మిత్రధర్మమా! జగన్ తో స్నేహమా! (శనివారం నవీనమ్)

0
78

మిత్రధర్మమా! జగన్ తో స్నేహమా!
(శనివారం నవీనమ్)
* ఎపి నుంచి 3 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు
* యనమలకు ఛాన్స్?
* చలమలశెట్టికి తెలుగుదేశం మద్దతు?

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభలో మూడుస్ధానాలకు జరిగే ఎన్నికల్లో బిజెపి మిత్రధర్మం తప్పితే మూడవస్ధానంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి గెలుస్తారు. ఇప్పటికీ ఎన్ డి ఎ లో భాగస్వామిగానే వున్న తెలుగుదేశానికే మద్దతు ఇచ్చినా కూడా మూడో స్ధానం గెలవడానికి 2 ఓట్లు తగ్గుతాయి.

రాష్ట్రంలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలలో 105మంది టీడీపీ, 44మంది వైసీపీ, 22 మంది వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారు, నలుగురు బీజేపీకి చెందినవారు ఉన్నారు. టీడీపీ బలం 127. బీజేపీ, టీడీపీ అధికారం నుంచి విడిపోయినా ఎన్‌డీఏలో భాగస్వాములుగా ఉన్నాయి. బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి అండగా ఉంటే టీడీపీ బలం 131కి చేరుతుంది. ఒక్కో రాజ్యసభ అభ్యర్ధికి 45 మొదటి ప్రాధాన్యత ఓట్లు లభిస్తే ఆ అభ్యర్ధి గెలిచినట్లే. ఆ లెక్కన టీడీపీకి చెందిన ఇద్దరు అభ్యర్ధులు సులభంగా గెలుస్తారు. టీడీపీ, బీజేపీలకు కలిపి మిగులు ఓట్లు 41 ఉంటాయి.

వైసీపీ బలం 44. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్ధిగా పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. వైసీపీ నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే వైసీపీ అభ్యర్ధి ఓడిపోతారు. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరనున్నట్లు ప్రచారం ప్రారంభమైంది. ఆ ఇద్దరూ వస్తున్నందునే టీడీపీ మూడవ అభ్యర్ధిని నిలబెట్టే ఆలోచన చేస్తోంది.

అధికారికంగా మూడవ అభ్యర్ధిని నిలబెట్టిన తర్వాత బీజేపీ సభ్యులు ఎదురుతిరిగితే ఏమి చేయాలన్న దానిపై చంద్రబాబు ఏ నిర్ణయానికి రాలేకపోతున్నట్లు సమాచారం. అందుకే వైసీపీ నుండి కొందరు ఎమ్మెల్యే మద్దతు కూడగట్టుకొనే సమర్ధుడైన తటస్తుడు నామినేషన్‌ వేసే పక్షంలో మిగులు ఓట్లను ఆయనకి కేటాయించి మద్దతు పలకాలన్న వ్యూహం నడుస్తోంది.

1982 రాజ్యసభ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేసి పోటీ చేసిన రాయపాటి సాంబశిరావుకు ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న భవనం వెంకట్రామ్‌ కాంగ్రెస్‌ మిగులు ఓట్లను కేటాయిం చేలా చేశారు. ఇతర పార్టీ సభ్యుల మద్దతు కూడగట్టుకున్న రాయపాటి ఆ ఎన్నికల్లో తొలిసారి రాజ్యసభకు ఎన్నిక య్యారు. ఇదే వ్యూహాన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై టీడీపీ అధిష్ఠానంలో చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్‌కు వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన చలమలశెట్టి సునీల్‌ శనివారం టీడీపీ సీనియర్‌ నాయకులను కలవనున్నట్లు సమాచారం. ఆయన ఇండిపెండెంట్‌గా రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేసేందుకే టీడీపీనేతలను కలుస్తున్నారని చెబుతున్నారు.

ఒకవైపు కేంద్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఢీకొంటోంది. ఏపీ హక్కుల సాధనకు పార్లమెంటు వేదికగా కేంద్రంపై పోరాటం చేస్తోంది. దీంతో టీడీపీ, బీజేపీల మధ్య బంధం తెగినట్టే. తాము ఎన్‌డీఏలో కొనసాగుతున్నామని చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. మిత్ర బంధం తెగిపోయి రాజకీయాలు క్షణక్షణానికి మారుతున్న ఈ తరుణంలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. శాసనసభలో బలాబలాలను బట్టి రెండు టీడీపీకి, ఒకటి వైసీపీకి దక్కుతాయి. మూడవస్థానానికి కూడా అభ్యర్ధిని నిలబెట్టి వైసీపీని రాజకీయంగా దెబ్బతీయాలన్న ఆలోచన లో టీడీపీ ఉంది. ఈ పరిస్థితుల్లో మూడవ అభ్యర్ధిని నిలబెట్టడంపై టీడీపీ అధిష్ఠానంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ అభ్యర్ధిని నిలబెట్టాలా లేకుంటే తటస్తుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే టీడీపీకి ఉన్న మిగులు ఓట్లను ఆ అభ్యర్ధికి కేటాయించి మద్దతు పలకాలా అన్న అంశంపై ఒక నిర్ణయానికి రాలేకపోతోంది.

వైసీపీ నుండి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా నామినేషన్‌కు ముందురోజే బయటకు రావాలి. వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా ఇస్తామని టీడీపీ ‌ఆఫర్‌ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది.

టీడీపీ రాజ్యసభ స్థానాలు సులువుగా గెలుచుకొనే రెండు స్థానాల కోసం ఒసిల నుంచి సిట్టింగ్‌ ఎంపీ సీఎం రమేష్‌, మాజీ ఎంపీ కంభంపాటి రామమోహన్‌రావు, రిలయన్స్‌ మాధవ్‌, బిసిలనుంచి ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, బీదా మస్తాన్‌రావు, ఎస్సీ లనుంచి డొక్కా మాణిక్యవరప్రసాద్‌, వర్ల రామయ్య, నల్లగట్ల స్వామిదాసు, సుధారాణి, మాజీ ఎమ్మెల్యేలు హేమలత (చిత్తూరు), మసాల పద్మజ (కర్నూలు) పేర్లను పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తోంది. అభ్యర్ధుల ఎంపిక ఆదివారం జరగనున్న పొలిట్‌బ్యూరో సమావేశంలో ఖరారు కావచ్చు.

మూడు స్థానాలకు నాల్గవ అభ్యర్ధి రంగం లోకి దిగితే ఎన్నికల రాజకీయం రసవత్తరంకానున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here