సమస్యల పరిష్కారానికి పాదయాత్ర

0
36

రూరల్‌ నియోజకవర్గంలో బీసీ నేత కడలి వెంకటేశ్వరరావు సంకల్పం

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 28 : రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి రేపటి నుంచి వారం రోజులపాటు సంకల్ప పాదయాత్ర చేపడుతున్నట్లు బీసీ నేత, రాజమండ్రి అభివృద్ధి సమితి కన్వీనర్‌ కడలి వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూరల్‌ నియోజకవర్గంలో సరైన డ్రైనేజీలు, రోడ్లు లేకపోవడం, మౌలిక వసతుల కల్పనలో వెనకబడిపోవడం, ప్రభుత్వ కళాశాలలు లేకపోవడం బాధ కలిగించాయని, దీనికోసమే పాదయాత్ర చేపడుతున్నానన్నారు. రూరల్‌ నియోజకవర్గ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించాలని, మోరంపూడి, బొమ్మూరు, వేమగిరి కూడళ్ళలో ఫ్లై ఓవర్లు నిర్మించాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు బ్యాంకు గ్యారంటీ లేకుండా ప్రభుత్వ రుణాలు మంజూరు చేయాలని, శాటిలైట్‌ సిటీలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రారంభించాలని, ధవళేశ్వరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, కొంతమూరు జంగాల కాలనీలో ఇళ్ళు కాలిపోయిన పేదలకు పక్కా గృహాలు నిర్మించాలని, కడియం మండలంలో పూల పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇళ్ళు, పెన్షన్‌తోపాటు ఎస్సీ, ఎస్టీల మాదిరిగా మిగిలిన వర్గాలకు పెళ్ళి కానుకగా రూ.50వేలు అందించాలని, రూరల్‌, కడియం నియోజకవర్గంలో పేద విద్యార్ధుల కోసం రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రేపు ఉదయం 10.30 గంటలకు శాటిలైట్‌ సిటీలో పాదయాత్ర ప్రారంభమవుతుందని, అక్కడ నుంచి పిడింగొయ్యి, కవలగొయ్యి, బుచ్చయ్యనగర్‌, హుకుంపేట వరకు జరుగుతుందన్నారు. రెండవరోజు వేమగిరి, కడియం, కడియపుసావరం, మూడవరోజు జేగురుపాడు, గుబ్బలవారిపాలెం, వీరవరం, మురమండ, దుళ్ళ, నాలుగవరోజు పొట్టిలంక కాలనీ, కడియపులంక, బుర్రిలంక, ఐదవరోజు ఇన్నీసుపేట, ఆల్కాట్‌ గార్డెన్స్‌, ధవళేశ్వరం, 6వ రోజు షెల్టన్‌ హోటల్‌, బాలాజీపేట, బొమ్మూరు, రాజవోలు, 7వ రోజు మల్లయ్యపేట, కొంతమూరు, కోలమూరుతో యాత్ర ముగస్తుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో బుడ్డిగ శ్రీను, దాసరి లక్ష్మణ యాదవ్‌, శివ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here