ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రం ప్రారంభం

0
43

ప్రభుత్వ పౌర సేవల విస్తృతికి చర్యలు : ఎం.పి. మురళీమోహన్‌

రాజమహేంద్రవరం, మార్చి 11 : ప్రభుత్వం అందిస్తున్న పౌర సేవలను పూర్తిస్థాయిలో ప్రజలు వినియోగించుకోవాలని పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళీమోహన్‌ సూచించారు. నగరంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాస్‌పోర్టు కోసం హైదరాబాద్‌ లేదా విశాఖపట్నం వెళ్ళాల్సి వచ్చేదన్నారు. ఇకపై అలాంటి అవసరం లేకుండా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా రాజమహేంద్రవరంలో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ చొరవతో అన్ని ముఖ్య పట్టణాలలోనూ పాస్‌పోర్టు కేంద్రాలు ఏర్పాటవుతాయన్నారు. విదేశీ చదువులకు వెళ్ళే వారికి, ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళే వారికి పాస్‌పోర్టు సేవా కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని – అతి తక్కువ సమయంలో పాస్‌పోర్టులు పొందే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. నగరాన్ని ఆనుకుని ఉన్న మధురపూడి విమానాశ్రయం నుంచి ప్రస్తుతం పది విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయన్నారు. రానున్న రోజుల్లో రాకపోలు సాగించే విమానాల సంఖ్య 15కు పెరుగుతుందన్నారు. రైల్వే సౌకర్యాలను కూడా ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చే చర్యలు అందజేస్తున్నామని మురళీమోహన్‌ తెలిపారు. గోదావరి జిల్లాల్లో ఐదు రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణాలను ఉద్దేశించామన్నారు. పర్యాటకంగా పిచ్చుకల్లంక ప్రాంతాన్ని, గోదావరి నదిపై ఉన్న హేవలాక్‌ బ్రిడ్జిని అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నామన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నగర శాసనసభ్యులు ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ పాస్‌పోర్టు కార్యాలయ సేవలు సరళీకృతం చేయబడుతున్నాయన్నారు. సాధ్యమైనంత తక్కువ సమయంలో పాస్‌పోర్టుల జారీకి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారన్నారు. శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ పాస్‌పోర్టు పొందాలంటే పలు నియమ నిబంధనలను సరిపుచ్చుకుంటూ శ్రమించాల్సి వచ్చేదని, ఆ పరిస్థితి నుంచి సులువుగా పాస్‌పోర్టులు పొందే అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వపరమైన సేవలను ప్రజలకు మరింతగా చేరువ చేయడంలో భాగంగానే పాస్‌పోర్టు సేవా కేంద్రం నగరంలో ఏర్పాటయ్యిందన్నారు. మేయర్‌ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ రాజమహేంద్రవరం పాస్‌పోర్టు సేవా కేంద్రం వల్ల ప్రజలకు మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. పోస్టు మాస్టర్‌ జనరల్‌ కె.బాలసుబ్రహ్మణ్యన్‌ మాట్లాడుతూ దేశంలో ఇటువంటి కార్యాలయాలు 164 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 165వ కేంద్రంగా రాజమహేంద్రవరంలో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. రీజనల్‌ పాస్‌పోర్టు ఆఫీసర్‌ ఎన్‌.ఎల్‌.పి.చౌదరి మాట్లాడుతూ అత్యవసర సమయాలలో తత్కాల్‌ పాస్‌పోర్టులు కూడా ఈ సేవా కేంద్రం నుంచి జారీ చేస్తామన్నారు. ఇందుకు ఒక సెల్ఫ్‌ అఫిడవిట్‌, రెండు ప్రభుత్వ గుర్తింపు కార్డులతో దరఖాస్తు చేస్తే మూడు లేదా నాలుగురోజుల్లో ప్రక్రియను అమలులో పెట్టే చర్యలు తీసుకుంటామన్నారు. పాస్‌పోర్టు కావలసిన వారు ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని, ప్రస్తుతం 50 పాస్‌పోర్టులు ఇచ్చేందుకు అవకాశం ఉందని, మరో వారంరోజుల్లో వందమందికి పాస్‌పోర్టులు జారీ చేసే వీలుందని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, సబ్‌ కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌వర్మ, పోస్టాఫీస్‌ సూపరింటెండెంట్‌ నేదునూరి రాజారత్నం, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here