హారికకు సామాజికసేవా అవార్డు

0
43

రాజమహేంద్రవరం, మార్చి 9 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని వివిధ రంగాల్లో నిష్ణాతులైన నారీమణులకు ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకశాఖ, విశాఖపట్నంకు చెందిన వీరుమా, వి-టీమ్‌ ఈవెంట్స్‌ ఆధ్వర్యంలో అవార్డులను ప్రకటించారు. ఈ నెల 11వ తేదీన విశాఖపట్నంలోని గురజాడకళాక్షేత్రంలో సాయంత్రం ఐదు గంటలకు జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. దేశ, విదేశాల్లోని ప్రముఖ మహిళామణులకు ఇచ్చే ఈ అవార్డుల్లో సామాజిక సేవా రంగంలో చేస్తున్న సేవలకు బిసి సంక్షేమ సంఘం మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి కొల్లివెలసి హారికను ఎంపిక చేశారు. మేధాపాట్కర్‌ సోషల్‌ సర్వీస్‌ అవార్డు కింద ప్రదానం చేస్తున్నట్లు నిర్వాహకుల నుండి కొల్లివెలసి హారికకు ఆహ్వానం అందింది. మొత్తం 11 మందికి అవార్డులను అందచేస్తారు. సామాజికసేవారంగంలో కొల్లివెలసి హారిక(ఆంధ్రప్రదేశ్‌)ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 11వ తేదీన విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మేథాపాట్కర్‌ సామాజికసేవారంగ అవార్డుకు హారిక ఎంపిక కావటంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. బిఎ వరకు చదువుకున్న కొల్లివెలసి హారిక మేఘనా అసోసియేట్స్‌కు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వున్నారు. మహిళలకు ఎవరికి ఏమి కష్టం వచ్చినా వారి సమస్య పరిష్కారం కోసం ముందుండే మహిళా నేతగా ఆమె పేరుపొందారు. బార్లపూడి చారిటబుల్‌ ట్రస్ట్‌ పట్టణ కన్వీనర్‌గా 1998లో ఆమె సేవలందించారు. గాంధీ వాకర్స్‌ క్లబ్‌కి శాశ్వత గౌరవ అధ్యక్షురాలుగా వున్నారు. మహిళా సమస్యలపై జరిగిన పలు పోరాటాల్లో, ఆందోళనల్లో పాల్గొన్నారు. మద్యపానానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో ఆమె కీలక భూమిక వహించారు. 53 ఉచిత వైద్యశిబిరాలను నిర్వహించారు. రక్తదాన శిబిరాలు నిర్వహించడమే కాకుండా ఆమె ఎనిమిది సార్లు రక్తదానం చేశారు. వికలాంగులకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదల జీవనోపాధి కోసం తన వంతు కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా ఎంతో మందికి చేయూతనిచ్చారు. పేద మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించి వారికి కుట్టుమిషన్లు కూడా అందచేశారు. పేద గర్భిణీలకు సీమంతాలు నిర్వహించారు. మహిళా సమాఖ్యలు, స్వచ్చందసేవాసంస్ధలతో కలిసి పారిశుద్ధ్యం మెరుగుపరిచే కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here