గౌతమ ఘాట్‌ అక్షర కోటి గాయత్రీ పీఠంలో 25న సీతారాముల కల్యాణం

0
46

రాజమహేంద్రవరం, మార్చి 23 : నగరంలోని గౌతమఘాట్‌ శ్రీ అక్షర కోటి గాయిత్రి పీఠంలో తొలిసారిగా ఈ నెల 25 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. ఇక్కడ 24వేల రామాయణ శ్లోకాలను ఇత్తడి రేకులపై తాపడం చేసే పని ప్రారంభించి ఇప్పటికే 216 శ్లోకాల తాపడం పూర్తయిన నేపథ్యంలో అందునా శ్రీరాముడు జన్మించిన శ్రీ విళంబి నామ సంవత్సరంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు పీఠం వ్యవస్థాపకులు సవితాల చక్ర భాస్కరరావు చెప్పారు. పీఠంలో ఈరోజు ఉదయం సవితాల హిమబిందు, రామక ష్ణలతో కల్సి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 25వ తేదీ ఆదివారం ఉదయం విఘ్నేశ్వర పూజతో కార్యక్రమాలు ప్రారంభించి, అనంతరం 12గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు.రామాయణానికి బీజం గాయత్రీ మంత్రమేనని, అటువంటి గాయత్రీ పీఠంలో సీతారాముల కల్యాణం నిర్వహించడం పెద్ద విశేషమన్నారు. గాయత్రి మంత్రంలోని 24అక్షరాలను ఆధారం చేసుకుని 24వేల రామాయణ శ్లోకాలు వాల్మీకి మహర్షి రచించారని, గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరాన్ని ప్రతి వెయ్యి శ్లోకాల తర్వాత ఒకటి వచ్చేలా రామాయణ రచన చేసారని ఆయన చెబుతూ, అందుకే గాయత్రి పీఠంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి ఓ ప్రత్యేకత ఉంటుందన్నారు. గాయత్రీ పీఠం కట్టింది ఒకరే అయినా దీని నిర్వహణలో వేలాది మంది పాలుపంచుకోవాలన్న ఉద్దేశ్యంతో భక్తుల సహకారంతో రామాయణ శ్లోకాలను ఇత్తడి రేకులపై తాపడం చేయిస్తున్నామని చక్రభాస్కరరావు చెప్పారు. ఇత్తడి రేకులపై చేసే పనిని అజయ్‌ అనే వ్యక్తికీ అప్పగించామని, 216శ్లోకాలను తాపడం చేయగా, మరో 70 సర్గలు సిద్ధం అయ్యాయని, శ్రీ సీతారాముల కళ్యాణం సందర్బంగా కొంచెం శ్రమ అయినప్పటికీ వాటిని రప్పించి, పూజలు నిర్వహించాక మళ్ళీ తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఏలేశ్వరానికి చెందిన గాదావఝల రాజేశ్వరరావు (రాజు) బ్రహ్మత్వంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుందని, పీఎంకే సత్రం స్మార్త పాఠశాల విద్యార్థులు వేదపఠనం చేస్తారని ఆయన చెప్పారు. ప్రవచన రాజహంస డాక్టర్‌ ధూళిపాళ మహాదేవమణి వ్యాఖ్యానం చేస్తారని ఆయన చెప్పారు. స్మార్త సాంప్రదాయం ప్రకారం నవమి తగులు సందర్బంగా 25న శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక నుంచి శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించడంతో పాటు 10వ అంతస్థులో శ్రీ రామ పట్టాభిషేక ప్రతిష్ఠాపన ద్వారా ఆకాశ రామన్న కొలువు దీరేలా చేయాలనీ భావిస్తున్నట్టు చక్రభాస్కరరావు తెలిపారు. 25వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు తరలి రావాలని ఆయన కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here