ఆటుపోట్ల ప్రస్థానం.. మూడున్నర దశాబ్ధాల పయనం

0
42

ముఖ్యమంత్రిగా ఎన్‌టిఆర్‌ ప్రమాణస్వీకారం చేసి నేటికి 35 ఏళ్ళు

1983, జనవరి 9… తెలుగు వారి గుండెల్లో ఈ తేదీకి ఓ విశిష్టత ఉంది. సమైక్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం కొలువు తీరిన తేదీ ఇది… దివంగత నందమూరి తారక రామారావు తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర పుటాల్లో నిల్చి నేటికి మూడున్నర దశాబ్ధాలైంది. సుదీర్ఘ కాంగ్రెస్‌ పాలనతో విసుగు వేసారి ప్రత్యామ్నయం కోసం ఎదురుచూస్తున్న నాటి సమైక్యాంధ్రప్రదేశ్‌వాసులకు ‘నేనున్నాను’ అని ఆశాకిరణంలా రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీని నెలకొల్పి కేవలం 9 నెలల కాలంలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి చరిత్ర సృష్టించారు ఎన్‌టిఆర్‌. 1982 మార్చి 28న తెలుగుదేశం పార్టీని నెలకొల్పుతున్నట్లు ప్రకటించి ఆ తర్వాత 9 నెలల వ్యవధిలో నాటి సమైక్యాంధ్రలోని 23 జిల్లాల్లోె ఎన్‌టిఆర్‌ విస్తృతంగా పర్యటించి మొత్తం 294 స్ధానాలకు గాను దాదాపు 200 స్ధానాల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. 1983 జనవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగగా తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు భారీ మెజార్టీలతో అత్యధిక స్ధానాల్లో గెలుపొందారు. ఉవ్వెత్తున ఎగిసిన కెరటంలా, వెల్లువెత్తిన ఎన్‌టిఆర్‌ ప్రభంజనంలో పెద్దగా రాజకీయ అనుభవం లేని వారు, విద్యాధికులు ఈ ఎన్నికల్లో గెలుపొందారు. చాలా చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్ధులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. తెదేపా చారిత్రక విజయంతో 1983 జనవరి 9న ఎన్‌టిఆర్‌ హైదరాబాద్‌ లాల్‌బహుదుర్‌ శాస్త్రి గ్రౌండ్స్‌లో అశేష జనవాహిని సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ”సమాజమే దేవాలయం…పేద ప్రజలే దేవుళ్ళు” అనే నినాదంతో పనిచేస్తామని చెప్పిన ఎన్‌టిఆర్‌ పేదలకు కూడు, గూడు, గుడ్డ కల్పించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టగానే పేదలకు కిలో రెండు రూపాయలకే బియ్యం, జనతా ధోవతులు ఇవ్వడమే గాక పేదలకు పెద్ద ఎత్తున గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టి చరిత్ర సృష్టించారు. మండల వ్యవస్థను ప్రవేశపెట్టడంతో సహ పరిపాలనలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రజలకు పాలనను చేరువ చేశారు. ఏడాదన్నర పాటు సాఫీగా సాగిపోయిన ఎన్‌టిఆర్‌ ప్రభుత్వానికి 1984 ఆగస్టులో సంక్షోభం ఏర్పడింది. వైద్యం నిమిత్తం అమెరికా వెళ్ళిన ఎన్‌టిఆర్‌ తిరిగి వచ్చే సరికి అప్పుడు ఆయన క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కరరావు కొంతమంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుని ఎన్‌టిఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి కాంగ్రెస్‌ సహకారంతో ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో అప్పట్లో ప్రజాగ్రహం పెల్లుబికింది. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమం సాగి యావత్‌ ఆంధ్రావని అట్టుడికింది. కాంగ్రెసేతర పక్షాలన్నీ ఏకీకృతమై ఉద్యమించడంతో నాటి ప్రధాని దివంగత ఇందిరాగాంధీ దిగి రాక తప్పలేదు. మొత్తం నెల రోజుల పాటు సాగిన ఈ ఉద్యమం ఫలించి తిరిగి సెప్టెంబర్‌లో ఎన్‌టి రామారావు తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తాజాగా ప్రజా తీర్పును కోరుకున్న ఎన్‌టిఆర్‌ తిరిగి 1985 మార్చిలో అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు నిర్వహించి 1983 కంటే అత్యధిక మెజార్టీ స్థానాలతో తిరిగి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. 1989 నవంబర్‌ వరకు ఎన్‌టిఆర్‌ ముఖ్యమంత్రిగా కొనసాగగా దాదాపు ఎనిమిది నెలల ముందే ఎన్నికలకు వెళ్ళిన ఆయనకు ఆ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. ఎన్‌టిఆర్‌ తీసుకున్న కొన్ని నిర్ణయాలకు ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడి తెదేపా ఓటమి చెందింది. తిరిగి 1994 ఎన్నికల్లో తెదేపా ఘన విజయం సాధించగా 1996లో తిరిగి పార్టీలో సంక్షోభం ఏర్పడగా ఎన్‌టిఆర్‌ పదవీచ్యుతులు కావడం చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం జరిగాయి. 1999 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కాగా 2004, 2009 ఎన్నికల్లో తెదేపా ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. 2014లో సమైక్యాంధ్రప్రదేశ్‌ రెండు ముక్కలు కాగా విభజనకు ముందు జరిగిన ఎన్నికల్లో సీమాంధ్రలో బిజెపితో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ మెజార్టీ సీట్లను గెల్చుకుంది. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మొత్తం మీద 36 ఏళ్ళకు పైగా తెలుగుదేశం ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను, సంక్షోభాలను, అపజయాలను, విజయాలను ఎదుర్కొంటూ పయనం కొనసాగిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here