ఏసీబీ పరిధిలోకి ప్రజాప్రతినిధులు

0
24

త్వరలో రాజమహేంద్రవరంలో కోర్టు ఏర్పాటు : ఉపముఖ్యమంత్రి రాజప్ప

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 27 : ప్రజాప్రతినిధులు కూడా అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి వచ్చేలా చట్టంలో మార్పులు చేయవలసిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అభిప్రాయపడ్డారు. రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్‌ వద్ద ఎల్‌ఐసి డివిజన్‌ కార్యాలయం ప్రక్కన నియమించిన ఏసీబీ రేంజ్‌ కార్యాలయ భవనాన్ని రాజప్ప ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతిని నిరోధించేందుకు ఏసీబీని పటిష్టపరుస్తానని, అవినీతి నిర్మూలన ద్వారానే సుపరిపాలన సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని కేసులను విచారించేందుకు త్వరలో రాజమహేంద్రవరంలో ఏసీబీ కోర్టును ఏర్పాటు చేయనున్నట్లు రాజప్ప చెప్పారు. అవినీతికి పాల్పడే ప్రజాప్రతినిధులను కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజలు కూడా సహకరించాలన్నారు. రాజమహేంద్రవరం ఎం.పి. మాగంటి మురళీమోహన్‌ మాట్లాడుతూ లంచం కోసం ఎవరైనా డిమాండ్‌ చేస్తే వారిని ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు. శాసనమండలి సభ్యులు రాము సూర్యారావు మాట్లాడుతూ అవినీతిపరులను శిక్షించేటప్పుడు అమాయకులు బలి కాకుండా చూడాలన్నారు. అవినీతి నిరోధక విభాగం డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.పి.ఠాకూర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏసీబీకి సొంత భవనాలు సమకూర్చేందుకు ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని, రాజమహేంద్రవరంలో రూ.95లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించామని చెప్పారు. ఎవరైనా లంచం కోసం డిమాండ్‌ చేస్తే టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1100కు ఫిర్యాదు చేస్తే స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు, ఏసీబీ డైరెక్టర్‌ శంఖభ్రాత బాగ్చి, సబ్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ, నగరపాలక సంస్థ కమిషనర్‌ విజయరామరాజు, అర్బన్‌ ఎస్పీ రాజకుమారి, ఏసీబీ డిఎస్పీలు సుధాకర్‌, గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here