గాడితప్పిన ధర్మం – సంక్షోభంలో న్యాయం (శనివారం నవీనమ్)

0
96

గాడితప్పిన ధర్మం – సంక్షోభంలో న్యాయం
(శనివారం నవీనమ్)

అన్యాయం, అక్రమాలు రాజ్యమేలినప్పుడు, హక్కులు కాలరాయబడినప్పుడు, అధికార మదంతో పౌరుల స్వేచ్ఛను ప్రభుత్వాలు హరించినప్పుడు ‘మీ పక్షాన మేమున్నామంటూ’ కొండంత అండగా నిలవాల్సిన న్యాయవ్యవస్థే ‘ధర్మం దేహీ’ అని న్యాయాన్ని అర్థించాల్సిన దుస్థితిని మనం చూస్తున్నాము.

దేశ పౌరులకు న్యాయం ప్రసాదించాల్సిన న్యాయాధీశులే న్యాయాన్ని అర్థిస్తూ ప్రజల ముందుకు రావడం ఆశ్చర్యకరమే కాదు ఆందోళనకరం కూడా. భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా సుప్రీంకోర్టుకు చెందిన నలుగురు అత్యంత సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గగోరు, జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ శుక్రవారం పాత్రికేయులతో సమావేశం ఏర్పాటు చేయడమే ఒక అసాధారణ పరిణామం. సుప్రీంకోర్టులోవిపరీత పోకడల పట్ల ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు భారత ప్రధానన్యాయమూర్తి వ్యవహరిస్తున్న తీరును ఈ నలుగురు న్యాయమూర్తులు బహిరంగంగానే ప్రశ్నించారు. ఇతర వ్యవస్థలతోబాటు న్యాయవ్యవస్థలో తలెత్తిన ఈ వివాదం మన సామాజిక వ్యవస్థలో రూపుదిద్దుకుంటున్న తీవ్రమైన సంక్షోభానికి ఒక సంకేతం.

యూపీలోని లక్నో కేంద్రంగా నడిచే ప్రసాద్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌కు చెందిన మెడికల్‌ కాలేజీతోపాటు 46 ఇతర మెడికల్‌ కాలేజీల్లో సరైన వసతులు లేవంటూ మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ) అడ్మిషన్లను రద్దుచేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టులో అనుకూలమైన ఆదేశాలు వచ్చేలా చూస్తామంటూ కొందరు భారీ డీల్‌ కుదుర్చుకున్నారు. ఈ డీల్‌ కుదుర్చుకున్నది సాక్షాత్తూ ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి ఇష్రత్‌ మస్రూర్‌ ఖుద్దూసీ, ఆయన అనుచరుడు భావనా పాండే, మరో మధ్యవర్తి విశ్వనాథ్‌ అగ్రావాలాలే అని సీబీఐ తేల్చి వారిని అరెస్టు చేసింది.

ఈ కేసులో మిశ్రా ధర్మాసనం అడ్మిషన్లు జరుపుకోవచ్చని తీర్పు ఇచ్చింది. దీనిపై సుప్పీంకోర్టు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్‌ వేసింది. అడ్మిషన్లు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చిన ధర్మాసనం లోని దీపక్‌ మిశ్రా ఈ పిటీషన్ విచారణలో ఉండరాదని కోరింది. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్వీకరించి వాదనలు విని తుది ఆదేశాలకు సిద్ధమైంది.

అంతలోనే ఈ వ్యవహారాన్ని మరో బెంచ్‌కు అప్పగించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఆదేశాలిచ్చారు. అంతకు ముందురోజే.. జస్టిస్‌ ఇష్రత్‌ పేరుతో ముడుపుల కేసును విచారిస్తున్న రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్‌ చలమేశ్వర్‌ను తప్పిస్తూ ప్రధాన న్యాయమూర్ మిశ్రా ఉత్తర్వులిచ్చారు. పరస్పరం సంబంధమున్న ఈ రెండు కేసుల్లో చీఫ్ జస్టిస్ వ్యవహార శైలిపై సీనియర్‌ న్యాయమూర్తులు లోలోన అభ్యంతరాలు వ్యక్తంచేశారు. చివరికి జాస్తి చలమేశ్వర్‌ సహా నలుగురు జడ్జిలు మీడియా ముందుకొచ్చి ‘గోడు’ వెళ్లబోసుకున్నారు.

న్యాయవ్యవస్థలో ప్రతికూల ప్రభావాలపై ప్రధానన్యాయమూర్తికి లేఖ రాసినా గోడు పట్టించుకోనందునే మరో దారిలేక మీడియా ముందుకొచ్చామని న్యాయమూర్తులే ఘోషిస్తుంటే అంతకన్నా దిగ్భ్రాంతికర అంశం మరొకటి ఏముంటుంది? సర్వోన్నత న్యాయస్థానాదీశులుగా ఉన్న వీరి పరిస్థితే ఇలావుంటే ఇక దేశంలో సామాన్య పౌరుల గోడు పట్టించుకొనే దిక్కేముంటుంది.

గతంలో కూడా మాజీ ప్రధాన న్యాయమూర్తులపై ప్రశాంతభూషణ్‌ వంటి వారు ఆరోపణలు చేసిన ఘటనలున్నాయి. కానీ ఇక్కడ సిట్టింగ్‌ ప్రధాన న్యాయమూర్తిపై ఆయన సహచరులుగా ఉన్న సీనియర్‌ సిట్టింగ్‌ న్యాయమూర్తులు ఆరోపిస్తున్నారు. కాబట్టి వాటిని సాధారణమైనవిగా తోసిపుచ్చడానికి వీల్లేదు, తీవ్రంగా పరిగణించాల్సిందే. నిజానిజాలు నిగ్గుతేల్చాల్సిందే. లేదంటే న్యాయవ్యవస్థ గౌరవానికే మాయని మచ్చగా మిగిలే ప్రమాదం ఉంది. ప్రధాన న్యాయమూర్తి తన అధికారాలను దుర్వినియోగం చేశారనీ,. ప్రత్యేక ఫలితాలను సాధించడానికి ‘రోస్టర్‌ ఆఫ్‌ మాస్టర్‌’ గా తన పవర్‌ను వాడుకున్నారని ప్రజలు భావించేందుకు ఆస్కారం ఉంది.

రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి న్యాయపాలన విధుల నిర్వహణలో పూర్తి అధికారం ఉంటుంది. అదే సమయంలో కేసుల విషయంలో ఇతర న్యాయమూర్తులతో ఆయన సమానుడే. ఈ ఆరోపణల్లో వాస్తవాలను ఎవరు తేల్చాలనేది ఇక్కడ ప్రశ్న. రాజ్యాంగ పరిధిలోని ప్రస్తుత దర్యాప్తు సంస్థలేవీ జడ్జిలపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసే అధికారం కలిగిలేవు. జుడిషీయల్‌ ఎకౌంటబులిటీకి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరం గతంలోనే అనేక సందర్భాల్లో నిపుణులు సూచించారు. ప్రస్తుతం మన రాజ్యాంగ పరిధిలో ఉన్న ఒకే ఒక ప్రత్యామ్నాయం పార్లమెంట్‌ అభిశంసన. 124-4వ అధికరణం సర్వోన్నత న్యాయమూర్తులను పదవినుంచి తొలగించడానికి అవలంబించే ప్రక్రియను నిర్దేశిస్తుంది. 124-4వ అధికరణం ప్రకారం న్యాయమూర్తి అనుచితంగా ప్రవర్తించినట్లు, న్యాయ నిర్వహణ సామర్థ్యం కోల్పోయినట్లు ధ్రువపడినప్పుడు మాత్రమే అభిశంసన వేటు వేయడం సాధారణం. ఈ ప్రయత్నం ఒకటి రెండుసార్లు జరిగినా తగిన ఫలితం రాలేదు. అది పార్లమెంట్‌ ముందుకు రాగానే అక్కడా రాజకీయ నాటకాలు చోటుచేసుకుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవస్థను ప్రక్షాళన చేయకపోతే మొత్తం సమాజానికే చేటు అన్నది విస్పష్టం. న్యాయవ్యవస్థలో సంస్కరణలకు ఇప్పటికైనా పూనుకోవాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. ప్రజలకు న్యాయవ్యవస్థపై విశ్వాసం బలపడేందుకూ, రాజ్యాంగబద్ధంగా జుడిషియల్‌ ఎకౌంటబులిటీని పెంచే జడ్జిల కమిటీనో, కమిషన్‌నో ఏర్పాటుచేయాల్సిన అవసరాన్ని గుర్తించాల్సి ఉంది. న్యాయసమీక్షాధికారమున్న సక్రమమైన, నిష్పాక్షికమైన వ్యవస్థగా అది మనగలగాలి.

ఇది న్యాయవ్యవస్ధ అంతర్గత వ్యవహారం ఇందులో తాను చేసేదేమీ లేదని ప్రధానమంత్రి కార్యాలయమో, న్యాయమంత్రిత్వ శాఖో సాంకేతికంగా చేతులు దులిపేసుకోవచ్చు. రాజకీయ ప్రమేయానికి ఆస్కారం లేకుండా, స్వతంత్రంగా నడవాల్సిన న్యాయవ్యవస్థలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాతనే విపరీతమైన పోకడలు, ధోరణలు పెరిగిపోయాయి. సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టేనాటికే జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై అవినీతి ఆరోపణలు
ఉన్నమాట కూడా యథార్థం. న్యాయకోవిదులు అనేక మంది ఆయన నియామకంపై అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తం చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించిన బిజెపి ప్రభుత్వం న్యాయవ్యవస్థనూ వదల్లేదు. కీలకమైన కేసుల్లో హిందూత్వ శక్తులకు అనుకూలంగా తీర్పులు వచ్చే విధంగా న్యాయస్థానాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని వచ్చిన ఆరోపణలకు నేడు సుప్రీం కోర్టులో జరుగుతున్న పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. దేశాన్ని నియంతృత్వం వైపు నడిపించేవి.

సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి సహచర న్యాయమూర్తుల్లో ప్రథముడే కానీ, ఆయనకంటూ ప్రత్యేకంగా అపరిమిత అధికారాలు లేవని, న్యాయ పరిపాలనలో కేసుల బదలాయింపుల్లో సీనియారిటినీ పక్కన బెట్టి వ్యవహరించారంటూ ఇప్పుడు జస్టిస్‌ దీపక్‌ మిశ్రాను ఈ నలుగురు న్యాయమూర్తులు విమర్శించడం, ఒకటి రెండు కేసులను కూడా వారు బహిరంగంగానే ఉదహరించడం పెద్ద చర్చకు దారితీసేదే. ప్రధానంగా కొలీజియం వ్యవస్థపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉదహరిస్తూ మెజార్టీ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పును వమ్ము చేయడానికి మరో బెంచ్‌ ఏర్పాటు చేయడం న్యాయమూర్తుల నియామకాలపైనే తీవ్ర ప్రభావం చూపిందని న్యాయమూర్తులు ఆందోళన వెలిబుచ్చడం గమనార్హం. వైద్య ప్రవేశాలకు సంబంధించి వీరు ఉదహరించిన మరొక కేసు విషయంలోనూ సంప్రదాయాలకు, మార్గదర్శకాలకు తిలోదకాలు ఇచ్చి ప్రధానన్యాయమూర్తి వ్యవహరించిన తీరు ఆందోళన కల్గించేదే. న్యాయమూర్తులుగా ఉంటూనే ఇలా బహిరంగంగా దేశ ప్రధానన్యాయమూరిని విమర్శించడం సరైనదా కాదా అనే చర్చ పక్కనబెడితే న్యాయవ్యవస్థ గాడితప్పుతున్న విషయాన్ని ఈ పరిణామం గుర్తుచేస్తోంది.

రాజ్యంగం ప్రకారం శాసన, కార్య, న్యాయ నిర్వాహక వ్యవస్థలు సమతుల్యంగా పనిచేయాల్సివుంటుంది. మొదటి రెండు వ్యవస్థలు చట్టవ్యతిరేక నిర్ణయాలు తీసుకొంటే వాటిని న్యాయవ్యవస్థ జోక్యం చేసుకొని రాజ్యాంగ రక్షణకు పూనుకోవాల్సివుంటుంది. దీనికి న్యాయవ్యవస్థ రాజకీయ ప్రభావాలకు లోనుకాకుండా స్వతంత్రతంగా వ్యవహరించడం ముఖ్యమైనది. ప్రస్తుతం న్యాయవ్యవస్థలో ఈ స్వతంత్రత కొరవడుతోందని నలుగురు సుప్రీం కోర్టు నాయమూర్తులు వెల్లడించిన అంశాలు తెలియజేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here