స్పందన చూసే జన్మభూమిపై అర్ధరహిత విమర్శలు

0
57

ఒకే ఇంటిలో అర్హులెందరు ఉన్నా ఫించన్లు ఇవ్వబోతున్నాం

ప్రతిపక్షాలు తీరు మార్చుకోవాలి : ఎమ్మెల్సీ ఆదిరెడ్డి

రాజమహేంద్రవరం, జనవరి 13 : రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జన్మభూమి-మా వూరు కార్యక్రమానికి వచ్చిన స్పందన చూసి ప్రతిపక్షాలకు భయం పుట్టిందని, దీంతో అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను తాము వినడం వలనే వారు పెద్ద ఎత్తున సభలకు తరలి వచ్చారని అన్నారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన రౌతు సూర్యప్రకాశరావు అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఆయన హయాంలో కూడా రోజూ పది డివిజన్లలో ప్రజాపథం కార్యక్రమాలను నిర్వహించ లేదా? అని ప్రశ్నించారు. జన్మభూమి సభల్లో సంక్షేమ పథకాలను వివరించామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలను చేరువ చేస్తున్నామన్నారు. ఇంటిలో అర్హత కలిగిన వారు ఎంతమంది ఉన్నా వారికి ఫించన్లు అందించాలని సీఎం చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఉగాది నాటికి అర్హులైన వారికి ఫించన్లు అందిస్తామని, గృహాల నిర్మాణం త్వరలో చేపడతామన్నారు. బిసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు వివాహం చేసుకుంటే వారికి ప్రభుత్వం పారితోషికం అందిస్తుందన్నారు. ఏ పథకం మంజూరు చేసినా దానిలో అవకతవకలు లేకుండా ఆధార్‌ అనుసంధానం చేస్తున్నామన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేసి వారి ఆర్థికాభివృద్ధికి అండగా నిలిచామని, ఇటీవలే సుబ్రహ్మణ్య మైదానంలో నిర్వహించిన గ్రౌండింగ్‌ మేళా అందుకు నిదర్శనమన్నారు. మ్యానిపెస్టోలో లేని అంశాలను కూడా అమలు చేస్తూ ఆర్థికలోటు ఉన్నా అభివృద్ధి, సంక్షేమ విషయంలో వెనుకడుగు వేయకుండా పాలిస్తున్న చంద్రబాబుకు సహకరించవలసిన ప్రతిపక్షం విమర్శించడం హాస్యాస్పదమన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్‌ ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎందుకు ముందడుగు వేయలేకపోయారని ప్రశ్నించారు. 2004కు ముందు చేతివృత్తుల వారి కోసం నాడు కూడా సీఎంగా ఉన్న చంద్రబాబు ఆదరణ పథకం కింద పరికరాలు అందించారని, దానిని ఎందుకు కొనసాగించలేదని ప్రశ్నించారు.విద్యుత్‌ కోతలతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని మిగులు విద్యుత్‌ ఉండేలా చంద్రబాబు తీర్చిదిద్దారని, రాష్ట్ర అభివృద్ధికి ఏ పని చేసినా ప్రతిపక్షం ఆటంకం కల్పిస్తోందన్నారు. సమస్యలను పరిష్కరించుకునే అసెంబ్లీని బహిష్కరించిన వైకాపా నేతలకు ప్రశ్నించిన అధికారమే లేదన్నారు. విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు తంగెళ్ళ బాబి, ద్వారా పార్వతి సుందరి, కడలి రామకృష్ణ, పార్టీ నాయకులు మానే దొరబాబు, బూరాడ భవానీ శంకర్‌, కడితి జోగారావు, పితాని కుటుంబరావు, జాగు వెంకటరమణ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here