ఈ గౌరవం… చిరకాలం పదిలం

0
74

నన్నయ గీతావిష్కరణలో సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌

ఘనంగా సత్యమూర్తి యోగ విజ్ఞాన కేంద్రం ప్రారంభం

రాజమహేంద్రవరం, జనవరి 25 : ప్రతిష్టాత్మకమైన నన్నయ విశ్వవిద్యాలయంపై రూపొందించిన గీతాన్ని ఆవిష్కరించడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవీ శ్రీప్రసాద్‌ అన్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంపై ప్రముఖ పాటల రచయిత వెనిగల్ల రాంబాబు రచించి, గాన గంధర్వ, పద్మవిభూషణ్‌ ఎస్‌పి బాలసుబ్రహణ్యం ఆలపించిన గీతం సీడిని దేవిశ్రీ ప్రసాద్‌, నన్నయ ఉప కులపతి డాక్టర్‌ ముర్రు ముత్యాలనాయుడు, గీత రచయిత వెనిగళ్ళ రాంబాబులు ఆవిష్కరించారు. ముందుగా నన్నయ విగ్రహానికి పూలమాలువేసి నివాళులర్పించారు. అనంతరం దేవీశ్రీప్రసాద్‌ మాతృమూర్తి, ప్రముఖ రచయిత దివంగత సత్యమూర్తి సతీమణి శిరోమణి సత్యమూర్తి, ఇతర అతిధులు జ్యోతిప్రజ్వలన చేసారు. ప్రముఖ రచయిత గోర్తి సత్యమూర్తి పేరిటి నన్నయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన యోగ విజ్ఞాన కేంద్రాన్ని శిరోమణి సత్యమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా అకడమిక్‌ ఆఫైర్స్‌ డీన్‌ ఎస్‌.టేకి అధ్యక్షతన జరిగిన సభలో దేవిశ్రీప్రసాద్‌ ముఖ్య అతిధిగా మాట్లాడుతూ జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండాలని విద్యార్ధులకు సూచించారు. జీవితంలో సంతోషంగా లేనపుడు ఏమి చేసిన సరే అది వ్యర్ధమేనన్నారు. ఎప్పుడూ సంతోషంగా ఉండే వారు అందరికీ కూడా నచ్చుతారన్నారు. ఎదుటివారిని గౌరవించినపుడు, ఎదుటవారు మనల్ని గౌరవిస్తారన్నారు. అద్భుతమైన రచయిత వెనిగళ్ళ రాంబాబు రచించిన, లెజండరీ గాయకుడు బాలసుబ్రహ్యణ్యం ఆలపించిన గీతాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తన తండ్రి సత్యమూర్తి పేరిట ఇక్కడ యోగ జ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించడం పట్ల ధన్యవాదాలు తెలియజేసారు. యోగ సాధన ఆరోగ్యానికి చాలా మంచిదన్నారు. యోగాభ్యాసన అనేది శరీరానికే కాకుండా మెదడుకు కూడా చాలా మంచిదన్నారు. నన్నయ వీసీ ముర్రు ముత్యాలనాయుడు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం గీతావిష్కరణకు దేవీ శ్రీప్రసాద్‌ను గొప్ప సంగీత దర్శకుడని మాత్రమే పిలవలేదని, తల్లిదండ్రులు పట్ల ఆయనకు ఉన్న గౌరవభావాలను పరిగణనలోకి తీసుకునే ఇక్కడకు పిలిచామన్నారు. మాతృత్రయం అంటే మాతృమూర్తి, మాతృభాష, మాతృభూమిలకు ప్రత్యామ్నాయం లేదన్నారు. మాతృత్రయంను గౌరవించే వారు ఉన్నతంగా ఎదుగుతారన్నారు. సన్నాఫ్‌ సత్యమూర్తి, నాన్నకు ప్రేమతో.. అంటే సినిమాయే కాదని, ఇది నిజమని.. అది దేవీశ్రీప్రసాదేనని అన్నారు. దేవీశ్రీప్రసాద్‌ గొప్ప సంగీత దర్శకుడే కాదని, గొప్ప పాటల రచయిత కూడా అని చెబుతూ ఆయన రాసిన కొన్ని పాటలను గుర్తుచేసారు. పాటల రచయిత వెనికళ్ళ రాంబాబు గొప్ప రచయిత అని, ఆయన ఏ పాటపడితే ఆ పాట రాయడని, మనసుకు నచ్చిన పాటలే రాస్తారన్నారు. అటువంటి రచయిత నన్నయ్య గీతం రాయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తారు. పాట పాడాలని ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం వద్దకు వెళ్ళినపుడు తాను ఇప్పుడు ఇటువంటి పాటలే పాడాలని చెబుతూ అంగీకరించారని గుర్తుచేసుకున్నారు. గాయకుడు డిఎస్పీ సోదరుడు సాగర్‌ మాట్లాడుతూ మనిషి ఎదగాలని అనుకోవాలే గానీ, ఇంతవరకే ఎదగాలనుకోకూడదని సత్యమూర్తి రాసిన వ్యాఖ్యాలను ఉటంకించారు. గేయ రచయిత రాంబాబు మాట్లాడుతూ నన్నయ విశ్వవిద్యాలయంపై గీతాన్ని రాసేందుకు అవకాశం దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేసారు. సత్యమూర్తిపై ఆయన రాసిన కవితను చదివి విన్పించారు. ఈ కార్యక్రమంలో సత్యమూర్తి కుమార్తె పద్మని ప్రియదర్శిని, మనుమడు సత్య, రిజిస్ట్రార్‌ టి అశోక్‌, ఐటి డీన్‌ పి సురేష్‌వర్మ, ప్రిన్సిపాల్‌ ఎస్‌ రమేష్‌, వివిధ విభాగాల అధిపతులు వై శ్రీనివాస్‌, ఎ మట్టారెడ్డి, పర్సిస్‌, హైమావతి, సుబ్బారావు, వెంకటేశ్వరరావు, విజయనిర్మల, సువర్ణరాజు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు టి వాసు, టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవీ శ్రీప్రసాద్‌, సాగర్‌లు సినిమా పాటల బిట్‌లను పాడి నన్నయ విశ్వవిద్యాలయం విద్యార్ధులను ఉర్రూతలూగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here