2018 నూతన సంవత్సరంలో పోలవరం ప్రాజక్ట్‌ పనులు తిరిగి ప్రారంభమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన కుదిరి పూర్తవుతుందన్న నమ్మకం ప్రజలకు కలిగించాలని, అలాగే చంద్రబాబు ప్రజలతో నిజాలు పంచుకునే శక్తి భగవంతుడు ఇవ్వాలని తాను కోరుకుంటున్నట్లు ఉండవల్లి చెప్పారు. అయితే ఎవరేమీ మాట్లాడినా తమకు వ్యతిరేకంగా మాట్లాడారని, మాట్లాడిన వారంతా రాక్షసులని, ప్రగతి నిరోధకులనమని భావనను మనస్సు నుంచి చెరిపేసుకోకుంటే రాష్ట్రానికి మంచి రోజులు రావని ఆయన అన్నారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన ప్రాజక్ట్‌ పనుల పురోగతిపై నివేదిక ఇవ్వడానికి ఇష్టం లేకపోతే 2014లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక జరిగిన పనుల పురోగతిపైన శ్వేతపత్రం ఇవ్వాలని ఆయన సూచించారు. ప్రాజక్ట్‌లో వివిధ విభాగాలకు సంబంధించిన పనులు మాటల్లోనే శరవేగంగా జరుగుతున్నాయని, వాస్తవానికి ఆ పనులు చాలా మందకొడిగా సాగుతున్నాయని అన్నారు. ప్రాజక్ట్‌లో జరిగిన పనుల కంటే ఎక్కువ మొత్తంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు జరిగిందని, జలవనరుల శాఖకు సంబంధించి చిరుద్యోగిని పంపినా ఆ విషయాన్ని తాను రుజువు చేస్తానని, అలాగే తన సమాచారం తప్పు అని రుజువు చేయడానికి కూడా ప్రభుత్వానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఈ ప్రాజక్ట్‌పై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరి వద్ద కాంట్రాక్ట్‌ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌, పోలవరం ప్రాజక్ట్‌ అథారిటీ ఇచ్చిన ప్రజంటేషన్‌ ఆధారంగానే పనులు మందకొడిగా సాగుతున్నాయని తాను చెబుతున్నానని, అయితే పనులు ఆశించినట్లుగా జరగకున్నా సీఎం, మంత్రులు ఈ ఏడాదికి పూర్తవుతుందని ఎలా చెబుతున్నారో ఆశ్చర్యంగా ఉందని, ఇది ముమ్మాటికీ ప్రజలను వంచించడానికి, తప్పుదారి పట్టించడానికేనని ఆయన పేర్కొన్నారు. ప్రాజక్ట్‌పై శ్వేతపత్రం కోరితే వెబ్‌సైట్‌లో అన్నీ ఉంటాయంటున్నారని, అయితే అంతర్జాలంలో ఈ వెబ్‌సైట్‌ ఎక్కడా దొరకదని, ప్రాజక్ట్‌ పూర్తి బాధ్యత రాష్ట్రానికి దాపరికమెందుకో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాకముందు ప్రాజక్ట్‌పై రూ. 5,130 కోట్లు ఖర్చు చేయగా చంద్రబాబు వచ్చాక ఈ మూడున్నరేళ్ళలో రూ. 3,007 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అయితే గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ. 4,641 కోట్లు మంజూరు చేసిందని, ఈ విషయాన్ని సంబంధిత మంత్రి రాజ్యసభలో చెప్పారని, దీంతో ఏది నమ్మాలో తెలియడం లేదని ఆయన అన్నారు. ప్రాజక్ట్‌ నిర్మాణంలో వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకోవడానికి తాను గూగుల్‌లో పరిశోధిస్తుంటే ఫలాన వెబ్‌సైట్‌కు వెళ్ళాలని సూచిస్తే తాను ప్రయత్నించగా ఆ సైట్‌ ఎడ్రస్‌, పాస్‌వర్డ్‌ తెలియలేదని, అసలు ప్రాజక్ట్‌పై వాస్తవాలను కప్పి పుచ్చడానికి ఇదేమీ తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం కాదని, ప్రజా ప్రయోజనానికి సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం ఇలా దాపరికంగా వ్యవహరించడం ఎందుకో అర్ధం కావడం లేదన్నారు. పనుల పురోగతి, నాణ్యత విషయంలో వాస్తవాలను ప్రజలతో పంచుకోవడానికి ప్రభుత్వానికి ఎందుకు అభ్యంతరమని ఆయన ప్రశ్నించారు. ఈ ధోరణి వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్నారు. ప్రాజక్ట్‌ను నాణ్యతతోనే నిర్మిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా కొందరికి అనుమానాలు ఉన్నప్పుడు వాటిని నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, నాణ్యతా లోపాలుంటే జరగరానిదేదైనా జరిగితే లక్షలాది మంది ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుందని ఆయన హెచ్చరించారు. వాగ్ధానాల విషయంలో ప్రజలకు జ్ఞాపకం ఉండదని ఎవరైనా అనుకుంటే పొరపాటేనని, ఇప్పుడు సోషల్‌ మీడియా చాలా చురుగ్గా ఉన్నందున ఏ నాయకుడు, ఏ పాలకుడు ఎప్పుడేమీ మాట్లాడారో సులభంగా తెలుస్తుందని ఆయన అన్నారు. చంద్రబాబుపై అభాండాలు వేయాలని తాను మాట్లాడటం లేదని, జరుగుతున్న తీరు తప్పు అని, ప్రమాదకరమని తెలియజేయడానికేనని ఆయన అన్నారు. పోలవరంపై కాంగ్రెస్‌ పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని, రాజ్యసభలో మెజార్టీ ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పోలవరంపై కేంద్రంపై ఒత్తిడి తేవడానికి అవకాశం ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఉండవల్లి అన్నారు.

సీఎం వ్యవహరించే తీరు ఇలాగేనా ?

జన్మభూమి సందర్భంగా కడప జిల్లాలో జరిగిన గ్రామసభలో ఆ జిల్లాకు సంబంధించిన గండికోట రిజర్వాయర్‌ గురించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపి అవినాష్‌రెడ్డి మాట్లాడుతుంటే సీఎం చంద్రబాబు అడ్డుకుని గద్దింపు ధోరణిలో మాట్లాడటం తగదని ఉండవల్లి అన్నారు.రాజశేఖరరెడ్డి హయాంలో పనులు చాలా వరకు పూర్తయ్యాయని అవినాష్‌రెడ్డి చెప్పినప్పుడు సీఎం విని ఆ తర్వాత తన ప్రసంగంలో వివరణ ఇవ్వవచ్చని, అయితే ఏకంగా మాట్లాడుతుంటే మైక్‌ కట్టేయడం, ఆపవయ్య అంటూ తానే మైక్‌ లాగేసుకోవడం ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదన్నారు. వంచన వేరు.. ఆత్మ వంచన వేరని, అయితే చంద్రబాబు ఆత్మ వంచన చేసుకుంటూ ప్రత్యర్ధుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిని పార్టీ మనిషిగా చూడటం సమంజసం కాదని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని గతంలో చెప్పిన కేంద్ర మంత్రి, తెదేపా నేత సుజనా చౌదరి మొన్న రాజ్యసభలో హైకోర్టు విభజన విషయమై చర్చ జరుగుతున్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమైందని ప్రశ్నించడం చూస్తే విభజన సమస్యలపై వీరికే ఒక ధృఢ అభిప్రాయం లేదని అర్ధమవుతోందన్నారు. విలేకరుల సమావేశంలో పొడిపిరెడ్డి అచ్యుత్‌ దేశాయ్‌, అల్లు బాబి, బండారు మధు, చెరుకూరి వెంకట రామారావు, పసుపులేటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here