సామాజిక న్యాయంలో తెదేపా,వైకాపా దొందూ దొందే

0
105

రాజ్యసభ సీట్ల కేటాయింపే ఇందుకు నిదర్శనం : మాజీ ఎంపి. హర్షకుమార్‌

రాజమహేంద్రవరం, మార్చి 12 : ఏపీలో రాజ్యసభ సీట్లను అభ్యర్ధులకు కేటాయించే విషయంలో సామాజిక న్యాయాన్ని తెదేపా, వైకాపాలు విస్మరించాయని మాజీ పార్లమెంట్‌ సభ్యులు జీ.వి.హర్షకుమార్‌ అన్నారు. రాజీవ్‌గాంధీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో మూడు సీట్లు ఉండగా రెండు తెదేపాకు, ఒకటి వైకాపాకు దక్కనుండగా ఇరు పార్టీలు దళితులకు అవకాశం కల్పించకపోవడం దారుణమన్నారు. పెత్తందారీ వ్యవస్ధలోని అగ్రవర్ణాల పాలన కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఏ మాత్రం మార్పు రాలేదని ధ్వజమెత్తారు. తమ పార్టీకి దళితులే అండ అని పదే పదే చెప్పే నాయకులు సైతం రాజ్యసభ స్ధానాన్ని కేటాయించకపోవడం సరికాదన్నారు. తెదేపా విషయానికొస్తే దళితులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని, వర్ల రామయ్య పేరును తెరపైకి తెచ్చి మొండి చేయి చూపడం అవమానించడం కాదా అని ప్రశ్నించారు. పెత్తందారీ వ్యవస్థ నుంచి రాజ్యాధికారం తొలగిపోతేనే అసమానతలు కూడా తొలగిపోతాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత సామాజిక వర్గానికి చెందిన జనాభా ఎంతమంది ఉన్నారో, రాష్ట్ర పదవుల్లో ఎంతమందికి పదవులు ఇచ్చారో ఆలోచించుకోవాలన్నారు. తెలంగాణాలో మార్కెట్‌ కమిటీల్లో సైతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంటర్మీడియెట్‌లో ప్రభుత్వం విధించిన ఫీజులను విస్మరించి కార్పొరెట్‌ కళాశాల్లో అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని, దీనిపై హైకోర్టులో పిటీషన్లు వేసినా స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి అధిక ఫీజులను నియంత్రించాలన్నారు. వేమగిరిలో అక్రమ మైనింగ్‌ వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని తాను ఆరు రోజుల పాటు నిరసన వ్యక్తం చేశానని, అయినా అధికారులు స్పందించకపోవడంతో ఆకస్మికంగా దండయాత్ర కార్యక్రమం చేపడతానని హెచ్చరించారు. పోరాటానికి సంబంధించి తేదీలు ప్రకటిస్తే తనను గృహ నిర్భంధం చేస్తున్నారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో రామినీడి మురళి, జీవి శ్రీరాజ్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here