సకాలంలో రుణాలు చెల్లించాలి

0
74

మెగా గ్రౌండింగ్‌ మేళాలో మేయర్‌ రజనీ శేషసాయి

రాజమహేంద్రవరం, జనవరి 11 : బ్యాంక్‌ల ద్వారా ప్రభుత్వం అందించిన రుణాలతో వ్యాపారం చేసి సకాలానికే వాటిని చెల్లించాలని మేయర్‌ పంతం రజనీ శేషసాయి లబ్ధిదారులకు సూచించారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యాన స్ధానిక సుబ్రహ్మణ్య మైదాన ప్రాంగణంలో మెగా గ్రౌండింగ్‌ మేళాను నిర్వహించారు. ఎస్సీ, బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులు తాము ఏర్పాటు చేసుకున్న వ్యాపారానికి సంబంధించిన స్టాల్స్‌ను ఈ మేళాలో ప్రదర్శించారు. మేయర్‌ రజనీ శేషసాయి, గుడా చైర్మన్‌, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కమిషనర్‌ విజయరామరాజు తదితరులు వాటిని పరిశీలించారు. బ్యాంక్‌ల ద్వారా ఏ విధంగా రుణాలు పొందారో , ఏ డివిజన్‌ నుంచి వచ్చారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆనం కళా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షత వహించిన మేయర్‌ మాట్లాడుతూ విజన్‌ 2020 దిశగా రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. పేదలకు భరోసాగా ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాల సాధికార దిశగా ప్రభుత్వం సబ్సిడీ రుణాలను అందిస్తుందని, వాటి ద్వారా వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. గన్ని కృష్ణ మాట్లాడుతూ జన్మభూమి సభలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు.2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా రూపు దిద్దుకునేందుకు సీఎం చంద్రబాబు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు. కమిషనర్‌ మాట్లాడుతూ ఇటీవల జరిపిన యూఎల్‌బీ సర్వేలో రాజమహేంద్రవరం నగర పాలక సంస్థకు పదవ ర్యాంక్‌ రావడం ఆనందంగా ఉందని, 2017లో నగరంలో రూ. 10 కోట్ల సబ్సిడీ రుణాలను మహిళా సంఘాలకు అందించడం జరిగిందన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పనలో రాజమహేంద్రవరం మూడవ స్థానంలో నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ ఎన్‌వివి సత్యనారాయణ, డిప్యూటీ కమిషనర్‌ ఎంవిడి ఫణిరామ్‌, మేనేజర్‌ చాపల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు రెడ్డి పార్వతి, తంగెళ్ళ శ్రీనివాస్‌, మర్రి దుర్గా శ్రీనివాస్‌, కోసూరి చండీప్రియ, గరగా పార్వతి, బెజవాడ రాజ్‌కుమార్‌, గాదిరెడ్డి బాబులు, పితాని లక్ష్మీకుమారి, మళ్ళ నాగలక్ష్మీ, మజ్జి నూకరత్నం, పాలవలస వీరభద్రం, మాటూరి రంగారావు, అర్బన్‌ తహసీల్దార్‌ రాజేశ్వరరావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here