రాజకీయ పార్టీలకు ధీటుగా బీసీ సంఘం బలోపేతం

0
44

2024 నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడతాం : కేసన

రాజమహేంద్రవరం, మార్చి 16 : రాజకీయ పార్టీలకు ధీటుగా బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేస్తున్నామని సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు తెలిపారు. స్థానిక ఆనం రోటరీ హాలులో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఆయనతోపాటు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు క్రాంతికుమార్‌ హాజరయ్యారు. ముందుగా జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా కొమాండూరి కుమారి, ప్రధాన కార్యదర్శిగా వాసా శివసత్యకుమారి, కార్యదర్శిగా ఎన్‌.పార్వతి, నగర మహిళా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలిగా కొల్లేపల్లి సుభాషిణి, ఉపాధ్యక్షురాలిగా కార్పొరేటర్‌ పితాని లక్ష్మీకుమారి, ముంతా సుమతి, ప్రధాన కార్యదర్శిగా వీర్ల కన్నమ్మ, కార్యదర్శిగా అడపా సింధు ప్రియ, రూరల్‌ అధ్యక్షురాలిగా మొల్లి వినయ్‌కుమార్‌లను నియమిస్తూ కేసన శంకర్రావు నియామక పత్రాలను అందించారు. మహిళా విభాగాన్ని పటిష్ట పరిచే విధంగా కృషిచేస్తున్న జిల్లా అధ్యక్షురాలు జి.వి.ఎస్‌.లక్ష్మీతులసి, గ్రేటర్‌ అధ్యక్షురాలు శీరా లక్ష్మిలను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంఘాన్ని బలోపేతం చేసే క్రమంలో మహిళలు, విద్యార్ధులు, యువకులు, న్యాయవాదులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని తెలిపారు. అంటరానితనం సామాజిక అణచివేతల ప్రాతిపదికగా పొందుపరిచిన రిజర్వేషన్లతో రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ రాజకీయ పార్టీలు చెలగాటమాడుతున్నాయన్నారు. బీసీలకు ఉన్న 33 శాతం రిజర్వేషన్‌ను 44 శాతానికి పెంచాలని కమిషన్‌ సిఫార్సులు చేసినా ఇంతవరకు మోక్షం కలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాంఘిక వెనుకబాటుతనం, రాజ్యాంగ నిబద్ధతతో సంబంధం లేకుండా అగ్ర కులాలకు బీసీ ముద్ర తగిలించి రిజర్వేషన్లు కల్పించాలనుకోవడం దారుణమని, దీనిని మొదటి నుంచి తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడం బీసీ రిజర్వేషన్లను అపహాస్యం చేయడమేనన్నారు. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బీసీ సంఘాన్ని ధీటైన రాజకీయ శక్తిగా తయారు చేస్తున్నామని, 2019 నాటికి తమ లక్ష్యం ఛేధించలేకపోతే 2024నే లక్ష్యంగా చేసుకుంటామన్నారు. బీసీలకు మోసం చేసే రాజకీయ పార్టీలకు తప్పనిసరిగా బుద్ధి చెబుతామన్నారు. క్రాంతికుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో ఓటు రాజకీయాలు నడుస్తున్నాయని, ప్రజా సంక్షేమం వైపు ఎవరూ ఆలోచించడం లేదన్నారు. డిగ్రీలు, పీజీలు చదివి ఎందరో యువత నిరుద్యోగులుగా ఉన్నారని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పర్యటించి కమిటీలు నియమిస్తామని, సంఘాన్ని బలోపేతం చేసి బీసీల పక్షాన నిలుస్తామన్నారు. ఈ ప్రభుత్వానికి గర్జన ద్వారా, నిరసనల ద్వారా లోపాలు తెలియజేసినా సరిదిద్దుకునేందుకు సిద్ధంగా లేదని, ఇకనైనా నాటకాలకు స్వస్తి పలకాలని కోరారు. గ్రేటర్‌ అధ్యక్షులు నరవ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఈనెల 29న వి.ఎల్‌.పురంలో భారీ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. విలేకరుల సమావేశంలో సంఘ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ మార్గాని రామకృష్ణగౌడ్‌, రాష్ట్ర కార్యదర్శి పొడుగు శ్రీను, నగర అధ్యక్షులు మజ్జి అప్పారావు, రూరల్‌ అధ్యక్షులు బిల్డర్‌ చిన్న, బీసీ నాయకులు దాస్యం ప్రసాద్‌, మీసాల గోవిందరావు, ధర్మవరపు శ్రీనివాస్‌, దొమ్మేటి సోమశంకరం, నందం స్వామి, మారిశెట్టి వెంకటేశ్వరరావు, చొక్కాకుల శ్రీనుబాబు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here