పుట్టినప్పుడు కాదు..ప్రయోజకులైనప్పుడే పుత్రోత్సాహం

0
22

ఆ అదృష్టం ఆచంట బాలాజీకి దక్కింది

ఆచంట ఉమేష్‌ సత్కారోత్సవంలో ఉప ముఖ్యమంత్రి రాజప్ప

రాజమహేంద్రవరం, జనవరి 12 : ఆర్ధికంగా సామాన్యుడైనా చిన్నతనం నుంచి పిల్లలను క్రమశిక్షణతో పెంచి క్రీడల పట్ల మక్కువ చూపడం ద్వారా ఇద్దరు పిల్లలను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దిన ఆచంట బాలాజీ అందరికీ ఆదర్శనీయులని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. ఒమన్‌లో జరిగిన అంతర్జాతీయ టీటీ పోటీల్లో బహుమతి సాధించిన ఆచంట ఉమేష్‌కుమార్‌కు అభినందన సత్కారోత్సవాన్ని ఈరోజు మధ్యాహ్నం టౌన్‌హాలులో నిర్వహించారు. గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిమ్మకాయల చిన రాజప్ప, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, కాపు కార్పొరేషన్‌ డైరక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు, తెదేపా యువ నాయకులు ఆదిరెడ్డి వాసు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ ఆచంట బాలాజీ తనకు ఎప్పటి నుంచో పరిచయస్తులని, పిల్లలను చిన్ననాటి నుంచి క్రీడల వైపు మళ్ళించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందడంతో పాటు అంతర్జాతీయ స్ధాయిలో రాణించడం గర్వ కారణమన్నారు. భవిష్యత్తులో మరింత రాణించి ఉన్నత స్ధానానికి ఎదగాలని ఆకాంక్షించారు. తనకు క్రీడలంటే చాలా మక్కువ అని, ఇటీవల జాతీయ స్ధాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌ను నిర్వహించామన్నారు. రాజమహేంద్రవరంలో 30 ఎకరాల స్ధలంలో క్రీడా స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. గోరంట్ల మాట్లాడుతూ కృషితో నాస్తి దుర్భిక్ష్యం అన్నట్లుగా బాలాజీ కుమారులు ఇద్దరు అంతర్జాతీయస్ధాయికి ఎదగడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం క్రీడలకు, క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఒకప్పుడు క్రికెట్‌పైనే దృష్టి సారించేవారని. ఇపుడు అన్ని క్రీడల వైపు విద్యార్ధులు దృష్టి సారించడం మంచి పరిణామమన్నారు. చరిత్రకు నిలయమైన వీరేశలింగం పురమందిరం అభివృద్ధి విషయంలో అధికారులు తీవ్ర అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు అధ్యక్షత వహించిన గుడా చైర్మన్‌ గన్ని మాట్లాడుతూ టౌన్‌హాలు టీటీ క్రీడకు దేవాలయంగా ఉందని, ఎంతో మందిని క్రీడాకారులుగా తీర్చిదిద్ది జాతీయ,అంతర్జాతీయ స్ధాయికి పంపిన చరిత్ర ఉందన్నారు. టేబుల్‌ టెన్నిస్‌కు కేరాఫ్‌ ఎడ్రస్‌గా ఆచంట కుటుంబం నిలిచిందన్నారు. బాలాజీ తనయులు నవీన్‌, ఉమేష్‌లు కఠోరమైన దీక్షతో, స్వశక్తితో ఉన్నత స్థాయికి ఎదిగారని, వారి తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందన్నారు. పురమందిరానికి ఎదురుగా ఉన్న స్ధలంలో టీటీ క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారని, ఆ స్ధలాన్ని అసోషియేషన్‌కు ఇచ్చేలా కృషి చేయాలని రాజప్పను కోరారు. మేయర్‌ మాట్లాడుతూ క్రీడాకారులు ఉమేష్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. యర్రా వేణు మాట్లాడుతూ ఉమేష్‌ విజయం రాజమహేంద్రవరానికే గర్వకారణమని, టౌన్‌హాలును పునరుద్ధరించాలని కోరారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ పిల్లలు పుట్టినప్పుడు కంటే ఎదిగి ఉన్నత స్ధానంలో నిలిచినప్పుడే తల్లిదండ్రులకు ఆనందం కలుగుతుందన్నారు. నేటి యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రౌతు మాట్లాడుతూ వీరేశలింగం కీర్తిని రెపరెపలాడిస్తున్న ఘనత ఆచంట కుటుంబానికే దక్కుతుందన్నారు. ఆకుల వీర్రాజు మాట్లాడుతూ అంతర్జాతీయ స్ధాయిలో రాజమహేంద్రవరం పేరును నిలబెడుతున్న ఆచంట కుటుంబం అందరికీ ఆదర్శమన్నారు. ఈ సందర్భంగా ఉమేష్‌కుమార్‌ను పలువురు ఘనంగా సత్కరించారు. ఉమేష్‌ తండ్రి ఆచంట బాలాజీ కూడా రాజప్పను సత్కరించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో దొండపాటి సత్యంబాబు, రెడ్డి రాజు, అర్లపల్లి నాగబోస్‌, కురగంటి సతీష్‌, కాశి నవీన్‌కుమార్‌, జగన్నాధం వెంకటరెడ్డి, కార్పొరేటర్లు బెజవాడ రాజ్‌కుమార్‌, కొమ్మ శ్రీనివాస్‌, మాటూరి రంగారావు, కోసూరి చండీప్రియ, పాలిక శ్రీను, తలారి ఉమాదేవి, మజ్జి పద్మ, నాయకులు ఉప్పులూరి జానకిరామయ్య, కొండేటి సుధ, కొత్తూరి బాలనాగేశ్వరరావు, మెట్ల ఏసుపాదం, సుంకర నాగేంద్ర కిషోర్‌, కొత్తపేట రాజా, తలారి భగవాన్‌, మొల్లి చిన్ని యాదవ్‌, నల్లం ఆనందకుమార్‌, కోట కామరాజు, పుట్టా సాయిబాబు, టీటీ కోచ్‌లు వేణుగోపాల్‌, వీటి సుబ్బారావు, అమెరికన్‌ ప్రొగ్రెసివ్‌ తెలుగు అసోషియేషన్‌ ప్రతినిధి ప్రశాంతి, పోస్టల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here