లఘు చిత్రాలకూ నంది అవార్డులు

0
43

చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్ధ చైర్మన్‌ అంబికా కృష్ణ

రాజమహేంద్రవరం, మార్చి 14 : సంక్షిప్త చిత్రాలకు కూడా నంది అవార్డులను ప్రదానం చేయాలని యోచిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ అంబికా కృష్ణ తెలిపారు. స్ధానిక శ్రీ వెంకటేశ్వరా ఆనం కళా కేంద్రంలో ఈరోజు నంది నాటకాల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలున్నా నాటకానికి ఒక్క ప్రోత్సాహం అందించి నంది అవార్డులను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని పేర్కొన్నారు. దివంగత నందమూరి తారక రామారావు స్ఫూర్తిని సీఎం చంద్రబాబు అందిపుచ్చుకుని నంది నాటకోత్సవాన్ని 1996 నుంచి కొనసాగిస్తున్నారని కొనియాడారు. నాటక రంగం ప్రస్తుతం ఎంతో వ్యయప్రయాసలతో కూడిందని, అందువలనే నాటక రంగాన్ని బ్రతికించేందుకు ప్రభుత్వం ఎన్నో విధాలుగా ప్రోత్సాహం అందిస్తుందన్నారు. నంది నాటకోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది 360 ఎంట్రీలు రాగా వాటిని కాకినాడ, రాజమహేంద్రవరం, తెనాలి, కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. 82 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనల్లో సుమారు నాలుగు వేల మంది కళాకారులు పాల్గొంటున్నారని, వారందరికి అన్ని సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ఇటీవల కాలంలో సంక్షిప్త చిత్రాలకు కూడా ఆదరణ పెరిగిందని, ఈ దృష్ట్యా సినీ, టీవీ, నాటక రంగాలతో పాటు వాటికి కూడా నంది అవార్డులు ప్రకటిస్తామన్నారు. రాజధాని అమరావతిలో త్వరలో షార్ట్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం ప్రదర్శిస్తున్న నాటికల ఫలితాలను వచ్చే నెల 16న ప్రకటించి హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా అందజేస్తామన్నారు. నంది అవార్డులు గెలుచుకున్న 15 నాటికలను ఎంపిక చేసి అన్ని జిల్లాల్లో ఒక్కో ప్రదర్శన నిర్వహిస్తామని, అయితే కళలకు పుట్టినిల్లయిన రాజమహేంద్రవరంలో మూడు ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆనంద ఆంధ్రప్రదేశ్‌గా తీర్చి దిద్దడమే లక్ష్యంగా తమ సంస్ధ పనిచేస్తోందని, అందులో భాగంగా ఇటీవల పెద్ద హీరోలను కలిసి వారు చేసే షూటింగ్‌ల్లో ఒక్క షెడ్యూల్‌ను ఏపీలో చిత్రీకరించాలని కోరామన్నారు. రూ. 4 కోట్లతో నిర్మించే చిన్న చిత్రాలకు వినోదపు పన్ను మినహాయించాలని, రూ. 10 లక్షల బహుమతి అందించాలని నిర్ణయించి సీఎం దృష్టిలో ఈ అంశాన్ని పెట్టామని తెలిపారు. కళాకారులకు ప్రతి నెల ఫించన్లు అందిస్తున్నామని, తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కళారంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ మాట్లాడుతూ చలన చిత్ర, టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్థకు చైర్మన్‌గా అంబికా కృష్ణను నియమించడం సముచిత నిర్ణయమన్నారు. తొలి నాటిక, తొలి నవలకు నాంది కేంద్రమైన రాజమహేంద్రవరంలో నంది నాటకోత్సవాలను 2014ల ఎంపి మురళీమోహన్‌ సారధ్యంలో ఘనంగా జరిగాయని, ప్రస్తుతం ఆయన పార్లమెంట్‌ సమావేశాల్లో ఉన్నా మనస్సు మాత్రం ఇక్కడే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్‌టిఆర్‌ స్ఫూర్తితో సీఎం చంద్రబాబు 1996లోనే నంది నాటకోత్సవాలకు నాంది పలికారని, కనుమరుగవుతున్న కళా రూపాలను అందరూ ప్రోత్సహించాలన్నారు. సాంస్కృతిక స్ఫూర్తికి ప్రతీకగా, కళాకారులకు కేంద్రంగా ఉన్న ఆనం కళా కేంద్రం అద్దె మొత్తాన్ని తగ్గించి కళలకు ప్రోత్సాహం అందించాలని అధికారులకు గన్ని విజ్ఞప్తి చేశారు. తొమ్మిది రోజుల నాటక ప్రదర్శనలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తొలి నాటిక నందక రాజం రాసిన వావిలాల వాసుదేవశాస్త్రి మనుమడిని సభకు పరిచయం చేశారు. మేయర్‌ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ నాటక రంగం ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులుగా చేసేవారని, ప్రస్తుతం నిరాదరణకు గురవుతున్న ఈ రంగాన్ని ప్రోత్సహించాలని ఆమె సూచించారు. సబ్‌ కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ మాట్లాడుతూ నగరంలో ఉగాది ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని, అందులో భాగంగా ఎఫ్‌డీసీ నుంచి కొన్ని ప్రదర్శనలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ డిప్యూటీ డైరక్టర్‌ ఎం.ఫ్రాన్సిస్‌, ప్రముఖ నటులు జిత్‌ మోహన్‌ మిత్రా, తెదేపా నాయకులు ఆళ్ళ గోవింద్‌, మజ్జి రాంబాబు, రంగస్థల నటుడు మద్దాలి జానకీనాథ్‌, ఎఫ్‌డీసీ జనరల్‌ మేనేజర్‌ శేషసాయి,కాకర్ల సుజన పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here