మోదీ కి దూరమౌతున్న మిత్రులు (శనివారం నవీనమ్)

0
88

మోదీ కి దూరమౌతున్న మిత్రులు
(శనివారం నవీనమ్)

పార్టీకంటే ఎత్తుకి ఎదిగిన నరేంద్రమోదీ విజయాలకు గర్వపడుతున్న బిజెపికి ఆయన వైఫల్యాలు మోయలేని భారంగా మారదశ తరుముకొస్తోంది. బిజెపి నమ్మకద్రోహంతో రగిలిపోతున్న ఆంధ్రప్రదేశ్ ను పక్కన పెట్టేసినా, ఉత్తరభారతదేశంతో సహా ఏ రాష్ట్రంలోనూ బిజెపికి సంపూర్ణ సానుకూల పరిస్ధితులు లేవు.

పెద్దనోట్ల రద్దు, జి ఎస్ టి పర్యవసానాలు అనుకూలంగా కాక వ్యతిరేకంగా పరిణమించడం వల్ల మోదీని ఆరాధనా భావంతో చూసిన సామాన్యులు మధ్యతరగతి వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

సర్వం తానే అయిన నిరంకుశ అహంభావాల వల్ల మోదీకి సొంత పార్టీలో మిత్రులు సన్నిహితులు లేకుండా పోయారు. భారతదేశ ఫెడరల్ ధర్మాన్ని ఆచరణలో అమెరికన్ అధ్యక్ష పాలన దిశకు మళ్ళించేస్తున్నందువల్ల మిత్రపక్షాలు మోదీకి దూరమైపోతున్నాయి.

ఈ వాతావరణమంతాకలిసి రాజకీయాల్లో నరేంద్రమోదీని ఏకాకిగా నిలబెట్టే సూచనలు కనబడుతున్నాయి

ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా నిరంకుశ, అహంభావపూరిత, నిర్లక్ష్య ధోరణులపట్ల జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) మిత్రపక్షాలు శివసేన, తెలుగుదేశం, అకాలీదళ్‌నేతల్లో అసంతృప్తి, ఆగ్రహం పెల్లుబుకుతోంది. మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలవల్ల కాంగ్రెస్‌ క్రమంగా పుంజుకుంటోంది.

పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలువల్ల ఆర్థిక రంగం అస్థవ్యస్థం కావడం, అధికారపక్షానికి సన్నిహితులైన పెద్దవ్యాపార సంస్థల అక్రమ, అనుచిత పద్ధతుల్లో ప్రభుత్వ బ్యాంకుల నుండి వేలకోట్లు కొల్లగొట్టి విదేశాలకు సురక్షితంగా పారిపోవడం, నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగం, కోలుకోని పరిశ్రమలు, ఉపాధి కల్పన ”భ్రమ”గా మిగిలిపోవడంతో ప్రజల్లో ముఖ్యంగా యువతలో అసంతృప్తి రగులుతోంది. గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ బొటాబొటీ మెజారిటీతో గెలవడం, రాజస్తాన్‌లో ఒక అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్ధానాల ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్‌ గెలుపు తరువాత మోదీ సత్తాపై సందేహాలు ఏర్పడ్డాయి.

సైద్ధాంతికంగా బీజేపీ ”హిందూత్వ”కు సన్నిహితమైన శివసేన – వచ్చేఎన్నికల్లో కమలంతో జతకట్టబోమని కరాఖండిగా ప్రకటించింది. శివసేనకు లోక్‌సభలో 18 సీట్లు చంద్రబాబనాయుడు నాయకత్వంలోని మరోమిత్రపక్షం తెలుగుదేశం పార్టీకి పార్లమెంటులో 16 సీట్లున్నాయి. ప్రత్యేకహోదా- ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకై ఆందోళన మొదలైంది. మరో మిత్రపక్షం అకాలీదళ్‌ – ముస్లింలు ఇతర మైనారిటీలపై అసంతృప్తి వున్నా ఇప్పట్లో ఎన్నికలు లేవు గనుక వేచి చూస్తోంది.

గుజరాత్ లో ఆత్మగౌరవ నినాదం రేకెత్తించి, ప్రధానిగా ప్రతిష్టను పణంగాపెట్టి, ఎన్నికలకు ముందు రూ. 15 వేల కోట్ల సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రకటించినా బిజెపి కేవలం 7 సీట్లు మెజారీటీతో గట్టెక్కడం చూస్తే అక్కడేగాక దేశంలో మోదీ ప్రభంజనం క్షీణిస్తోందని స్పష్టమవుతోంది.

2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ”అచ్ఛేదిన్‌ నినాదం”తో సొంతంగా 282 స్థానాలు సాధించి, శివసేన, తెలుగుదేశం, అకాలీదళ్‌ భాగస్వాములుగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పరచినా మిత్రపక్షాలను చులకనగా చూస్తోందనే అభిప్రాయం ప్రబలంగా వుంది. ఒకనాడు కమ్యూనిస్టు యోధుడు హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌, ఎబి. బర్దన్‌ల దన్నుతో యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా దేవేగౌడ, ఐకె. గుజ్రాల్‌ ప్రధానులుగా కేంద్రంలో మూడో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో కీలకపాత్ర వహించిన అనుభవజ్ఞుడు, సీనియర్‌ రాజకీయవేత్త, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఏడాదికి పైగా కలుసు కోవడానికి ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వక పోవడం, చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలసినా ఫలితం లేకపోవడం మోదీ అహంకారానికి తిరుగు లేని సాక్ష్యమౌతోంది.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి టి.అంజయ్యను అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ బహిరంగంగా అవమానించడంతో తెలుగువారిలో ఆగ్రహం రగిలింది. ప్రముఖ సినీనటుడు నందమూరి తారక రామారావు కాంగ్రెస్‌ చర్యలను ఖండిస్తూ ”తెలుగు ఆత్మగౌరవ పరిరక్షణ” నినాదంతో తెలుగుదేశం పార్టీని ఏర్పరచి, 9 నెలల్లోనే అధికారంలోకి రావవడం తెలిసిందే.

ఇన్నాళ్లు వేచిచూచిన చంద్రబాబు రాష్ట్ర సమస్యలపై తెలుగుదేశం ఎంపీలతో ఆందోళనబాట పట్టారు. గతంలో లాలూప్రసాద్‌ యాదవ్‌ ఆర్జేడీతో జతకట్టి గెలిచిన బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ హఠాత్తుగా ప్లేటు మార్చి, బీజేపీతో మళ్లీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి బీజేపీ చిన్న మిత్రపక్షాలు ఉపేంద్ర కుశ్వాహ రాష్ట్రీయ లోక్‌సమతాపార్టీ, దళితనేత జితిన్‌ మాంజీ హిందూస్తాన్‌ అవామి మోరొ, రాంవిలాస్‌ పాశ్వాన్‌ లోక్‌జనశక్తి పార్టీలు ఇప్పుడు తాజాగా లాలూ ఆర్జేడీతో మంతనాలు సాగిస్తున్నాయి.

ఆరెస్సెస్‌ సిద్ధాంత కర్త ఎం.ఎస్‌. గోల్వాల్కర్‌ ప్రవచించిన ఒకే దేశం – ఒకే జాతి – ఒకే చట్టసభ నినాద స్ఫూర్తితో ఎందరో వ్యతిరకిస్తున్నా అసెంబ్లీ – లోక్‌సభలకు ఏకకాల ఎన్నికల అజెండాను మోడీ – అమిత్‌షా తెరపైకి తెచ్చి క్రమంగా రాజకీయ గుత్తాధిపత్యం సాధనకు యత్నిస్తున్నారు. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, వామపక్షాలు ఏకకాల ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి.

లోక్‌సభ 543 సభ్యులలో సాధారణ మెజారిటీకి 274 స్థానాలు కావాలి. ఇప్పుడు బీజేపీకి కేవలం 275 స్థానాలు అంటే కేవలం 2 స్థానాలే అధికం. బీజేపీలో డజను మంది ఎంపీలు తిరుగుబాటు చేస్తే మిత్రపక్షాల మద్దతు లేకుండా మోడీ సర్కారు అధికారంలో కొనసాగడం కష్టం.

ఏప్రిల్ లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మోడీ ప్రతిష్ఠకు పరీక్షే. ఆ తర్వాత జరిగే రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాలపై వ్యతిరేకత వల్ల ఫలితాలు వేరుగా రావచ్చు. 22 కోట్ల జనాభా, 80 లోక్‌సభ స్థానాలు గల యూపీలో 2014 ఎన్నికల్లో మిత్రపక్షం అప్నాదళ్‌తో కలసి 73 స్థానాలు గెలిచిన బీజేపీకి ఈసారి నల్లేరు నడక కాదు. అఖిలేష్‌ యాదవ్‌ సమాజ్‌వాదీ, మాయవతి బీఎస్‌పీ, కాంగ్రెస్‌ తదితర పక్షాలు ఏకమైతే కమల నాధులకు అక్కడ గర్వభంగం తప్పదు. రాజస్తాన్‌, గుజరాత్‌లలో అప్పటివలె అన్ని లోకసభ స్థానాలు బీజేపీకి దక్కే పరిస్థితి లేదు. పెద్దరాష్ట్రం పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మోడీ సర్కారు చర్యలను వ్యతిరేకిస్తోంది. ఒరిస్సాలో బిజూ జనతాదళ్‌, కేరళ వామపక్ష ఫ్రంట్‌లు వ్యతిరేకమే.

తెలంగాణలో తెరాసకు కాంగ్రేస్‌ వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి గనుక కేసీఆర్‌ వేచి చూచే ధోరణిలో వున్నారు. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కాంగ్రెస్‌ కూటమిలో వున్న 2జీ కుంభకోణంలో ఎ. రాజా, కనిమొళిలను కోర్టు నిర్దోషు లుగా ప్రకటించిన తరువాత కూడా బిజెపి పట్ల స్పష్టవైఖరి ప్రకటించలేదు. బీహార్‌లో లాలూయాద్‌ అరెస్టు అనంతరం యాదవ్‌ – ముస్లిం వర్గాల్లో ఆయనపై సానుభూతి పెరుగుతున్నట్లు నేపధ్యంలో కుశ్వాహా, జితిన్‌ మాంజీ ప్రభుత్వాలు ఆర్జేడీతో కలిస్తే ఫలితాలు ఆర్జేడీకి అనుకూలంగా మారొచ్చు.

నాగాలాండ్‌లో 15 ఏళ్లుగా బీజేపీతో ఉన్న మిత్ర బంధాన్ని నాగా పీపుల్సు ఫ్రంట్‌ తెంచుకుని సొంతంగా పోటీ చేస్తోంది. ప్రజా వ్యతిరేకతవల్ల కేంద్రంలో, మణిపూర్‌లో బీజేపీతో సంకీర్ణ భాగస్వామిగా వున్న మేఘాలయ నేషనల్‌ పీపుల్సు పార్టీ ఎన్నికల పొత్తు పెట్టుకోలేదు. గోవాలో ఎంజిపి, గోవా ఫార్వర్డ్‌ పార్టీ సంకీర్ణం నుండి వైదొలుగుతామని బీజేపీని హెచ్చరిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలలో మోదీ పై ఆగ్రహం నానాటికీ తీవ్రమవుతోంది. పేదలు, రైతులు, శ్రామిక జనజీవితాలు దుర్భరమవు తున్నాయి. అందువల్ల నిరు ద్యోగం, పేదరికం నిర్మూలన, ఉపాధి, జీవనోపాధుల కల్పన వంటి మౌలిక అంశాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి కమలనాధులు మళ్లీ ”హిందూత్వ” నినాదంతో విద్వేష ప్రచారాన్ని తీవ్రం చేయొచ్చు. పరివార్‌ కుతంత్రాలపట్ల నిరంతర అప్రమత్తత అవసరం.

జనాగ్రహం తీవ్రమైతే ఎంత నియంతృత్వ పాలకులైనా గద్దె దిగక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here