కేంద్ర రాష్ట్రాల ఇం’ధనం’ దోపిడి (శనివారం నవీనమ్)

0
52

కేంద్ర రాష్ట్రాల ఇం’ధనం’ దోపిడి
(శనివారం నవీనమ్)

పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. చాపకింద నీరులా వినియోగదారుల జేబుకు చిల్లిపెడుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై నియంత్రణ ఎత్తివేసి.. రోజువారిగా మార్చు విధానం అమలు చేసినప్పటి నుండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పైసల్లో తగ్గుతూ.. రూపాయల్లో పెరుగుతూ.. వినియోగ దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గిన సమయంలో కూడా … దేశీయంగా పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్లుగా పన్నులు వేస్తూ పోవడంతో ధరలు అమాతం పెరిగిపోతున్నాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణం. డీజిల్‌ ధర అయితే దేశంలోనే అత్యధికంగా ఉండడం గమనార్హం.

చమురు సంస్థలు గతంలో ప్రతి 15 రోజులకోసారి పెట్రోల్, డీజిల్‌ల ధరలను సవరించేవి. అలా చేసినప్పుడు ఒక్కోసారి రెండు మూడు రూపాయల వరకు పెంపు ఉండేది. దాంతో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యేది. దీంతో ప్రభుత్వం గతేడాది జూన్‌ 16 నుంచి రోజువారీ ధరల సవరణ విధానాన్ని తెరపైకి తెచ్చింది. నామమాత్రంగా తొలి 15 రోజుల పాటు ధరలు తగ్గించగా… ఆ తర్వాతి నుంచి మెల్లమెల్లగా మోత మొదలైంది.

హైదరాబాద్‌లో గతేడాది జూలై 16న రూ.67.11గా ఉన్న లీటర్‌ పెట్రోల్‌ ధర ప్రస్తుతం రూ.75.47కు.. డీజిల్‌ ధర రూ.60.67 నుంచి రూ.67.23కు చేరింది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.76.92కు, డీజిల్‌ ధర రూ.68.79కు చేరాయి.

రెండేళ్ల క్రితం క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా తగ్గినప్పడు.. ధరలను తగ్గించకుండా ప్రభుత్వాలు సొమ్ముచేసుకున్నాయి. గతేడాది నుండి రోజువారీ ధరల సవరణ విధానాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుండి పది పన్నెండు పైసలు పెంచడం, నాలుగైదు పైసలు తగ్గించడం చేస్తూ.. మొత్తంగా పెట్రోల్, డీజిల్‌ల ధరలు బాగా పెంచేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీ కింద ఒక్కో లీటర్‌ పెట్రోల్‌పై ఇరవై ఒక్క రూపాయల నలభై ఎనిమిదిపైసలు.. డీజిల్‌పై పదిహేడు రూపాయల ముప్పైమూడు పైసలు వసూలు చేస్తోంది. ఈ పన్ను తర్వాతి మొత్తం ధరపై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ పన్ను మోత మోగిస్తున్నాయి. మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కలిపి పెట్రోల్‌పై 57 శాతం, డీజిల్‌పై 44 శాతం భారమయ్యాయి.

పెట్రోల్‌ ఉత్పత్తుల అమ్మకాలపై వ్యాట్, అదనపు సుంకాల విధింపులో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాయి. మహారాష్ట్ర పెట్రోల్‌పై 26 శాతం వ్యాట్‌తో పాటు ప్రతి లీటర్‌పై రూ.9 చొప్పున అదనపు సుంకం వసూలు చేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్‌కు తోడు ప్రతి లీటర్‌పై రూ.4 అదనపు సుంకం వసూలు చేస్తున్నారు. దీంతో పన్ను 38.82 శాతానికి చేరింది. డీజిల్‌పై 22.25 శాతం పన్ను, ప్రతి లీటర్‌పై రూ.4 సుంకంతో పన్నుశాతం 30.71కి చేరింది. తెలంగాణలో పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌పై 27 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. ఢిల్లీలో పెట్రోల్‌పై పన్ను 27 శాతం ఉండగా.. గోవాలో అతి తక్కువగా 17 శాతం మాత్రమే ఉన్నాయి.

అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు.. చమురు ఉత్పత్తి దేశాలు క్రూడాయిల్‌ ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయం తీసుకోవడం నేపథ్యంలో.. ధరలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఇండియన్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర రూ.4,085గా ఉంది. ప్రస్తుతమున్న ధరల్లో దాదాపు సగం మాత్రమే అసలు ధరలుగా ఉండగా.. మిగతాదంతా పన్నుల భారమే.

దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చినా.. పెట్రోలియం ఉత్పత్తులను మాత్రం అందులో చేర్చలేదు. పెట్రోల్‌ ఉత్పత్తులతో భారీగా ఆదాయం వస్తుండడంతో జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. అదే జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకువస్తే ద్వంద్వ పన్నుల భారం తగ్గి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here