రాలే చింతకాయలకు మంత్రాలు చదువుతున్నారా ?

0
28

పోలవరంపై కాంగ్రెస్‌ మహా పాదయాత్ర హాస్యస్పదం

మీరేం చేసినా మీ ద్రోహాన్ని ప్రజలు మరువరు : గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ

రాజమహేంద్రవరర, జనవరి 8 : తమ స్వార్ధ రాజకీయాల కోసం కుటిల ప్రయత్నాలు చేసి ఆదాయం ఉన్న ప్రాంతాన్ని ఓ వైపు, అప్పులు ఉన్న ప్రాంతాన్ని ఓ వైపు విడదీసి ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీ ఇపుడు తగుదునమ్మ అంటూ పోలవరం కోసం మహాపాదయాత్ర చేయడం, చంద్రబాబుపై విమర్శలు హాస్యాస్పదంగా ఉందని గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) చైర్మన్‌, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్‌ నాయకులు గన్ని కృష్ణ ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజక్ట్‌ పనులను శరవేగంగా పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో 2019 నాటికి సాగు నీరందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తుండగా రాలే చింతకాయలకు మంత్రాలు చదివినట్టుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను అష్టకష్టాపాల్జేసిన కాంగ్రెస్‌ పార్టీ పోలవరాన్ని పూర్తి చేయాలంటూ మహాపాదయాత్ర చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ చేపట్టిన ఈ మహా పాదయాత్రను సమాధిలోని శవం ప్రాణం పోసుకునే ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు. స్వప్రయోజనాల కోసం సీమాంధ్ర ప్రజల మనోభీష్టానికి విరుద్ధంగా ఈ ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టి సమైక్యాంధ్రను అర్ధరాత్రి అడ్డగోలుగా విభజించి అప్పులతో కూడిన ఏపీని మనకు అప్పగించి 2014 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెల్చుకోలేనంతగా తీవ్ర ప్రజాగ్రహానికి గురైన కాంగ్రెస్‌ పార్టీ చేసిన ద్రోహాన్ని ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని, అయితే కాంగ్రెస్‌ పార్టీ నేతలు ప్రజల జ్ఞాపకశక్తిని తక్కువగా అంచనా చేసి పాదయాత్ర చేపట్టారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గన్ని మాట్లాడుతూ 2019లో రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక పోలవరం ప్రాజక్ట్‌ను ప్రారంభిస్తారని నిన్న కాంగ్రెస్‌ నేతలు చెప్పడం ద్వారా అప్పటికి ప్రాజక్ట్‌ పూర్తవుతుందని వారు పరోక్షంగా అంగీకరించినట్టే కదా అని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా నిత్యం చంద్రబాబును ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్న ప్రజలు తీసేసిన తహసీల్దార్లు అయిన కాంగ్రెస్‌ నేతలు, ఎన్నికల్లో డిపాజిట్‌ కూడా దక్కించుకోలేని వారు నవ్విపోదురు గాక నాకేంటి అన్నట్టుగా విమర్శలు చేస్తున్నారని గన్ని అన్నారు. పోలవరాన్ని పూర్తి చేయాలనే చిత్తశుద్ధి ఉన్నందునే చంద్రబాబు 2014 ఎన్నికల తర్వాత ప్రధాని మోడీతో మాట్లాడి పట్టుపట్టి పోలవరం ముంపు మండలాలను తెలంగాణా నుంచి ఏపీలో విలీనం చేయించారని, పోలవరంపై కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే జాతీయ ప్రాజక్ట్‌గా ప్రకటించి కూడా 2014లో గద్దె దిగే ముందు ముంపు మండలాలను ఆంధ్రాలో ఎందుకు విలీనం చేయలేదో పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యాకే పోలవరం ప్రాజక్ట్‌ పనులు వేగవంతం అయ్యాయని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారని, వైఎస్‌ హయాంలో పోలవరం కాలువలు తవ్విన మాట వాస్తవమే అయినా రైతులు అభ్యంతరాలు చెప్పిన చోట కాలువ పనులు వదిలేశారని, అయితే చంద్రబాబు వచ్చాక అక్కడి రైతుల్ని ఒప్పించి కాలువల నిర్మాణం పూర్తి చేశారని గన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ పేరుతో పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలను దోచిపెట్టి వైఎస్‌ హయాంలో జల యజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చిన విషయాన్ని కూడా కాంగ్రెస్‌ నేతలు మరువరాదన్నారు. అయితే పోలవరం ప్రాజక్ట్‌ విషయంలో రాజమహేంద్రవరం మేథావులు సైతం ఈ విషయాలన్ని మర్చిపోయి రకరకాలుగా మాట్లాడుతున్నారని, కాఫర్‌డ్యామ్‌ అనవసరమని కొందరు మాట్లాడుతున్నారని, ఇలా పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారం వల్ల ప్రాజక్ట్‌కు నిధుల విడుదలలో కేంద్రం జాప్యం చేస్తోందని, అయితే ఆ అవరోధాలన్నింటిని అధిగమించి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించి పోలవరం పనులను వేగవంతం చేస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ హడావిడి చేయడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. వీరందరికి చెంప పెట్టుగా 2019 నాటికి పోలవరాన్ని పూర్తి చేయడం కోసం చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని, ఒక సారి మోసం చేసిన కాంగ్రెస్‌ నేతల చేతుల్లో మళ్ళీ మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని గన్ని అన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని అంటున్న కెవిపి రామచంద్రరావు, రఘువీరారెడ్డి తదితర కాంగ్రెస్‌ నేతలు విభజన చట్టంలో ఆ హోదా అంశాన్ని ఎందుకు చేర్చలేదో సమాధానం చెప్పాలని గన్ని డిమాండ్‌ చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఒట్టి దండుగ అని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయని, అయితే పట్టిసీమ వలనే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మెట్ట ప్రాంతాలు సస్యశ్యామలమై అక్కడ రైతులు ఆనందంతో ఉన్నారని, చివరికి ప్రతిపక్ష నేత జగన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల ప్రాంతానికి కూడా సాగునీరిచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదేనని, అయితే ఇవేమీ తెలియనట్టుగా అధికారం కోసం పాదయాత్ర చేస్తూ ప్రజలకు ఆచరణ సాధ్యం కాని వాగ్ధానాలు చేస్తున్న ప్రతిపక్ష నేత జగన్‌ ప్రతి చోటా చంద్రబాబు చేసిందేమిటని ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు.

అడిగి పనులు చేయించుకోవడానికే జన్మభూమి

జన్మభూమి – మా వూరు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు ప్రజలు తమ సమస్యలను చెప్పుకుని వాటిని పరిష్కరించాలని కోరడంతో పాటు ”మాకీ ఈ పనులు కావాలి ..ఎందుకు చేయలేదు” అని అడిగేందుకే గ్రామసభలు నిర్వహిస్తున్నారని, ప్రజా సమస్యల పరిష్కారమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్ధేశ్యం కాగా ప్రజలు నిలదీస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు, కొన్ని పత్రికలు అభూత కల్పనలు ప్రచారం చేస్తున్నాయని గన్ని కృష్ణ అన్నారు. గ్రామసభల్లో తాము పాల్గొని వెళ్ళాక అక్కడికి వచ్చి అలజడి సృష్టించి ప్రతిపక్షాలు ప్రచారం చేసుకుంటున్నాయని, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉండగా వచ్చి ఏదైనా అడిగితే అందుకు తాము సమాధానం చెబుతామని ఆయన అన్నారు. వాస్తవానికి ప్రతిపక్ష నేతల డివిజన్లలోనే ఎక్కువ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇకనైనా ప్రతిపక్షాలు దివాళాకోరు రాజకీయాలకు స్వస్తి చెప్పాలని ఆయన కోరారు.

విషబీజాలు నాటే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి

నగరంలో ఇటీవల కొన్ని ప్రార్థనా మందిరాల్లో చోరీ ప్రయత్నాలు జరగడం ఆందోళన కలిగిస్తోందని, బత్తిననగర్‌లోని మసీదులో మౌజమ్‌ హత్య చాలా బాధాకరమని, ఈ నేపథ్యంలో మైనార్టీలు అభద్రతా భావానికి గురి కావడం సహజమేనని, అయితే దీనిపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మూడు రోజుల్లోగా నిందితుడిని అరెస్టు చేయించారని గన్ని అన్నారు. అయితే ఈలోగా శవాలపై రాజకీయాలు చేస్తూ ప్రతిపక్ష పార్టీలు రకరకాలుగా మాట్లాడాయని, తీరా దోషిని పట్టుకున్నాక హత్య చేసింది ఇతడు కాదనడం సరికాదన్నారు. వీరి ధోరణి ఆయా మతస్తుల మనోభావాలను దెబ్బతీసేలా, యువకుల్లో విషభీజాలు నాటేలా ఉందని ఆయన అన్నారు. దొంగలు ఇటీవల హిందూ దేవాలయాల్లో కూడా చోరీలకు ప్రయత్నించారని, శ్రీరామనగర్‌లోని తన నివాసం వద్ద ఉన్న గణపతి ఆలయంలో కూడా చోరీ ప్రయత్నం జరిగిందని, దొంగలకు ఆ మతం..ఈ మతం.. కులం అని ఉండబోవని, అయితే కొందరు వ్యక్తులు, పార్టీలు ఈ చోరీలకు కూడా మత రంగు పులిమే ప్రయత్నం చేయడం మాత్రం క్షమించరాని విషయమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రశాంతమైన రాజమహేంద్రవరం నగరంలో విషభీజాలు నాటే ప్రయత్నం చేయవద్దని గన్ని అభ్యర్థించారు.

నిరాశ, నిస్పృహలతో దిగజారుడు ప్రకటనలు

విజయవాడ దుర్గమ్మ గుడిలో కొందరు అర్ధరాత్రి తాంత్రిక పూజలు చేస్తే లోకేష్‌కు రాజయోగం కోసం చేసినట్టుగా ప్రతిపక్ష పార్టీల నాయకులు మాట్లాడటం అవి వారి నిరాశ, నిస్పృహలకు అద్దం పడుతున్నాయని, రాష్ట్రంలో ఏ కీడు, చెడు ఘటనలు జరిగినా అది చంద్రబాబుకు, లోకేష్‌కు ఆపాదించడం వారికి పరిపాటైందని, మీడియా కూడా ఇటువంటి ఘటనలకు ప్రాధాన్యం ఇవ్వవద్దని గన్ని కృష్ణ విజ్ఞప్తి చేశారు. దుర్గ గుడి వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించి ఇఓను విధుల నుంచి తప్పించి లోతైన దర్యాప్తునకు ఆదేశించారని ఆయన అన్నారు. విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు యిన్నమూరి రాంబాబు, తంగెళ్ళ బాబి, బెజవాడ రాజ్‌కుమార్‌, పార్టీ నాయకులు కురగంటి సతీష్‌, మళ్ళ వెంకట్రాజు, బొచ్చా శ్రీను, ఉప్పులూరి జానకిరామయ్య, కాట్రు లక్ష్మణస్వామి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here