మోదీ సర్కార్ ప్రతిష్టను తగ్గించే అవిశ్వాసం (శనివారం నవీనమ్)

0
69

మోదీ సర్కార్ ప్రతిష్టను తగ్గించే అవిశ్వాసం
(శనివారం నవీనమ్)

నరేంద్రమోదీ సారధ్యంలోని కేంద్రప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం ఖరారైపోయింది. అంతమాత్రాన ఆయన ప్రభుత్వ కూలిపోయే అవకాశమేదీలేదు. అసలు ఈ తీర్మానంపై చర్చ జరగకపోయినా ఆశ్చర్యంలేదు. అయితే భాగస్వామ్య పార్టీలే ఎదురు తిరగడం అందుకు దారితీసిన పరిస్ధితులను వివరించడం ద్వారా మోదీ ప్రభుత్వ ప్రతిష్ట దిగజారినట్టు చరిత్రలో నమోదౌతుంది. అత్యున్నత చట్టసభలో రికార్డవుతుంది.

అవిశ్వాసం నోటీసుపై 50 మంది సభ్యుల మద్దతు వుంటే చర్చకు స్వీకరిస్తారు. వెల్ చుట్టూ సభ్యులు గుమిగూడి ఆందోళన చేస్తూండటం వల్ల లెక్కింపునకు అనుకూల ప్రశాంత వాతావరణం లేకపోవడం వల్ల చర్చ చేపట్టలేమని స్పీకర్ ప్రకటించారు. సోమవారం కూడా ఇదే పరిస్ధితి కొనసాగవచ్చు.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సభలో ప్రవేశపెట్టకముందే ఈ తప్పుడు విధానం మొదలైంది. ఉండవల్లి అరుణ్ కుమార్ మొదలైన ఎంపిలు అప్పటి ప్రభుత్వంపై అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. దానిపై చర్చకే అవకాశం ఇవ్వకూడదని కాంగ్రెస్ బిజెపిలు కుమ్మక్కై వెల్ లో ఆందోళన చేసేవారు. రోజలతరబడి ఆదే స్థితి సాగడంతో అప్పటి అవిశ్వాసం పై చర్చే లేకుండా పోయింది.

ఇపుడు కూడా అదే పరిస్ధితి తీసుకురాగల బిజెపి, బిజెపి అనుకూల ఎంపిలు అనేక మంది లోక్ సభలో వున్నారు.

ఎన్డీయే సర్కార్‌ అవిశ్వాసానికి ఒక్కటైన పార్టీలు..వాయిదా తీర్మానాల నుంచి… అవిశ్వాసం వైపు అడుగులు..వైసీపీ నోటీసులు, టీడీపీ హెచ్చరికలు, ఎన్డీయేతర పార్టీల హుంకరింపులు.. ఇలా ఢిల్లీలో రాజకీయం క్షణం క్షణం మారుతోంది. వైసీపీ టీడీపీ వాయిదా తీర్మానాలతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ జగన్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం ఇవ్వగా పార్లమెంట్‌లో టీడీపీ లోక్‌సభాపక్ష నేత  తోట నరసింహం స్పీకర్‌ కార్యాలయానికి వెళ్లి అవిశ్వాస తీర్మానం పత్రికని అందజేశారు. ఇరు పార్టీలు ఇతర పార్టీల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యాయి.

అవిశ్వాస తీర్మానాలకు కాంగ్రెస్‌ పార్టీ సంఘీభావం ప్రకటించింది. ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఆజాద్‌, జ్యోతిరాదిత్య సుమారు 20 పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే అవిశ్వాసానికి సంబంధించిన నోట్‌ను స్పీకరుకు అందించిన వైసీపీ, సోమవారం మరోసారి ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే వైసీపీకి 120 మంది ఎంపీల మద్దతు కూడగట్టింది. కాంగ్రెస్ నుంచి 48, తృణమూల్ కాంగ్రెస్ నుంచి 34, శివసేన నుంచి 18, సీపీఎం నుంచి 9, ఏస్పీ నుంచి 7. ఆమ్ ఆద్మీ నుంచి 4గురు ఎంపీల మద్దతు సంపాదించింది.

టీడీపీ అవిశ్వాస తీర్మానానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. టీడీపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మమత్‌ ట్వీట్‌ చేశారు. అవిశ్వాసం తీర్మానంపై 54 మంది ఎంపీల సంతకాలు చేయించి సోమవారానికల్లా లోక్‌సభలో తీర్మానం చర్చకు వచ్చేలా చేయాలన్నది పార్టీల ప్రయత్నం. ఇక వైసీపీ తీర్మానానికి సీపీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీ ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. అవిశ్వాసయుద్ధానికి సై అన్నాయి. 

తెలంగాణ రాష్ట్ర సమితి ఒకవైపు జాతీయ స్థాయిలో కీలకంగా వ్యహరించాలని నిర్ణయించింది. అయితే దీనిపై ప్రతిపక్షపార్టీల విమర్శలు, తాజా రాజకీయ పరిణామాలతో ఆ గులాబీదళం డైలమాలో పడింది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ఎలా వ్యవహరించాలో తేల్చుకోలేకపోతోంది. చివరి నిముషం వరకు వేచి చూసే నిర్ణయం తీసుకునే అవకాశమే కనిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొత్త చిక్కు వచ్చిపడింది. అదే టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానం. ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టాయి. ఈ అవిశ్వాస తీర్మానమే ఇప్పుడు కెసిఆర్ కు కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. ఆయన కాంగ్రెస్‌, బీజేపీలతో దేశానికి ఒరిగిందేమీలేదని.. ఈ రెండింటికి ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ రావాలన్నారు. దానికి అవసరమైతే తాను నాయకత్వం వహిస్తానని స్పష్టం చేశారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టాయి. కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేస్తున్న కేసీఆర్‌.. వాస్తవానికైతే ఈ తీర్మానానికి మద్దతు తెలపాలి. మరి కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది.

ప్రత్యేకహోదా అంశంపై టీడీపీ, వైసీపీ పెట్టిన అవిశ్వాసానికి మద్దతునిస్తే తెలంగాణకు వచ్చే ప్రయోజనం ఏమిటన్నది అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు రాజకీయ పార్టీలు అవిశ్వాసానికి మద్దతు పలికాయి. టీఆర్‌ఎస్‌ కూడా మద్దతు తెలిపితే ఎన్డీఏ వ్యతిరేక కూటమిలో ఉన్న సంకేతాలు వెళ్తాయన్న వాదన గులాబీ పార్టీ నేతల్లో వినిపిస్తోంది. అవిశ్వాస తీర్మానం పార్లమెంట్‌లో చర్చకు వచ్చే అవకాశమే లేదని టీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది. శుక్రవారం సభ అదుపులో లేకపోవడంతో అవిశ్వాస తీర్మానాలను స్వీకరించడం లేదని స్పీకర్‌ తేల్చి చెప్పారు. దీంతో సోమవారమైనా ఈ తీర్మానాలను స్వీకరిస్తోందో లేదో తెలియదు. అయితే టీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం కేంద్ర ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రానీయకుండా అడ్డుకుంటుందన్న అంచనాలో ఉంది. దీంతో అవిశ్వాస తీర్మానం చర్చకు రాదని.. ఏ నిర్ణయం తీసుకోవాల్సి అవసరం లేదన్నది టీఆర్‌ఎస్‌ శ్రేణుల వాదన. అవిశ్వాస తీర్మానం ఒకవేళ స్వీకరించి సభలో చర్చకు వస్తే ఏం చేయాలన్నదానిపై గులాబీ బాస్‌ దృష్టి సారించారు. అవిశ్వాసానికి మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా రాజకీయంగా మార్పులు వచ్చే అవకాశం లేకపోవడంతో తటస్థంగా ఉండాలన్న యోచనలో టీఆర్‌ఎస్‌ ఉంది. 

అవిశ్వాసం పై చర్చమాట ఎలా వున్నా వివిథ రాష్ట్రాల్లో  వచ్చిన ఉపఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి…? బీజేపీ కంచుకోట గోరఖ్‌పూర్‌తో పాటు సిట్టింగ్ సీటు ఫూల్ పూర్‌లో బీజేపీ పరాజయం దేనికి సంకేతం. 2014లో లోక్‌సభలో 282గా ఉన్న బీజేపీ సీట్లు… నాలుగేళ్ళల్లో 272కి తగ్గడం దేనికి సూచిక..?

2014లో బీజేపీది తిరుగులేని విజయం.. ప్రస్తుతం ‌లోక్‌సభలో మాత్రం అత్తెసరు మెజారిటీనే..! అవును నాలుగేళ్ళల్లో సీన్ చాలా మారిపోయింది. 2014 సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏకి వచ్చిన సీట్లు 3 వందలకు పైనే. ఇందులో ఒక్క బీజేపీకే 282 సీట్లు వచ్చాయి. కూటమితో సంబంధం లేకుండా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినంత మెజారిటీ తెచ్చుకుంది. పైగా కాంగ్రెస్ ముక్త భారత్ పిలుపుతో మిత్రులతో కలసి 21కి పైగా రాష్ట్రాల్లో పాగా వేయగా కేవలం బీజేపీనే 16 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. కానీ సాథారణ ఎన్నికలకు ఏడాది ముందు కమలదళం గుండెల్లో డేంజర్ సైరన్ మొదలైంది. 

2014 తర్వాత బీజేపీ బలం అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. వివిధ కారణాల వల్ల జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. 2014 నుంచి ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 10 సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో రెండు సీట్లు కోల్పోవడంతో బీజేపీ బలం 272కు పడిపోయింది. ఇది సరిగ్గా సింపుల్‌ మెజారిటీ. ఎన్డీఏ మిత్ర పక్షాలతో సంబంధం లేకుండా ఉంటే బీజేపీకి ఒక్క సీటు తగ్గినా సాంకేతికంగా ప్రభుత్వం మైనారిటీలో ఉన్నట్లే లెక్క. దేశవ్యాప్తంగా మరో ఏడు సీట్లకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అవి కూడా పూర్తయితే 2019లో బీజేపీ భవిష్యత్ ఏంటో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here