10 రోజుల్లో పరిష్కరించకపోతే ఆమరణదీక్ష

0
145

అధికారులకు హారిక హెచ్చరిక

రాజమహేంద్రవరం, జనవరి 23 : ఇందిరాసత్యనగర్‌పుంత వాసుల సమస్యను 10 రోజుల్లో పరిష్కరించకపోతే ఆమరణదీక్ష చేపడతామని బిసి సంక్షేమ సంఘం మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి కొల్లివెలసి హారిక హెచ్చరించారు. కుమారమ్మతో కలిసి తాను కార్పొరేషన్‌ కార్యాలయం ముందు ఆమరణ దీక్షకు దిగునున్నట్లు తెలిపారు. స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు అఖిలపక్ష పార్టీలకు చెందిన కాంగ్రెస్‌ నగర అధ్యక్షులు ఎన్‌వి శ్రీనివాస్‌, ఆర్‌పిసి వ్యవస్ధాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్‌, మాలమహానాడు నగర అధ్యక్షులు తాడేపల్లి విజయ్‌లతో కలసి హారిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇందిరాసత్యనగర్‌ పుంత వాసులకు అనుకూలంగా కోర్టు స్టేటస్‌కో ఉందన్నారు. అయితే అధికారులు, ప్రజా ప్రతినిధులు స్టేటస్‌కో ఏమీ లేదు, జాలి తలచి ఇళ్ళు పడగొట్టకుండా వదిలేస్తున్నామంటూ అబద్ధ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లోకాయుక్త తీర్పు, 2007లో కౌన్సిల్‌లో చేసిన తీర్మానంతో పాటు రాష్ట్రప్రభుత్వం 2015లో ఇచ్చిన జీవో ఎంఎస్‌ 296లను సైతం అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకుండా పేదవారి గూడును తొలగించడానికి ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. గత 45 రోజులుగా రిలేదీక్షలు చేపట్టడంతో పాటుగా, అనేక విధాలుగా నిరసనలు తెలియజేసినప్పటికి స్పందించకపోవడం దారుణమన్నారు. రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరిని కలుసుకుని సమస్యను వివరించామని, ఆయన సమస్యపై సానుకూలంగా స్పందించారన్నారు. 83 అడుగుల రోడ్డును కొలతులు వేయించి, దాన్ని 40 అడుగులుకు కుదించి మిగిలిన 43 అడుగుల్లో ఇందిరాసత్యనగర్‌ పుంతవాసులకు ఇళ్ళ స్ధలాలుగా ఇవ్వడంతో పాటు ప్రభుత్వమే సొమ్ములు వెచ్చించి వారికి పక్కా ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని, కూలగొట్టిన ఇళ్ళకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేసారు. సమస్య పరిష్కారానికి 10 రోజులపాటు వేచిచూస్తామని, అప్పటికీ పరిష్కరించకుండా నిరాహారదీక్ష చేపడతామన్నారు. పుంతవాసుల సమస్య పరిష్కారానికి ప్రాణత్యాగానికైనా తాను సిద్ధమన్నారు. తమ ఉద్యమానికి సహకరిస్తున్న అఖలపక్ష పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసారు. నేటి నుండి రిలేనిరాహార దీక్షలకు స్వస్తి పలుకుతున్నామని చెప్పారు. ఆర్‌పిసి నాయకులు మేడా శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇందిరాసత్యనగర్‌ పుంత వాసులకు అనుకూలంగా కోర్టు స్టేటస్‌కో ఇచ్చిందన్నారు. స్టేటస్‌కో ఫిబ్రవరి 1వరకు కొనసాగుతుందని, తదుపరి కోర్టు దీన్ని పొడిగించే అవకాశం కూడా ఉందన్నారు. ఎన్‌వి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇందిరాసత్యనగర్‌ వాసుల సమస్య పరిష్కారం అయ్యేవరకు వారి ఉద్యమానికి అండగా ఉంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిని 296/20015 జీవో ప్రకారం అక్కడ 100 అడుగులు లోపు స్ధలాలను ఆక్రమించుకున్నవారికి ఆ స్ధలాలను క్రమబద్దీకరించాలని డిమాండ్‌ చేసారు. ఎవరికోసం ఆరోడ్డును విస్తరించాలని ప్రయతిస్తున్నారని ప్రశ్నించారు. మాలమహానాడు నగర అధ్యక్షులు తాడేపల్లి విజయ్‌ మాట్లాడుతూ ఇందిరాసత్యనగర్‌ పుంత వాసుల పోరాటానికి నగర మాలమహానాడు అండగా ఉంటుందన్నారు. విలేకరుల సమావేశంలో ఇందిరాసత్యనగర పుంత వాసులు, వివిధ ప్రజాసంఘాల వారు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here