ఎన్‌టిఆర్‌ స్ఫూర్తితో తెలుగుజాతి పోరాడే సమయం ఆసన్నమైంది

0
49

బలం అంచనా వేసుకోకుండా తెదేపాపై విమర్శలా?

1 వ డివిజన్‌లో దళితతేజంలో బిజెపి తీరుపై గన్ని కృష్ణ ధ్వజం

రాజమహేంద్రవరం, మార్చి 7 : విభజన కారణంగా నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు నడిపించేందుకు సీఎం చంద్రబాబునాయుడు ఎంతో కృషి చేస్తుండగా కొంతమంది బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నారని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. 2014 ఎన్నికల సమయంలో తమ పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుందని, తమ పార్టీ శ్రేణుల కృషితోనే బిజెపికి నాలుగు అసెంబ్లీ స్ధానాలు దక్కాయని గుర్తు చేశారు. స్ధానిక 1 వ డివిజన్‌లో కార్పొరేటర్‌ కడలి రామకృష్ణ ఆధ్వర్యంలో దళితతేజం- తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. దళితరత్న కాశి నవీన్‌కుమార్‌ అధ్య్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గన్ని కృష్ణ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు 42 మంది ఎంపీలు, 294 మంది ఎమ్మెల్యేల బలం ఉండేదని, విభజన తర్వాత ఆ బలం తగ్గిపోవడంతో పాటు ఆర్థికంగా నష్టపోయామని అన్నారు. బిజెపి నాయకులు వారి బలమెంతో ఆలోచించకుండా సీఎంపై వ్యక్తిగత ధూషణలకు దిగడం సరికాదన్నారు. రాష్ట్రం రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉండగా అభివృద్ధి, సంక్షేమం ఎలా సాధ్యమవుతుందని, అయినా సీఎం చంద్రబాబు ఎక్కడా రాజీ పడకుండా పాలన సాగిస్తున్నారని తెలిపారు. పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును రాష్ట్రానికి ఇచ్చేందుకు మీనమేషాలు లెక్కించడం సరికాదని, చుక్కాని లేని ఏపీని దరికి చేరుస్తున్న చంద్రబాబుకు ప్రజలు అండగా నిలవాలన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకూడదన్న ఉద్ధేశ్యంతోనే ఢిల్లీ పెద్దలకు ఎదురు చెప్పకుండా చంద్రబాబు పనిచేశారని, దానిని ఆసరాగా తీసుకుని నోటికొచ్చినట్ల మాట్లాడవద్దని సూచించారు. గతంలో ఢిల్లీ పీఠాన్ని ఎవరు అధిరోహించాలో నిర్ణయించే నాయకునిగా చంద్రబాబు నిలిచారని, అలాంటి వ్యక్తిపై విమర్శలు చేసే అర్హత ఎవరికీ లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే సమయం ఆసన్నమైందని, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారక రామారావు స్ఫూర్తితో పోరాటం చేయాలన్నారు. దళితుల సంక్షేమానికి, విద్యా వ్యాప్తికి ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. తాను మూడు దశాబ్ధాలుగా పార్టీ జెండాను మోస్తూ పనిచేస్తున్నానని, పార్టీ కోసం ఎవరికీ తలొగ్గవలసిన అవసరం లేదన్నారు. దళితులకు తెలుగుదేశం పార్టీయే పెద్ద పీట వేస్తోందని, అందులో భాగంగానే బాలయోగికి లోక్‌సభ స్పీకర్‌గాను, ప్రతిభా భారతికి అసెంబ్లీ స్పీకర్‌గా అవకాశాలు కల్పించారని తెలిపారు. మేయర్‌ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అన్ని వర్గాల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలుచేస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. డివిజన్లలో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా పరిష్కరిస్తామన్నారు. కాశి నవీన్‌కుమార్‌ మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా దళితుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని, ఆయనకు అందరూ అండగా నిలవాలన్నారు. అనంతరం దళితులతో కలిసి అల్పాహారం భుజించారు. అనంతరం ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ముందుగా లాలాచెరువు సెంటర్‌లో ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, యువ నాయకుడు ఆదిరెడ్డి వాసు, కార్పొరేటర్లు కోరుమిల్లి విజయ్‌శేఖర్‌, మర్రి దుర్గా శ్రీనివాస్‌, పార్టీ నాయకులు బొచ్చా శ్రీను, పితాని కుటుంబరావు, కడితి జోగారావు, సూరంపూడి శ్రీహరి, కవులూరి వెంకట్రావ్‌, పెయ్యల శ్రీను, రేవాడ సత్యనారాయణ, పుట్టా సాయిబాబు, తుత్తరపూడి రమణ, మేరపురెడ్డి రామకృష్ణ, జాగు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here