వేధింపులు ఆపకపోతే ఉద్యమానికి సై

0
61

మార్చి 11న ఉభయగోదావరి జిల్లాల వర్తకుల సదస్సు

అధికారుల తీరుపై గర్జించిన చాంబర్‌ ప్రతినిధులు

రాజమహేంద్రవరం, జనవరి 31 : ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎస్టీ, ఈ వేబిల్లు పేరుతో వాణిజ్య పన్నుల శాఖాధికారులు వర్తకులను వేధించడంతోపాటు దొంగల్లా భావిస్తున్నారని, ఇకపై చూస్తూ ఊరుకోబోమని వర్తక ప్రతినిధులు హెచ్చరించారు. అధికారుల వేధింపులను నిరసిస్తూ మార్చి 11వ తేదీన గోదావరి గట్టున ఉన్న చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ట్రస్ట్‌ కమ్యూనిటీ హాలులో ఉభయగోదావరి జిల్లాల వర్తకుల సదస్సును నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఫెడరేషన్‌ ఆఫ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ చైర్మన్‌ నందెపు శ్రీనివాస్‌, రాజమహేంద్రవరం చాంబర్‌ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, కాకినాడ చాంబర్‌ అధ్యక్షులు డేగల రమేష్‌, అమలాపురం చాంబర్‌ అధ్యక్షులు కల్వకొలను తాతాజీ, కోనసీమ ఫెడరేషన్‌ అధ్యక్షులు సలాది నాగేశ్వరరావు, తుని చాంబర్‌ అధ్యక్షులు తటవర్తి రాజా, రాష్ట్ర ఫెడరేషన్‌ కార్యవర్గ సభ్యులు బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు మాట్లాడారు. యూపిఏ హయాంలో ఎఫ్‌డిఐలను 50 శాతం ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ప్రతిపక్షం బీజెపి గగ్గోలు పెడితే అది వాస్తవమైన వ్యతిరేకంగా తాము భావించామని, అయితే అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం దానిని వంద శాతానికి పెంచిన తరువాత వారి గగ్గోలు దేనికో ఇప్పుడు అర్థమయ్యిందని ఎద్దేవా చేశారు. ఎఫ్‌డిఐల రాకతో దేశంలో 2 కోట్లమంది చిరు వ్యాపారులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం మల్టీనేషనల్‌ కంపెనీలకు కొమ్ము కాస్తోందన్నారు. జిఎస్టీ రాకతో వర్తకులపై వేధింపులు ఎక్కువయ్యాయని, టార్గెట్ల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఆపరేషన్‌ డెకాయిట్‌ పేరుతో వర్తకులపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వర్తకుల చెల్లించే పన్నులతో ప్రభుత్వాన్ని నడుపుతూ వర్తకులను దొంగల్లా భావించడం సరికాదని, వెంటనే ఆ పేరు తొలగించాలని డిమాండ్‌ చేశారు. పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నా ప్రభుత్వం ఎందుకు వేధిస్తుందో అర్థం కావడం లేదన్నారు. నోట్ల రద్దు, జిఎస్టీ, ఈ వేబిల్లు చట్టాలపై వర్తకులను ఏమాత్రం చైతన్యపరిచారని ప్రశ్నించారు. జిఎస్టీపై అధికారులకే 50 శాతం కూడా అవగాహన కాలేదని, అలాంటప్పుడు వర్తకులపై జిఎస్టీ పేరుతో వేధించడం సరికాదన్నారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారుల తీరు పోలీసులను మించిపోయిందని, ఇటీవల పోలీసులే మైత్రి పేరుతో ప్రజలకు చేరువవుతున్నారన్నారు. వర్తకులను వేధిస్తున్న ఈ ప్రభుత్వానికి త్వరలో గుణపాఠం చెబుతామని, 2019 ఎన్నికల్లో వాణిజ్య వర్గాల తరపున పెద్ద ఎత్తున ప్రచారం చేసి బుద్ధి చెబుతామన్నారు. వర్తక ఫెడరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ అశోక్‌కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ దేశానికి, రాష్ట్రానికి పట్టిన గ్రహణం ఈ ఏడాది చివరిలో తొలగిపోతుందని, అవగాహన లేని వ్యక్తి దేశానికి ప్రధాని అయితే దేశంలో అస్థిరత ఏర్పడుతుందన్నారు. బహుళ జాతి కంపెనీలకు, వరల్డ్‌ బ్యాంక్‌కు, అమెరికా దేశానికి మోడీ తొత్తుగా వ్యవహరిస్తున్నారని, ఆయన నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోయిందన్నారు. రాష్ట్రంలో పరిపాలిస్తున్న తండ్రీకొడుకులు వసూళ్ళపై తప్ప సమస్యలపై దృష్టిసారించడంలేదని, రాష్ట్రం ముద్దాయిలచే పరిపాలించబడుతోందని విమర్శించారు. ఈ సమావేశంలో రావులపాలెం చాంబర్‌ అధ్యక్షులు కె.సుబ్బారెడ్డి, ముమ్మిడివరం చాంబర్‌ అధ్యక్షులు యర్రంశెట్టి వెంకటేశ్వరరావు, చాంబర్‌ గౌరవ కార్యదర్శి గ్రంథి పిచ్చియ్య, కొత్తపేట చాంబర్‌ కార్యదర్శి తోట శివప్రసాద్‌, చాంబర్‌ ప్రతినిధులు కోసూరి సుబ్బరాజు, షేక్‌ చాన్‌ భాషా, కొత్త బాల మురళీకృష్ణ, గ్రంథి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here