కంగాళీయం

0
43

మనస్సాక్షి – 1081

క్రికెట్‌ పుట్టి వందేళ్ళు దాటిపోయింది. ఈ వందేళ్ళలో క్రికెట్‌లో ఎన్నో మార్పు లొచ్చాయి. టెస్ట్‌ క్రికెట్‌ నుంచి వన్డే క్రికెట్‌, ఆపైన 2020 క్రికెట్‌.. యిలా చాలా మార్పులొచ్చాయి. అయితే యిప్పు డొచ్చిన ఓ మార్పు క్రికెట్‌ ఆటలో పెను సంచలనాన్నే కలిగించింది. ఆ మార్పు తెచ్చింది ఎవరో ప్రముఖ క్రికెటరో, యింకో క్రికెట్‌ పండితుడో అనుకుంటే పొరబాటే. క్రికెట్‌ గురించి పెద్దగా తెలీని ఓ సామాన్యుడంతే. యింతకీ ఆ సామాన్యుడు వెంకటేశం..!

——-

వెంకటేశానికి బొత్తిగా దిగులుగా ఉంది. ఆ దిగులేదో యింకా తనకి ఉద్యోగం రాలేదనో, లేకపోతే రాజ కీయాల్లో దూరి దున్నెయ్యడం లేదనో కాదు. మరి.. తన జీవితం బొత్తిగా నిరర్ధకంగా గడిచిపోతుందనీ, ఈ సొసైటీకి ఏం చేయలేకపోతున్నాననీ, సరిగ్గా అలాంటి సమయంలో మీడియాలో వచ్చిన ఓ వార్త వెంకటేశాన్ని ఆకర్షించింది. అది.. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టిఫెన్‌ హాకింగ్‌ మరణించాడన్న వార్త. చాలా చిన్న వయసులోనే కాళ్ళూ, చేతులూ చచ్చుబడిపోయి చక్రాల కుర్చీకి పరిమితమయిపోయిన హాకింగ్‌ చేసిన అద్భుత పరిశోధనల గురించి చదువుతుంటే మతిపోతోంది. ఆ పరిశోధనలేవో ప్రపంచానికి ఎంతో ఉపయోగపడేవి. అదంతా చదువుతుంటే వెంకటేశానికి ఊపొచ్చేసింది. తనూ ఏదో కనిపెట్టి ఈ ప్రపంచానికి అందించాలను కున్నాడు. అయితే హాకింగ్‌ చేసినలాంటి పరిశోధనలు చేయడానికి తనేవీ సైన్స్‌ స్టూడెంట్‌ కాదాయె. మరింకెలాంటి ఆవిష్క రణ ఈ ప్రపంచానికి అందిద్దామా అని ఆలోచిస్తుంటే అప్పుడు వచ్చిందా ఆలోచన. వెంటనే తన ఆలోచనంతా పేపరుమీద పెట్టాడు. కొన్ని కొన్ని పాయింట్లు రాసుకున్నాడు. చిట్టచివరికి తననుకున్న ఆలోచనకి తుది రూపం వచ్చింది. అలా ఆ క్షణంలో వెంకటేశాని కొచ్చిన ఆలోచన క్రికెట్‌ క్రీడ రూపురేఖల్ని మార్చేసింది.

——-

వెంకటేశం చాలా తొందరలోనే తనకొచ్చిన ఆలోచనని అమల్లో పెట్టే బీపనిలో పడ్డాడు. గంగలకుర్రులో తనకున్న రెండెకరాల పొలాన్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ కింద మార్చేశాడు. అసలయితే అక్కడేం జరుగుతుందో ఊళ్ళోవాళ్ళని అర్థంకాలేదు. ఈలోగా విషయం తెలిసి గిరీశం పరిగెత్తు కొచ్చాడు. ”ఏవివాయ్‌.. యిక్కడేదో క్రికెట్‌ గ్రౌండ్‌ తయారు చేయిస్తున్నావట..” అన్నాడు అర్థంకానట్టుగా. వెంకటేశం తలూపి ”ఆ.. ఏదో మామూలు క్రికెట్‌ అడటానికయితే యిదంతా నేనెందుకు చేస్తానంటారు.. యిప్పుడాడేది క్రికెట్‌ కాదు వెంకట్‌. నేనే దీన్ని కనిపెట్టాకదాని నాపేరేదో పెట్టేసుకున్నాలెండి” అన్నాడు. ఆపాటికి బుర్ర వేడెక్కిపోయిన గిరీశం చుట్ట గుప్పుగుప్పుమనిపించి” యింతకీ నువ్వేం చేస్తున్నావో, ఎందుకు చేస్తున్నావో అర్థం కావడం లేదు అన్నాడు. అప్పుడు వెంకటేశం ”ఈ ప్రపంచానికో మహత్తరమయిన ఆటని అందించబోతున్నా గురూగారూ.. కావలిస్తే ఆ ఆట జరిగే టప్పుడు మీరూ వచ్చి చూడొచ్చు” అన్నాడు. గిరీశానికయితే ఆ ఆటెలా ఉండబోతుందో అన్న ఆత్రం పెరిగిపోయింది. ఈలోగా ఆనోటా ఆనోటా తెలిసి ఈ కొత్త రకం క్రికెట్‌.. అదే.. వెంకట్‌ ఆట చూడ్డానికి మర్నాడు చాలామంది తరలివచ్చారు. మొత్తానికి అనుకున్న సమయానికి ఆ ఆటేదో మొదలయింది. గ్రౌండ్‌ మధ్యలో వికెట్లు పెట్టుబడి ఉన్నాయి. అయితే అదేదో మామూలు క్రికెట్‌ మ్యాచ్‌లోలా ఎదురెదురుగా రెండుచోట్ల మాత్రమే వికెట్లు పెట్టి లేవు. మొత్తం నాలుగుచోట్ల ఆ వికెట్లేవో ఉన్నాయి. అంటే ఓ రకంగా పిచ్‌కి పక్కనే యింకో పిచ్‌ ఏర్పాటు చేసి దానికి అటూ యిటూ కూడా వికెట్లు పెట్టారు. అంటే మొత్తం మీద చదరంగా నాలుగు పాయింట్లలో వికెట్లు న్నాయి. యిదేంటన్నది ఎవ రికీ అర్థం కావడం లేదు. యింతలోనే ఆ ఆటేదో మొదలయింది. మొదటగా ఓ ఎండ్‌ నుంచి ఒక బౌలరొచ్చి వేగంగా బాల్‌ విసి రాడు. అయితే ఆ బాల్‌ని వేసింది ఎదురుగా ఉన్న వికెట్ల దగ్గరున్న బ్యాట్స్‌మేన్‌కి కాదు. ఆ పక్కనే ఉన్న రెండో పిచ్‌లో అవతలివైపు వికెట్ల దగ్గర నిలబడున్న బ్యాట్స్‌మెన్‌కి..! దాంతో అంతా షాకయ్యారు. యింతలోనే ఆ బ్యాట్స్‌మెన్‌ ఆ బాల్‌ని గాల్లోకి కొట్టడం, దాన్ని కాస్తా ఓ ఫీల్డర్‌ పరిగెత్తుకొచ్చి పట్టు కోవడం జరిగిపోయాయి. యింతలో యింకో గమ్మత్తు జరిగింది. అవుటయి పోయిన బ్యాట్స్‌మేన్‌ స్థానంలో తర్వాత రాబోయే బ్యాట్స్‌ మేన్‌ కోసం అంతా ఆత్రంగా చూశారు. అయితే పెవిలియన్‌ నుంచి ఎవరూ రాలేదు. అంతకుముందు క్యాచ్‌ పట్టిన ఫీల్డరే బ్యాటింగ్‌ కొచ్చేశాడు. అవు టయిపోయిన బ్యాట్స్‌మేన్‌ కాస్తా ఫీల్డింగ్‌ చేయడానికెళ్ళిపోయాడు. అంతా జరుగుతున్నదంతా నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. యింతలోనే యిందాక బౌలర్‌ తన బౌలింగ్‌ కొనసాగించాడు. కొత్తగా క్రీజ్‌లోకి వచ్చిన బ్యాట్స్‌మేన్‌కి ఓ రెండు బాల్స్‌ వేశాడు. తర్వాత యింకో మూడు బాల్స్‌ తన ఎదురుగా వికెట్ల ముందు బ్యాట్స్‌మేన్‌కి విసి రాడు. అక్కడితో ఓవర్‌ పూర్తయినట్టయింది. అప్పుడింకో గమ్మత్తు జరిగింది. అప్పటిదాకా బౌలింగ్‌ చేసిన బౌలర్‌ కాస్తా అంపైరింగ్‌కి వెళ్ళాడు. అప్పటిదాకా అంపైరింగ్‌ చేసిన శాల్తీ కాస్తా బ్యాటింగ్‌ కొచ్చేసింది. ఈ ట్విస్ట్‌లు తట్టుకోలేక మ్యాచ్‌ చూడటానికొచ్చిన వాళ్ళలో సగం మంది మూర్చపోయారు..!

——-

”గురూగారూ… రాత్రి యిలాంటి కంగాళీ కలొచ్చింది. చదవేస్తే ఉన్న మతి పోయిందంటారు. యిదేవయినా ఆ బాపతంటారా?” అన్నాడు వెంకటేశం. అంతా శ్రద్ధగా విన్న గిరీశం ”ఈ మధ్య ఆ రాంగోపాల్‌వర్మ సినిమాలాంటిదేవయినా చూడటంగానీ లేకపోతే నిన్న ఉగాది పచ్చడిలాంటిది ఎక్కువగా లాగించడం గానీ చేశావుటోయ్‌” అంటూ అడిగాడు. దాంతో వెంకటేశం వెంటనే ”అబ్బే.. అదేం లేదు గురూ గారూ..” అన్నాడు. దాంతో గిరీశం మళ్ళీ ఆలోచనలోపడ్డాడు. యింత లోనే ఏదో తట్టినట్టుగా ”అసలిదంతా ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పార్టీల ఆటోయ్‌.. అదేంటంటావా.. అసలు ఏ క్షణంలో ఏ పార్టీ ఎలా ప్రవర్తిస్తుందో, ఎలా మారిపోతుందో ఎవరికయినా అంతుపడుతుందా అని. మొన్నటి వరకూ మిత్రులుగా ఉన్న టిడిపి, బిజెపిలు శత్రువులయిపోయారు. యింకోపక్క మొన్నటి దాకా టిడిపిని సపోర్ట్‌ చేసిన పవన్‌ కాస్తా యూటర్న్‌ తీసు కుని బాబుగారినీ, చిన్నబాబుగారినీ ఏకిపారెయ్యడం ఊహించని పరి ణామం. యిప్పుడు ఆ పవన్‌ అటు బిజెపితో కలుస్తాడా, యిటు వైఎస్‌ఆర్‌సిపితో కలుస్తాడా అన్న అనుమానాలు మొదలయ్యాయి. యింకోపక్క పవన్‌ తన ప్రసంగాల్లో ‘భారతమాతాకీ జై’ అనడం ద్వారా బీజెపీ వర్గాల్ని సంతోషపెట్టినా, యింకోపక్క వామపక్షాలతో సమావేశానికి సై అనడం అందరినీ గందరగోళంలో పడేస్తోంది. ఎంత యినా వామపక్షాల తీరూ, సిద్ధాంతాలూ అందరికంటే విభిన్న మాయె.. యింకోపక్క జగన్‌ బీజేపీతో దోస్తీ కట్టొచ్చన్న ఊహలూ ఎక్కువ య్యాయి. జరుగుతున్న సంఘటనలు అలాగే ఉన్నాయాయె. మొత్తా నికి ఎలక్షన్స్‌ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ పార్టీల తీరు రూల్స్‌ లేకుండా ఆడే ఆటలా ఉంది. ఏతావాతా తెలుసుకోవలసిందేం టంటే.. రాజకీయాల్లో శాశ్వతమిత్రులూ ఉండరు. శాశ్వత శత్రువులూ ఉండరు. తమ మైలేజ్‌ కోసం ఈ పార్టీలు ఎన్ని విన్యాసాలైనా చేస్తాయి. ఎలక్షన్స్‌ అయ్యే వరకు అవన్నీ చూడక తప్పదు” అంటూ వివరించాడు.

– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here