అర్ధవంతంగా సాగిన అధ్యయన యాత్ర

0
44

జంక్షన్‌లు అభివృద్ధి, పారిశుద్యంపై మరింత దృష్టి – ప్లాస్టిక్‌ నిర్మూలనకు చర్యలు : మేయర్‌ రజనీ శేషసాయి

రాజమహేంద్రవరం, మార్చి 7 : నగరంలో మెరుగైన పాలన అందించేందుకు అధ్యయన యాత్ర ఎంతగానో ఉపయోగపడనుందని మేయర్‌ పంతం రజనీశేషసాయి వెల్లడించారు. కార్పొరేటర్‌ల బృందంతో కలిసి ఇటీవల చేపట్టిన అధ్యయన యాత్ర విశేషాలను తెలియజేసేందుకు నేడు నగరపాలక సంస్ధ కార్యాలయంలోని సమావేశపు హాలులో మేయర్‌ రజనీశేషసాయి విలేకరుల సమావేశం నిర్వహించారు. మేయర్‌ రజనీశేషసాయి మాట్లాడుతూ దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలోని ముఖ్య నగరాలతో పాటు పాండిచ్ఛేరిలో తమ అధ్యయన యాత్ర సాగిందని వెల్లడించారు. తమిళనాడులోని చెన్నై, మధురై, కొయంబత్తూరు, కర్నాటకలో మైసూర్‌, బెంగళూరు, కేరళలని త్రివేండ్రంతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్ఛేరి నగరాన్ని తమ బృందం పరిశీలించిందన్నారు. ఆయా నగరాల్లో అభివృద్ధితోపాటు, ప్రజలకు అందుతున్న సేవలు, సౌకర్యాలను పరిశీలించడం జరిగిందన్నారు. పారిశుద్య నిర్వహణ, మురుగునీరు పారుదల వ్యవస్ధను పరిశీలించామన్నారు. చెన్నై అతి పురాతనమైన నగరమని, అక్కడ పురాతన కార్పొరేషన్‌ భవనాన్ని జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోట్లాది రూపాయిలను వెచ్చించి, పునరుద్దరించడం జరిగిందన్నారు. అదే రీతిలో రాజమహేంద్రవరంలో పాత కార్పొరేషన్‌ భవనంతో పాటు, వివిధ కట్టాడాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. అక్కడ నమ్మా టాయిలెట్స్‌, అమ్మ క్యాంటిన్‌ల నిర్వహణను పరిశీలించామన్నారు. పాండిచ్ఛేరిలో ట్రాఫిక్‌ చాలా తక్కువగా ఉంటుందన్నారు. డచ్‌వారు నిర్మించిన డ్రైనేజి వ్యవస్ధనే అక్కడ చక్కగా ఉపయోగించుకుంటున్నారన్నారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా అక్కడ నిర్మూలించారన్నారు. సులభ్‌ కాంప్లెక్స్‌ల నిర్వహణను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించడం జరిగిందని, సులభ్‌ కాంప్లెక్స్‌పై ¬ర్డింగ్స్‌ ఏర్పాటుచేసి, ప్రకటనలకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయంతో సులభ్‌ కాంప్లెక్స్‌ల నిర్వహణ చేపడుతున్నారన్నారు. ఈ-టాయిలెట్‌ విధానం తీసుకువచ్చారని, ఈ అంశాన్ని ఇక్కడ అమలుచేయడానికి ప్రతిపాదనలు చేస్తామన్నారు. మధురై నగరం తమిళనాడులో మూడవ బెస్ట్‌ సిటీగా నిలుస్తుందని, టెంపుల్‌ టూరిజం ద్వారా అక్కడ ఆదాయాన్ని పొందుతున్నారన్నారు. ఈ నగరం స్మార్ట్‌ సిటీగా ఎంపికయ్యిందని, మధుర మీనాక్షి దేవాలయం చుట్టూ ప్రాంతాన్ని స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు. అక్కడ మల్టీ కాంప్లెక్స్‌ పార్కింగ్‌ విధానం, ఖాళీ స్ధలాలకు కాంపౌండ్‌ వాల్‌ నిర్మించి వాటిలో వాహనాలను పార్కింగ్‌ చేయించడం, అక్కడ నుంచి చిన్న వాహనాలతో యాత్రికులను సిటీలోకి అనుమతించడం వంటి విధానాలు అమలవుతున్నాయన్నారు. కొయంబత్తూరు నగరం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 16వ స్ధానంలో నిలిచిందని అక్కడ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేదించారని తెలిపారు. మై షాప్‌.. మై బ్యాగ్‌ అన్న నినాదంతో అక్కడ ప్రజలంతా ప్లాస్టిక్‌ నియంత్రణకు సహకరిస్తున్నారన్నారు. డోర్‌ టూ డోర్‌ చెత్త సేకరణ, చెత్తను వేరుచేయడంలో ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలను పరిశీలించడం జరిగిందన్నారు. టాయిలెట్స్‌పై షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించడం ద్వారా ఆదాయం పొందుతున్నారన్నారు. పొల్యూషన్‌ నియంత్రణకు సైకిల్స్‌ ఎక్కువగా ఉపయోగిస్తున్నారన్నారు. ఎక్కడ నుంచైనా సైకిల్‌ను అద్దెకు తీసుకుని వేరే ఎక్కడైనా అప్పగించే విధానం కొనసాగుతుందని, ఇందులో మొదటి గంటకు ఉచితంగా సైకిల్‌ ఇస్తారని, తర్వాత గంటకు రూ.5 ఛార్జి చేస్తున్నారని తెలిపారు. తమ అధ్యయనంలో పరిశీలించిన మేరకు జంక్షన్‌లను అభివృద్ధి పర్చచడంపై ప్రతిపాదనలు రూపొందిస్తున్నామన్నారు. ప్రజలను అకర్షించే విధంగా జంక్షన్‌లలో పౌంటైన్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. పుష్కరవనంలో క్రొకైడైల్‌ పార్కుకు ప్రతిపాదన చేస్తున్నామన్నారు. రాత్రి 10 నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు ఫుడ్‌ కోర్టు ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధితో పాటు, ప్లాస్టిక్‌ నియంత్రణపై దృష్టి పెడతామన్నారు. వ్యర్ధాలు అధికంగా వచ్చే కళ్యాణమండపాలు, ¬టల్స్‌ వద్ద తడిచెత్తను కంపోస్టుగా మార్చే యంత్రాలను ఏర్పాటు చేయిస్తామన్నారు. కుక్కల సమస్యను ఎదుర్కొనేందుకు తాము పరిశీలించిన అన్ని నగరాలలో కూడా ఎబిసి విధానమే అనుసరిస్తున్నారని తెలిపారు. విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, టిడిపి ఛీప్‌ విప్‌ పాలిక శ్రీనివాస్‌, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ కోరుమెల్లి విజయశేఖర్‌, కార్పొరేషన్‌ వైద్యాధికారి డాక్టర్‌ మూర్తిలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here