సమయం లేదు మిత్రమా! (శనివారం నవీనమ్)

0
83

సమయం లేదు మిత్రమా! (శనివారం నవీనమ్)

ఇతర రాష్ట్రాల్లో మెట్రో సహా వేర్వేరు ప్రాజెక్టులకు విరివిగా నిధులను కేటాయించిన కేంద్రం ఆంధ్రప్రదేశ్ విషయంలో తీరని అన్యాయం జరిగిన విషయాన్ని పలువురు మంత్రులు శుక్రవారం నాటి కేబినెట్ సమావేశంలో ప్రస్తావించగా “దీనిపై త్వరలోనే రాజకీయ నిర్ణయం తీసుకుందాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారని తెలిసింది.

శరణమో రణమో తేల్చిచెప్పడానికి చంద్రబాబు మీద సమయం విరుచుకుపడుతున్న వాతావరణం విస్తరిస్తున్నది.

ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ, రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిలదీయకుండా మూడున్నరేళ్లుగా ఎన్డీయే కూటమిలో కొనసాగుతూ వచ్చింది. అధికారపార్టీలో అగ్రహాన్ని చల్లార్చే బాధ్యతను ముఖ్యమంత్రే భుజన వేసుకుంటూ వచ్చారు. రాష్ట్ర ప్రజలన్నా, ఆంధ్రప్రదేశ్ అవసరాలన్నా బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి చులకన అయింది.

పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చక పోగా బడ్జెట్‌లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం ఒకటుందన్న గుర్తింపు కూడా లేని విధంగా వ్యవహరించింది. ఉమ్మడి రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించి ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం చేసిందంటూ కాంగ్రెస్‌పై పదేపదే విరుచుకుపడే తెలుగుదేశం చట్టసభల సాక్షిగా రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చిన వాగ్దానాలను, హామీలను అమలుచేయడంలో నిర్లక్ష్యాన్ని, నిర్లిప్తతను ప్రదర్శించి వంచించిన మోడీ సర్కార్‌పై మాత్రం ఏనాడూ నోరు మెదకపోవడం ప్రజాద్రోహమే అవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రకటిస్తే కాదుకాదు పదేళ్లు ఇవ్వాలని బిజెపి నినదించింది. ఎన్నికల్లో నెగ్గిన తరువాత ప్రత్యేక హోదాతో ఏమొస్తుంది…దానికి మించి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటూ మాటమార్చింది.

ఎదురు తిరగని టిడిపి దోరణివల్ల, ప్రత్యేక హోదాను ప్రణాళికబద్ధంగా అటకెక్కించిన మోడీ సర్కార్‌ విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్న పోలవరం విషయంలోనూ ద్రోహం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు సమకూర్చి సకాలంలో పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రపైనే ఉన్నా.. నిధులు మంజూరు చేయకుండా అడ్డం పడుతున్నప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయడానికి ప్రయత్నించ లేదు.

అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాల అండగా ఉంటామని, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో అడుగడుగునా సహకరిస్తామని గుప్పించిన హామీల విషయంలోనూ బిజెపి నిలువునా మోసగించింది. హస్తిన తరహాలో అమరావతిని నిర్మించేందుకు సహకరిస్తామని అమరావతి శంకుస్థాపన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వాగ్దానాన్ని ‘పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు’తో సరిపుచ్చారు.

విశాఖ రైల్వే జోన్‌ విషయంలోనూ ఇచ్చిన హామీలకు కేంద్రం తిలోదకాలిచ్చింది. రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు విభజన చట్టం ప్రకారమే ఆర్థిక సహాయం అందిచాల్సిన సాయం నేటికీ అందలేదు.

ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రానికి రావలసిన హక్కులు, నిదుల సాధనలో కీలక పాత్ర పోషించాల్సిన వైఎస్‌ఆర్‌సిపి సైతం సర్వశక్తుల్నీ చంద్రబాబును దుమ్మెత్తిపోయడానికే వినియోగిస్తున్నది. రెండు పార్టీలూ సొంత ప్రయోజనాలకు ఇచ్చే ప్రాధాన్యత ప్రజాప్రయోజనాలకు రాష్ట్రప్రయోజనాలకు ఇవ్వడం లేదన్న విమర్శ నానాటికీ బలపడుతున్నది.

ఇదంతా కేంద్ర బడ్జెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి మరోసారి తీవ్ర ద్రోహం జరిగింది. బడ్జెట్‌లో హోదా సంగతి ఎత్తలేదు, నిధుల గురించి మాట్లాడలేదు, వెనుకబడిన ప్రాంతాలను గురించి పట్టించుకోలేదు, రైల్వే జోన్‌ను ప్రస్తావించలేదు, చివరికి కేంద్రమే నిర్మించాల్సిన పోలవరానికి కూడా రూ. 900 కోట్లు విదిలించి ఊరుకున్నారు. రూ. 40 వేల కోట్లకు పైగా నిధులు కావాల్సిన జాతీయ ప్రాజెక్టుకు 900 కోట్లు ఇస్తే అది ఎప్పటికి పూర్తయ్యేను?

ఇంత దుర్మార్గం జరిగిన తరువాతనైనా చంద్ర బాబు ప్రభుత్వం కళ్లు తెరవాలి. బిజెపి చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించాలి. అఖిల పక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంతో ఐక్యంగా పోరాడాల్సిన బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకోవాలి.

లేనిపక్షంలో రాష్ట్ర ప్రజలముందు తెలుగుదేశం బోను ఎక్కక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here