అండగా ఉంటాం.. అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

0
39

ఎస్సీ మహిళా హాస్టల్‌ విద్యార్ధినులకు ఆదిరెడ్డి భరోసా

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 4 : హాస్టళ్ళలో చదువుకునే విద్యార్ధులకు మౌలిక సదుపాయాలను కల్పించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. ఆర్ట్స్‌ కళాశాలకు సమీపంలోని ఎస్సీ మహిళా హాస్టల్‌లో ఇటీవల నిర్వహించిన దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమంలో విద్యార్ధినులు పలు సమస్యలను ప్రస్తావించారు. ప్రభుత్వాసుపత్రిలో వైద్యం సక్రమంగా అందడంలేదని, కొంతమంది చికిత్స చేసేందుకు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని ఫిర్యాదు చేయడంతోపాటు హాస్టల్‌లో మరుగుదొడ్లు, మంచినీటి సమస్యలను ప్రస్తావించారు. దీంతో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఈరోజు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమేష్‌కిషోర్‌తో కలిసి హాస్టల్‌లో విద్యార్ధినులను కలిశారు. ఆసుపత్రిలో ఎదురవుతున్న సమస్యలను ఆయనకు వినిపించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైద్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్‌ ఎంతో శ్రద్ధ కనబరిచి ప్రభుత్వాసుపత్రిలో ఎన్నో మౌలిక సదుపాయలు కల్పిస్తూ కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా సేవలందిస్తున్నారన్నారు. ఇకపై ప్రభుత్వాసుపత్రిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్ధినులందరికీ వైద్యం అందిస్తారని తెలిపారు. హాస్టల్‌లో 300 మంది విద్యార్ధులుండగా కేవలం ఎనిమిది మరుగుదొడ్లు మాత్రమే ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరో ఎనిమిది మరుగుదొడ్ల నిర్మాణానికి అంచనాలు వేయిస్తున్నామన్నారు. మంచినీటి సరఫరా నిమిత్తం ఒక ఆర్‌ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని, చలికాలంలో విద్యార్ధుల స్నానాల నిమిత్తం గ్రీజర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. దళితుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమందికి ఖరీదైన కార్లు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. డాక్టర్‌ రమేష్‌ కిషోర్‌ మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్య సేవలు సక్రమంగా అందకపోతే తన దృష్టికి తీసుకురావాలని, ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే వారిని సస్పెండ్‌ చేస్తామన్నారు. పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ విద్యార్ధులకు ఏ సమస్యలు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో చాంబర్‌ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, బూరాడ భవానీశంకర్‌, కడితి జోగారావు, మహమ్మద్‌ ఖాసిం, మధువరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here