2న రాష్ట్ర బీసీ విద్యార్ధి గర్జన

0
56

రాజమహేంద్రవరం, జనవరి 20 : వచ్చేనెల 2వ తేదీన రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్‌ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యాన రాష్ట్ర బీసీ విద్యార్ధి గర్జన నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉభయగోదావరి జిల్లాల ఇన్‌ఛార్జి గంగుల సూర్యారావు వెల్లడించారు. స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గంగుల మాట్లాడుతూ బీసీ విద్యార్ధుల పక్షాన తాము అలుపెరుగని పోరాటం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో విద్యార్ధి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించే దిశగా విద్యార్ధి గర్జన చేపడుతున్నామన్నారు. రాష్ట్ర బీసీ విద్యార్ధి గర్జనకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌ కృష్ణయ్య హాజరవుతారని తెలిపారు. కాలేజి హాస్టల్‌ విద్యార్ధుల మెస్‌ ఛార్జీలను నెలకు రూ.2వేలకు పెంచాలని, ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్ధలలో బీసీ పేద విద్యార్ధులకు 25శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలని, బీసీ విద్యార్ధుల ఫీజుల మొత్తం ప్రభుత్వమే చెల్లించాలని, పాఠశాల హాస్టల్‌, రెసిడెన్షియల్‌ విద్యార్ధులకు 3నుండి 7 తరగతులు వారికి రూ. 1200లకు, 8నుండి 10 తరగతుల వారికి రూ. 1500లకు మెస్‌ఛార్జీలు పెంచాలని, కాస్మోటిక్‌ ఛార్జీలను బాలురకు రూ.200లకు, బాలికలకు రూ.300లకు పెంచాలని, కాలేజి హాస్టల్‌ విద్యార్ధులకు బస్‌పాస్‌, ఇతర చిల్లర ఖర్చులకు రూ.600లు పాకెట్‌ మనీ మంజూరు చేయాలని, హాస్టల్‌ విద్యార్ధులకు ప్రతి ఆదివారం, పండుగ దినాలలో ప్రత్యేక మెనూలో మటన్‌ లేదా చికెన్‌ పెట్టాలని, ఇంజనీరింగ్‌, ఎంబిఎ, ఎంసిఎ విద్యార్ధులు ఉన్న హాస్టల్స్‌లో విద్యార్ధుల సంఖ్యను బట్టి 4 కంప్యూటర్‌లు మంజూరు చేయాలని, హాస్టల్‌ విద్యార్ధులకు స్టడీ సర్కిల్స్‌ ద్వారా గ్రూప్‌ 1,2,4,గేట్‌, బ్యాంకింగ్‌, డిఎస్సీ, పోలీస్‌, ఇతర ఉద్యోగాలకు శిక్షణ అందించాలని డిమాండ్‌ చేసారు. ఈ డిమాండ్‌ల సాధనకు బీసీ సంక్షేమ సంఘంగా పోరాడతామన్నారు.

జిల్లా బీసీ విద్యార్ధి అధ్యక్షునిగా సుభాష్‌
జిల్లా బీసీ విద్యార్ధి సంక్షేమ సంఘం అధ్యక్షునిగా గున్నేపల్లి సుభాష్‌ను నియమించినట్లు గంగుల వెల్లడించారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా బురుగ రాజ్‌కుమార్‌ను నియమించారు. ఈ మేరకు వారికి నియామక పత్రాలను అందజేసారు. విలేకరుల సమావేశంలో రాపర్తి నాగలక్ష్మి, సోమిరెడ్డి దేవి, యర్రా శ్యామలరావు, కొప్పోజు తమ్మాజీ, ఆర్‌వివి సత్యనారాయణ, అనుపోజు చిరంజీవి, ఎ రమణ, కె నాగమణిలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here