సీపీఐ నగర కార్యదర్శిగా మళ్ళీ నల్లా ఎన్నిక

0
41

సహాయ కార్యదర్సులుగా తోకల, కొండలరావు

రాజమహేంద్రవరం,ఫిిబ్రవరి 2 : భారత కమ్యూనిష్టు పార్టీ (సీపీఐ) నగర కార్యదర్శిగా పార్టీ సీనియర్‌ నాయకులు నల్లా రామారావు తిరిగి ఎన్నికయ్యారు. సహాయకార్యదర్శులుగా ఏఐటీయుసీ జిల్లా నేత తోకల ప్రసాద్‌, జట్లు లేబర్‌ యూనియన్‌ అధ్యక్షులు వంగమూడి కొండలరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో 29వ నగర మహాసభలో వీరితోపాటు మరో 13మంది కార్యవర్గసభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యదర్శి పలు తీర్మానాలను ప్రవేశపెట్టగా సమితి ఏకగ్రీవంగా ఆమోదించింది. నూతన కార్యదర్శి నల్లా రామారావు మాట్లాడుతూ నగరంలో 50వార్డుల్లోనూ చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని, వీటిపై సర్వే నిర్వహించి పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తామన్నారు. అదేవిధంగా సీపీఐ జిల్లా మహాసభలు సందర్భంగా 16వ తేదినాడు రాజమహేంద్రవరంలో జరిగే ప్రజా ప్రదర్శనకు పెద్దఎత్తున అన్నివర్గాల ప్రజలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. సహాయకార్యదర్శి వంగమూడి కొండలరావు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా దానిని పాలకులు అమలు చెయ్యడం లేదని, దీనిపై అన్ని కార్మికవర్గాలను కలుపుకుని భవిష్యత్తుల్లో ఉద్యమం నిర్వహిస్తామన్నారు. మరో సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్‌ మాట్లాడుతూ చారిత్రక నగరమైన రాజమహేంద్రవరం ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని వీటిపై జిల్లా మహాసభలో భవిష్యత్తు కార్యచరణ చర్చించి కార్యక్రమం రూపొందిస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here