అధ్యాయన యాత్రాంశాలతో త్వరలో ప్రభుత్వానికి నివేదిక

0
36

కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో స్ధలాల అభివృద్ధి యోచన

గుడా ఆధ్వర్యంలో జంక్షన్ల అభివృద్ధి, పచ్చదనానికి ప్రణాళిక : చైర్మన్‌ గన్ని కృష్ణ

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 12 : పట్టణీకరణ ప్రణాళికాబద్ధంగా జరగాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మున్సిపల్‌ శాఖామంత్రి నారాయణ సూచన మేరకు రాష్ట్రంలోని అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌లు, వైస్‌ చైర్మన్‌ల బృందం ఇటీవల రెండు విడతలుగా దేశంలోని ప్రధాన నగరాల్లో చేపట్టిన అధ్యాయన యాత్ర (స్టడీ టూర్‌) ఎంతో ప్రయోజనకరంగా సాగడమే గాక తమకు స్ఫూర్తినిచ్చిందని గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని గుడా జోనల్‌ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల్లో పర్యటించి ఐదు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల పనితీరు, వారు చేపట్టిన వివిధ రకాల ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో తమ బృందం పరిశీలించడం జరిగిందన్నారు. ముఖ్యంగా ముంబాయిలో సిడ్కో (సిటీ అండ్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ మహారాష్ట్ర) ఆధ్వర్యంలో నిర్మించిన నవీ ముంబాయి సిటీని, అక్కడ చేపడుతున్న అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగిందన్నారు. రెండు రన్‌వేలతో కూడిన విమానాశ్రయాన్ని సిడ్కో నిర్మిస్తోందని తెలిపారు. అక్కడ ఒక రైల్వేస్టేషన్‌ వద్ద భారీ షాపింగ్‌మాల్‌ నిర్మాణం, గోల్ఫ్‌ క్లబ్‌ల నిర్మాణం సిడ్కో చేపట్టిందన్నారు. అహ్మదాబాద్‌లో సబర్మతీ రివర్‌ ఫ్రంట్‌ నిర్మాణం చాలా బాగుందని, అక్కడ వాకింగ్‌ ట్రాక్‌తోపాటు పార్కును కూడా నిర్మించినట్లు తెలిపారు. గ్రేటర్‌ నోయిడా ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలో పలు పరిశ్రమలను ఏర్పాటు చేశారని, ఆ ప్రాంతంలో పరిశ్రమలు, యూనివర్శిటీలు, విద్యా సంస్థలే ఉన్నాయని తెలిపారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో దయావతి రివర్‌ ఫ్రంట్‌ నిర్మాణాన్ని పరిశీలించినట్లు తెలిపారు. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలంటే కేవలం ప్లాన్‌లు, లే అవుట్‌లకు అనుమతులు ఇవ్వడమే గాక ప్రభుత్వ స్థలాలను గుర్తించి గృహాల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటుకు కృషిచేయాల్సి ఉందన్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ పరిసర ప్రాంతాల్లో స్థలాలను గుర్తించి అభివృద్ధి చేసేందుకు ఆలోచిస్తున్నట్లు తెలిపారు. లాలాచెరువు జంక్షన్‌లోని కార్గిల్‌ పోరులో మరణించిన సైనికుని మృతికి సంతాప సూచికగా నిర్మించిన పార్కును అభివృద్ధి చేస్తామని, రామకృష్ణ ధియేటర్‌ వెనుక వాంబే గృహాల సముదాయం వద్ద నిర్మించిన వంద అడుగుల రోడ్డుకు సెంట్రల్‌ లైటింగ్‌, ఆ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు గుడా చొరవ తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి నగరానికి చెందిన ఒక ప్రముఖ కాంట్రాక్టర్‌ కూడా సహకరించేందుకు ముందుకు వచ్చారని వివరించారు. పెద్దాపురంలో ఎన్‌టిఆర్‌ సర్కిల్‌ ఆధునికీకరణకు గుడా సహకారం అందిస్తుందని, కాకినాడ అచ్చంపేట రౌండ్‌ సర్కిల్‌ అభివృద్ధితోపాటు కలెక్టర్‌ విజ్ఞప్తి మేరకు అచ్చంపేట నుంచి సర్పవరం వచ్చే రహదారిలో లైటింగ్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఐదు రాష్ట్రాలలో తాము చూసిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను సమీక్షించి ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఐదు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలు ఏర్పడి శైశవ దశలో ఉన్నాయని, వాటిలో గుడా ముద్ర చూపించేందుకు తమ వంతు కృషిచేస్తున్నామన్నారు.

గుడాకు సొంత గూడుకు ఐదు ఎకరాలు కోరాం

గుడా సొంత భవనం ఏర్పాటుకు కాకినాడ ఎన్‌టిఆర్‌ బీచ్‌ వద్ద ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞాపన చేశామని తెలిపారు. గుడా పరిధిలో గృహ నిర్మాణాలకు సంబంధించి కొత్త సాఫ్ట్‌వేర్‌ వచ్చిందని, దీనిపై సర్వేయర్లకు, పంచాయితీ కార్యదర్శులకు అవగాహన కల్పించేందుకుగాను ఈనెల 17న రాజమహేంద్రవరంలో, 19న కాకినాడలో అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గుడా పరిధిలో ఇప్పటికీ 220 మంది సర్వేయర్లకు లైసెన్స్‌లు మంజూరు చేయడం జరిగిందని, గుడా పరిధిలో ఉన్న సర్వేయర్‌ ఏ పంచాయితీ పరిధిలోకైనా ప్లాన్‌ వేయొచ్చని, ఒక్క పంచాయితీకి మాత్రమే పరిమితం కాదని తెలిపారు. కొన్ని పంచాయితీలలో పాత తేదీలతో ప్లాన్‌ అప్రూవల్‌ చేస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. గుడా ఏర్పడిన తరువాత ఇప్పటివరకు గ్రామ పంచాయితీల్లో 300 చదరపు మీటర్ల లోపు స్థలాల్లో భవన నిర్మాణాల కోసం 1694 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 1492 దరఖాస్తులను అనుమతించామని, 45 దరఖాస్తులను నిరాకరించడం జరిగిందని తెలిపారు. తొమ్మిది దరఖాస్తులను లోపాలు సరిచేసుకోవడానికి వెనక్కి పంపామని, 208 దరఖాస్తులు గ్రామ కార్యదర్శుల పరిశీలనలో ఉన్నాయన్నారు. వీటి ద్వారా గుడా సంస్థకు డెవలప్‌మెంట్‌ ఛార్జీల రూపంలో రూ. 88 లక్షల ఆదాయం చేకూరగా, గ్రామ పంచాయితీలకు రూ.5 కోట్ల 23 లక్షలు ఆదాయం వచ్చిందన్నారు. గుడా పరిధిలోని గ్రామ పంచాయితీల నుండి 300 చదరపు మీటర్లు పైబడిన స్థలంలో నిర్మాణాల కోసం 56 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 12 దరఖాస్తులకు మంజూరు చేశామని, 32 దరఖాస్తులు ప్లానింగ్‌ అధికారుల పరిశీలనలో ఉన్నాయని, 12 దరఖాస్తులకు సంబంధించి అదనపు సమాచారాన్ని కోరామన్నారు. గుడా పరిధిలో పరిశ్రమల స్థాపన నిమిత్తం భవన నిర్మాణ అనుమతుల కోసం రాజమహేంద్రవరం జోన్‌లో 16 దరఖాస్తులు రాగా 12 దరఖాస్తులకు అనుమతి మంజూరు చేయగా మూడు దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందన్నారు. కాకినాడ జోన్‌లో తొమ్మిది దరఖాస్తులు రాగా అన్నింటికీ మంజూరు జారీ చేశామన్నారు. లే అవుట్ల నిమిత్తం రాజమహేంద్రవరం జోన్‌లో 12 దరఖాస్తులు రాగా పరిశీలించి మూడు లేఔట్లను ఆమోదించామని, ప్లానింగ్‌ అధికారుల పరిశీలనలో మరో మూడు ఉన్నాయని, అదనపు సమాచారం కోసం ఆరు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కాకినాడ జోన్‌ పరిధిలో తొమ్మిది దరఖాస్తులు రాగా మూడింటిని ఆమోదించామని, ప్లానింగ్‌ అధికారుల పరిశీలనలో ఐదు ఉన్నాయని, అదనపు సమాచారం కోసం ఒక దరఖాస్తు పెండింగ్‌లో ఉందన్నారు. చాలామంది మధ్యతరగతి ప్రజలు అన్‌ అప్రూవ్డ్‌ స్థలాలు కొనుగోలు చేసి గృహ నిర్మాణాల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారని, అలాంటి వాటికి ప్లాన్‌లు మంజూరు కాబోవని ఆయన చెప్పారు. ఇలాంటి దరఖాస్తులు ఎక్కువగా ఉన్నందున ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారమయ్యేలా కృషిచేస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here