పెద్దాయన ఇక లేరు

0
169

స్టాండింగ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ముప్పన వెంకట నారాయణ చౌదరి కన్నుమూత

భౌతికకాయానికి పలువురు నివాళి : గోరంట్ల, గన్ని, రౌతు తదితరుల సంతాపం

రాజమహేంద్రవరం, జనవరి 31 : నగర పాలక సంస్థ తొలి స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు ముప్పన వెంకట నారాయణ చౌదరి కన్నుమూశారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. వృద్ధాప్యంతో కూడిన అనారోగ్య సమస్యలతో గత కొంత కాలంగా ఇంటి పట్టునే ఉంటున్న వెంకట నారాయణ చౌదరి గత రాత్రి సాయి దుర్గా నగర్‌ ఒకటవ వీధిలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో ఒక కుమారుడు ప్రభాకరరావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒకటవ డివిజన్‌ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కొనసాగుతూ 2002లో నగర పాలక సంస్థ ఎన్నికల్లో అప్పటి 25 వ డివిజన్‌ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన వెంకట నారాయణ చౌదరి ఆ తర్వాత స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. నగర పాలక సంస్థగా ఆవిర్భవించాక తొలిసారి జరిగిన ఆ ఎన్నికల్లో విజయం సాధించడమే గాక కీలకమైన స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవిని చేపట్టిన తొలి వ్యక్తిగా నిలిచారు. సౌమ్యునిగా, వివాద రహితునిగా, మితభాషిగా పేరొందిన వెంకట నారాయణ పెద్దవాళ్ళలో పెద్దవానిగా, యువకుల్లో యువకునిగా కలిసి పోయేవారు. ఆప్యాయంగా పలుకరిస్తూ అందరితో కలివిడిగా ఉంటూ ముప్పన కష్టించి పనిచేసే విషయంలో అందరికీ ఆదర్శంగా ఉండేవారు. డివిజన్‌ అభివృద్ధే ధ్యేయంగా పనిచేసి ఆయన ప్రాతినిధ్యం వహించిన శివారు ప్రాంతాల అభివృద్ధికి ఆయన కృషి చేశారు. ఆయన భౌతికకాయానికి పలువురు నివాళులర్పించి వారి కుటుంబానికి తమ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయానికి కోటిలింగాలపేట రోటరీ కైలాసభూమిలో అంత్యక్రియలు జరిగాయి. ఆయన భౌతికకాయాన్ని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు,కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, కిలపర్తి శ్రీనివాస్‌, కోసూరి చండీప్రియ,మాజీ కార్పొరేటర్లు బట్లంకి ప్రకాష్‌, మంచాల బాబ్జీ, జవ్వాది మురళీకృష్ణ, గోపిరెడ్డి ఫకీర్‌, పరిమి వాసు, మాజీ సర్పంచ్‌ బొప్పన నాగేశ్వరరావు, కంటిపూడి శ్రీనివాస్‌, షేక్‌ సుభాన్‌, యేలూరి వెంకటేశ్వరరావు, శ్రీధర్‌ రెడ్డి, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్‌, కరుటూరి రాము, అబ్దుల్‌ ఫహీమ్‌, పోలుపల్లి రాజేశ్వరరరావు, ఆనెం చిన్న తదితరులు సందర్శించి నివాళులర్పించారు.

ముప్పన వెంకట నారాయణ మృతికి గన్ని సంతాపం

నగర పాలక సంస్థ స్టాండింగ్‌ కమిటీ మాజీ చైర్మన్‌, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు ముప్పన వెంకట నారాయణచౌదరి మృతి పట్ల గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) చైర్మన్‌ గన్ని కృష్ణ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సౌమ్యుడు, వివాదరహితుడైన వెంకట నారాయణ మరణం పార్టీకి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. కార్పొరేటర్‌గా ప్రాతినిధ్యం వహించిన డివిజన్‌ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని, రాజకీయాల్లో ఎంతో హుందాగా మెలిగి స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవికి ఆయన వన్నె తెచ్చారని, పార్టీకి, తమకు పెద్ద దిక్కుగా ఉండేవారని, తాను గుడా చైర్మన్‌గా నియమితులయ్యాక తొలిగా ఆయన ఆశీర్వాదమే తీసుకున్నానని పేర్కొన్నారు. వెంకట నారాయణ కుటుంబానికి గన్ని తన సానుభూతి తెలియజేశారు.

గోరంట్ల బుచ్చయ్యచౌదరి సంతాపం

తెలుగుదేశం పార్టీ సీినియర్‌ నాయకులు, మాజీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ ముప్పన వెంకట నారాయణ చౌదరి మ తిపట్ల రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ అభ్యున్నతికి ఆయన ఎంతో అంకిత భావంతో పనిచేశారని, ఆయన కుటుంబంతో తనకు ఎంతో అనుబంధం ఉందని, నిబద్ధత, అంకితభావంతో పని చేసే ఇలాంటి వ్యక్తి దూరం కావడం ఎంతో బాధాకరమన్నారు. ముప్పన కుటుంబానికినాయన ప్రగాడ సానుభూతి తెలియజేశారు.

రౌతు సూర్యప్రకాశరావు సంతాపం

ముప్పన వెంకటనారాయణ మృతికి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వెంకట నారాయణ ఇంటికి వెళ్ళి ఆయన భౌతికకాయానికి రౌతు నివాళులర్పించారు. ఆయన కుమారుడైన తొమ్మిదవ డివిజన్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి ముప్పన ప్రభాకరరావుకు రౌతు తన సానుభూతి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here