మళ్ళీ అధికారం మనదే

0
54

ప్రభుత్వ విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు

కాకినాడలో జిల్లా తెదేపా కార్యాలయ భవనం ప్రారంభం

రాజమహేంద్రవరం, జనవరి 10 : తెలుగుదేశం ప్రభుత్వం పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారం చేపడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం జిల్లాలో పర్యటించారు. తొలుత కాకినాడ పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్స్‌కు చేరుకున్న ఆయన రోడ్డు మార్గం ద్వారా పాత బస్టాండ్‌ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ఎన్నో సమస్యలతో రాష్ట్ర విభజన జరిగిందని, కష్టాలను ఎదుర్కొంటూ రాష్ట్రాన్ని అభివృద్ధివైపు పయనింప చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడి తెలుగుదేశం జిల్లా కార్యాలయం సుందరంగా ఉందని, మిగిలిన 12 జిల్లాల్లో కూడా పార్టీకి నూతన కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాకినాడకు పెన్షనర్‌ ప్యారడైజ్‌ అనే పేరును సార్థకం చేస్తూ కాకినాడను ప్రపంచంలోనే అగ్రశ్రేణి నగరంలా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. రాబోయే ఎన్నికలలో జిల్లాలోని 19 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుచుకుంటుందని పేర్కొన్నారు. జన్మభూమి-మాఊరు కార్యక్రమం అన్ని జిల్లాలలో విజయవంతంగా నడుస్తోందని, కార్యక్రమానికి అందిన ఫిర్యాదులను, వినతులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు చేరువగా ఉండి, వారి సమస్యల పట్ల తక్షణం స్పందించాలని ఆయన ఆదేశించారు. కాకినాడలోని జిల్లా కార్యాలయం ద్వారా సుస్థిరమైన నాయకులను తయారు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ నిర్మాణంలో నిరంతరం శ్రమించిన నాయకులు మందాల గంగ సూర్యనారాయణను ముఖ్యమంత్రి శాలువా కప్పి సత్కరించారు. ముఖ్యమంత్రి గంట ఆలస్యంగా కాకినాడ చేరుకున్నారు. కాన్వాయ్‌ మూడు లైట్ల జంక్షన్‌ దాటుతుండగా కాన్వాయ్‌లోనికి నయనాల జగన్నాథం అనే వ్యక్తి తన మోటార్‌సైకిల్‌తో ప్రవేశించగా కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని గాయాలపాలయ్యాడు. వెంటనే అతడిని సమీపంలోని గౌతమీ ఆసుపత్రి నందు చేర్చి వైద్యసేవలందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కిమిడి కళా వెంకటరావు, ¬ం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ, నగర మేయర్‌ సుంకరపావని, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, గ్రామీణ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి, జిల్లా పార్టీ అధ్యక్షులు నామన రాంబాబు, ఎంపి తోట నరసింహం, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ జ్యోతుల నవీన్‌, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎన్‌ వర్మ, రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here