ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణకు బిల్డర్ల సహకారం అవసరం

0
46

క్రెడాయ్‌ సత్కార సభలో గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ

రాజమహేంద్రవరం, జనవరి 11 : పట్టణీకరణ ప్రణాళికాబద్ధంగా సాగేందుకు ప్రజలు, బిల్డర్లు సహకరించాలని గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) చైర్మన్‌ గన్ని కృష్ణ కోరారు. ఈ ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుడాతో సహా రాష్ట్రంలో నాలుగు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలను ఒకేసారి ఏర్పాటు చేశారని, అయితే మిగిలిన అథారిటీల కంటే గుడా అత్యంత వేగవంతంగా పనిచేస్తూ రాష్ట్రానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందని ఆయన అన్నారు. క్రెడాయ్‌ రాజమహేంద్రవరం చాప్టర్‌ గత రాత్రి హోటల్‌ లా హాస్పిన్‌లో గన్ని కృష్ణను ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా క్రెడాయ్‌ రాజమహేంద్రవరం చాప్టర్‌ చైర్మన్‌ నందెపు శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గన్ని కృష్ణ మాట్లాడుతూ సిబ్బంది కొరతతో, అరకొర సౌకర్యాలతో బాలారిష్టాలను అధిగమిస్తూ అవరోధానాలను అవకాశాలుగా మలుచుకోవాలన్న సీఎం చంద్రబాబునాయుడు మాటలను స్ఫూర్తిగా తీసుకుని అందరి సమన్వయంతో తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రధాన నగరాలైన కాకినాడ, రాజమహేంద్రవరంలతోపాటు మిగిలిన పట్టణాలలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని సాధించేందుకు సిబ్బంది సహకారంతో కృషిచేస్తున్నామన్నారు. ఆన్‌లైన్‌లో ప్లాన్‌ల ఆమోదం పొందటానికి గుడా వైస్‌ చైర్మన్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ విజయరామరాజు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ తయారు చేయించారని, ఆ తరువాత అది మిగిలిన పట్టణాభివృద్ధి సంస్థలకు మార్గదర్శకమయ్యిందన్నారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి, బిల్డర్ల సమస్యల పరిష్కారానికి క్రెడాయ్‌ కాకినాడ, రాజమహేంద్రవరం చాప్టర్‌లు కలిసి వచ్చి తన దృష్టికి తీసుకు వస్తే వాటిని తదుపరి గుడా బోర్డు సమావేశంలో చర్చించి పరిష్కారానికి కృషిచేస్తానని గన్ని హామీనిచ్చారు. గుడా ద్వారా ప్రణాళికాబద్ధంగా లే అవుట్‌లు రూపొందించి విక్రయించేందుకు కొంత సమయం పడుతుందని, అందుకు రాజధాని అమరావతి మాదిరిగా ల్యాండ్‌ ఫూలింగ్‌ విధానం కూడా వస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని గన్ని అన్నారు. అనధికార లే అవుట్‌ల్లో ఫ్లాట్‌లు కొనుగోలు చేసి మోసపోవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. 2007 తరువాత అనధికార లే అవుట్లను కొనుగోలు చేసి మోసపోయిన వారికి ఊరట కలిగించేలా ఒక విధానాన్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. గుడా ప్రధాన కేంద్రం కాకినాడ ప్రాధాన్యం తగ్గకుండా రాజమహేంద్రవరంలో జోనల్‌ కార్యాలయం పనిచేస్తుందని, రాష్ట్రంలోని మిగిలిన పట్టణాభివృద్ధి సంస్థల కంటే గుడా ఉత్తమమైన సంస్థగా పనిచేసేలా తాము నిర్విరామంగా కృషిచేస్తామని గన్ని చెప్పారు. క్రెడాయ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుడ్డిగ శ్రీనివాస్‌ మాట్లాడుతూ నిబద్ధత, నిజాయితీ, సమర్ధత మెండుగా కలిగిన గన్ని కృష్ణ సారధ్యంలో గుడా అచిరకాలంలోనే మంచి :ఫలితాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఇబ్బందుల్లో ఉన్న ఏపిని అభివృద్ధి పథంలోకి మళ్ళించేందుకు సీఎం చంద్రబాబునాయుడు కృషిచేస్తున్నట్లుగానే బాలారిష్టాలను ఎదుర్కొంటున్న గుడాను కూడా ఇతర పట్టణాభివృద్ధి సంస్థలకు మార్గదర్శకంగా నిలిచేలా చైర్మన్‌ గన్ని కృష్ణ కృషిచేస్తున్నారని ప్రశంసించారు. ప్రజల సౌకర్యార్థంరాజమహేంద్రవరంలో జోనల్‌ కార్యాలయాన్ని ప్రారంభించడం వెనుక గన్ని కృష్ణ కృషి ఎంతో ఉందని, గుడాకు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలన్న యోచన కూడా ప్రశంసనీయమైనదని, తద్వారా పట్టణీకరణ వేగంగా, ప్రణాళికాబద్ధంగా సాగుతుందని ఆయన అన్నారు. గుడా ద్వారా లే అవుట్లను రూపొందించి అనధికార లే అవుట్లను కట్టడి చేయాలని ఆయన అన్నారు. గుడా లే అవుట్ల ద్వారా భూమి ధరలు దిగి వస్తాయన్నారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిలో తాము కూడా భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉన్నామని, అందుకు తమ వంత సహకారం అందిస్తామన్నారు. సభాధ్యక్షులు నందెపు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎలాంటి పదవులు ఆశించకుండా ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తూ సమర్ధత కలిగిన నాయకునిగా పేరొందిన గన్ని కృష్ణ గుడా చైర్మన్‌గా నియమితులు కావడం పార్టీలకతీతంగా అందరికీ ఆనందకరమైన విషయమన్నారు. గుడా డైరెక్టర్‌ గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ బిల్డర్లు మొక్కలు పెంచడానికి, హార్వెస్టింగ్‌కు కృషి చేయాలని కోరారు. తాను బిల్డరేనని, వారి సమస్యలు తనకు తెలుసనని, వాటి పరిష్కారానికి తాము కృషిచేస్తామన్నారు. మరో డైరెక్టర్‌ పిల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గన్ని కృష్ణ కృషితోనే రాజమహేంద్రవరంలో గుడా జోనల్‌ కార్యాలయం ఏర్పడిందన్నారు. మరో డైరెక్టర్‌ ఎలిశెట్టి నాని మాట్లాడుతూ గుడా ద్వారా ప్లాన్‌లను త్వరితగతిన మంజూరు చేయడానికి కృషిచేస్తామన్నారు. గుడా ఇన్‌ఛార్జి సెక్రటరీ సాయిబాబా, గుడా అధికారులు సంజయ్‌, క్రెడయ్‌ రాజమహేంద్రవరం చాప్టర్‌ ప్రెసిడెంట్‌ సూరవరపు శ్రీనివాసకుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ మన్యం ఫణికుమార్‌, సెక్రటరీ వెలుమూరి భీమశంకరరావు, ట్రజరర్‌ అనసూరి రామకృష్ణ, జాయింట్‌ సెక్రటరీ చల్లా సురేష్‌కుమార్‌, యర్రా గురుదేవ్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణను క్రెడయ్‌ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here