పెద్దనోట్ల రద్దు, జి ఎస్ టి గాయాలకు ప్రభుత్వ ఖర్చు పెరుగుదలే చికిత్స (శనివారం నవీనమ్)

0
65

పెద్దనోట్ల రద్దు, జి ఎస్ టి గాయాలకు
ప్రభుత్వ ఖర్చు పెరుగుదలే చికిత్స
(శనివారం నవీనమ్)

పెద్దనోట్ల రద్దువల్ల, జిఎస్ టి పర్యావసానాలవల్లా కుదేలైపోయిన ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపచేయడానికై ప్రభుత్వ ఖర్చులను బాగా పెంచాలని మోదీ ప్రభుత్వం‌ సంకల్పించింది. ఈ సంకల్ప సాఫల్యం, లేదా వైఫల్యం ప్రభుత్వం అనుసరించే ఇతర విధానాలపై ఆధారపడి వున్నది. ఈ ఆర్థిక సూక్ష్మాన్ని అర్థంచేసుకోవాలంటే వృద్ధిరేటు పతనానికి దారితీసిన కారణాలను నిశితంగా సమీక్షించాలి.
 
వస్తూత్పత్తి కార్యకలాపాల్లో ఆటోమేటిక్‌ యంత్రాలను పెద్దఎత్తున వాడుతుండడం వృద్ధి రేటు పతనానికి మొదటి కారణం. ఆటోమేషన్ వల్ల పెద్ద ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గుతోంది. అయితే చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలు కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నాయి. సగటు మనిషి కొనుగోలు సామర్థ్యం తక్కువగా వుండడం వల్ల మార్కెట్‌లో డిమాండ్‌ పడిపోవడంతో వృద్ధిరేటు అంతకంతకూ పతనమవుతోంది.

ఉదాహరణకు గతంలో ప్రతి చిన్న పట్టణంలో బిస్కట్‌, బ్రెడ్‌ మొదలైన తినుబండారాల తయారీదారులు వుండేవారు. ఇప్పుడీ సరుకులు పూర్తిగా నగరాల్లో వున్న పెద్ద ఫ్యాక్టరీల్లో ఉత్పత్తవుతున్నాయి. ఇందువల్ల చిన్నతరహా పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇప్పుడు పూర్తిగా మాయమైపోతున్నాయి. ఉద్యోగాలసంఖ్య పడిపోవడం కొనుగోలు మార్కెట్‌లో డిమాండ్‌ పడిపోవడానికి, వేతనాల తగ్గుదలకు దారితీసింది.
 
మరి, ప్రభుత్వ ఖర్చుల పెంపుదల ఆర్థిక మాంద్యాన్ని రూపుమాపగలుగుతుందా? బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టునే తీసుకోండి. ఉద్యోగాల సృష్టికి ఇదేమీ తోడ్పడదు. సంపన్నుల ప్రయాణ వ్యయాలను మాత్రం తగ్గిస్తుంది. చిన్న పట్టణాల లోని తినుబండారాల ఉత్పత్తిదారులకు బుల్లెట్‌ ట్రైన్‌తో పొందే ప్రయోజనమేమీ వుండదు. ఆ ప్రాజెక్టు వ్యయాన్నే చిన్న పట్టణాలు, గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి వినియోగిస్తే భిన్న, మరింత మేలైన ఫలితాలు సమకూరతాయి. పాల సరఫరా మొదలైన కుటుంబ వ్యాపారాల నిర్వహణ మరింత మెరుగుపడడానికి ఆ రోడ్లు విశేషంగా తోడ్పడుతాయి. పాల వ్యాపారి పట్టణాలకు సులువుగా రాగలిగి యాంత్రీకృత డెయిరీలతో పోటీపడగలుగుతాడు.
 
ఉన్నతస్థాయిల్లో నల్లధనం పాత్ర తగ్గిపోవడం పెరుగుదల రేటు పడిపోవడానికి రెండో కారణం. నల్లధనాన్ని అరికట్టడానికై సాహసోపేతంగా పెద్ద విలువగల కరెన్సీ నోట్ల రద్దు మోదీ ప్రభుత్వ మహావిజయంగా ప్రచారమౌతున్నది. అయితే నల్లధనం తగ్గింపు నిజానికి వృద్ధిరేటు పెరుగుదలను తగ్గించేస్తోంది.

మంత్రులు, ఉన్నతాధికారులు రియల్ ఎస్టేట్ మార్కెట్లలో నల్లధనాన్ని పెట్టుబడిపెట్టడమూ, అది డిమాండ్‌ సృష్టించడమనే ఆర్థిక ప్రక్రియకు అవకాశం లేకుండా పోయింది. ఒక మంత్రి ఒక హైవే ప్రాజెక్ట్‌ను మంజూరు చేసినందుకుగాను సంబంధిత కాంట్రాక్టర్‌ నుంచి రూ.100 కోట్ల లంచం తీసుకుంటాడనుకోండి. ఆ మంత్రి ఆ సొమ్మును రియల్ ఎస్టేట్ మదుపు చేస్తాడు. తత్ఫలితంగా కొత్త ఉద్యోగాలు సృష్టి అవుతాయి.
 
సదరు మంత్రి ఎటువంటి ముడుపులు తీసుకోడని అనుకుందాం. జరిగేదేమిటి? ఆస్తుల మార్కెట్ లో మదుపులు తగ్గిపోతాయి. తత్కారణంగా సిమెంట్‌, ఉక్కు, శ్రమ శక్తికి డిమాండ్‌ తగ్గుతుంది. హైవే నిర్మాణవ్యయం కూడా రూ.100 కోట్ల మేరకు తగ్గుతుంది. దీనివల్ల లగ్జరీ కార్లలో ప్రయాణించే వారు లబ్ధి పొందుతారు. ఆస్తుల విపణిలో తగ్గిపోయిన డిమాండ్‌తో సంభవించిన నష్టాన్ని ఆ లబ్ధిదారులు పూరించగలరా? సమాధానం స్పష్టమే. ఆర్థికవ్యవస్థ సజావుగా, శక్తిమంతంగా ముందుకు సాగాలంటే అవినీతి తగ్గుదల కారణంగా తగ్గిపోయిన మదుపుల మేరకు ప్రభుత్వ వ్యయాలను పెంచి తీరాలి.

పెద్ద నోట్ల రద్దు, వస్తుసేవల పన్ను(జీఎస్టీ)తో వినియోగదారుల, చిన్న వ్యాపార సంస్థల ప్రయోజనాలకు కలిగిన షాక్ వృద్ధిరేటు ప్రస్తుత పతనానికి మూడో కారణం. నోట్లరద్దుతో అసంఖ్యాక కుటుంబాల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లింది. కుటుంబ భద్రతకు, భావి అవసరాలకు ముందస్తు జాగ్రత్తగా గృహిణులు పెద్దమొత్తంలో నగదును దాచుకోవడం పరిపాటి. ప్రభుత్వం పట్ల విశ్వాసం సడలిపోవడంతో ఇప్పుడు వారు బంగారం కొనుగోళ్లకు ప్రాధాన్యమిస్తున్నారు. బంగారం నిల్వలు తమకు ఆర్థికభద్రతను సమకూరుస్తుందని వారు విశ్వసిస్తున్నారు నోట్లరద్దు అనంతరం బంగారం కొనుగోళ్లు దాదాపు రెట్టింపవడమే ఇందుకు నిదర్శనం. బంగారం కొనుగోలుకు వినియోగిస్తున్న ధనం దేశం వెలుపలికి వెళ్ళిపోతోంది.
 
జీఎస్టీ ప్రతి చిన్న వ్యాపారికి పెనుభారమై పోయింది. జీఎస్టీని చెల్లించేందుకు అయ్యే వ్యయాలు హెచ్చుస్థాయిలో వుంటున్నాయి. బడా వ్యాపార సంస్థలతో పోటీ పెరగడంతో చిన్న వ్యాపార సంస్థల వ్యాపార దక్షతకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ఈ కారణంగా ఉద్యోగాల సృష్టి అంతకంతకూ తగ్గిపోతోంది. దీంతోపాటు డిమాండ్‌ కూడా పడిపోతోంది.

నోట్ల రద్దు, జీఎస్టీలతో కలిగిన నష్టాన్ని ఏ విధమైన ప్రభుత్వ వ్యయాలు భర్తీచేయలేవు.

సామాన్య ప్రజలను మోసకారులుగా పరిగణించే వైఖరిని ప్రభుత్వం మానుకోవాలి. నోట్ల రద్దు వైఫల్యాన్ని అంగీకరించి తీరాలి. అటువంటి చర్య మరోసారి తీసుకోబోమని ప్రజలకు ప్రభుత్వం తప్పనిసరిగా నమ్మకాన్నియివ్వాలి.
 
వ్యాపారులంటే– చిన్న, పెద్దా– మోసకారులు అనే భావనను ప్రాతిపదికగా జీఎస్టీని అమలుపరచే యంత్రాంగాన్ని నెలకొల్పారు. ప్రభుత్వ ఈ వైఖరిని మార్చుకోవాలి. సామాన్య పౌరులు నిజయితీపరులని ప్రధానమంత్రి మోదీ విధిగా విశ్వసించాలి; కార్పొరేట్‌ కంపెనీల నుంచి ఎదురయ్యే పోటీ నుంచి చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలకు పూర్తి రక్షణ కల్పించాలి; పెద్ద వ్యాపార సంస్థల పోటీని అధిగమించేందుకై చిన్న వ్యాపార సంస్థలకు తోడ్పడేలా ప్రభుత్వ వ్యయాలు పెరగాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here